తూర్పు వెళ్లే రైలు.. చకచకా

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య కీలక ప్రాంతంలో ప్రత్యామ్నాయ రైలుమార్గం సిద్ధమవుతోంది. విజయవాడ-భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌ విద్యుదీకరణ పనులు తుది దశకు చేరాయి.

Published : 15 Aug 2021 04:51 IST

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో కీలక ప్రత్యామ్నాయం

మూడు, నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి

తుదిదశలో విజయవాడ-భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌ విద్యుదీకరణ

ఈనాడు - హైదరాబాద్‌

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య కీలక ప్రాంతంలో ప్రత్యామ్నాయ రైలుమార్గం సిద్ధమవుతోంది. విజయవాడ-భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌ విద్యుదీకరణ పనులు తుది దశకు చేరాయి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌, చెన్నైల నుంచి విశాఖపట్నం, కోల్‌కతా వైపు రాకపోకలు మరింత సులభమవుతాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు రైలు అనుసంధానత పెరుగుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మీదుగా పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్లే రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఉంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య ట్రాక్‌ సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నాయి. వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి కైకలూరు మీదుగా నిడదవోలు వరకు ఉన్న రైలు మార్గం సింగిల్‌ లైన్‌. విద్యుదీకరణ లేకపోవడంతో తక్కువ వేగంతో, డీజిల్‌ ఇంజిన్లతో రైళ్లు ప్రయాణిస్తున్నాయి.

ఈ సమస్యల నివారణకు విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు లైను డబ్లింగ్‌, విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు బాధ్యతల్ని రైల్‌వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) నిర్వహిస్తోంది. భీమవరం నుంచి నరసాపురం వరకు, గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు డబ్లింగ్‌, విద్యుదీకరణ ఇందులో ఉన్నాయి. ఉప్పులూరు-గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-భీమవరం డబ్లింగ్‌, విద్యుదీకరణ ఇప్పటికే పూర్తయ్యాయి. ఉప్పులూరు-విజయవాడ రెండు, మూడురోజుల్లో అందుబాటులోకి వస్తుంది. భీమవరం-నరసాపురం-నిడదవోలు పనులు తుదిదశలో ఉన్నాయి.


ప్రాజెక్టు విశేషాలు

* మంజూరైన సంవత్సరం 2011-12

* అంచనా వ్యయం: రూ.1428.70 కోట్లు

* దూరం: 221 కి.మీ.

* పూర్తి చేయాల్సిన గడువు: 2021 నవంబరు

* నిర్మాణం పూర్తయిన మార్గం: 125 కి.మీ.

* రెండు రోజుల్లో పూర్తి కానున్నది: 17 కి.మీ.

* నిర్మాణంలో ఉన్న మార్గం: 79 కి.మీ.


ప్రత్యామ్నాయంతో వడివడిగా...

రైల్వేబోర్డు ప్రాధాన్య జాబితా ‘సూపర్‌ క్రిటికల్‌’ ప్రాజెక్టుల్లో ఇది ఉంది. పనులు డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ లైనుతో విశాఖపట్నం వైపు రైళ్ల వేగం పెరుగుతుంది. హైదరాబాద్‌, చెన్నైల నుంచి విశాఖట్నం వైపు వెళ్లే వారికి, ఇటు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గుడివాడ, ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల వారికి ప్రయాణం సులభతరమవుతుంది. మచిలీపట్నం, నరసాపురం స్టేషన్ల నుంచి కొత్త రైళ్లు ప్రారంభించవచ్చు. విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

- ఎం.ఉమాశంకర్‌కుమార్‌, జనరల్‌ మేనేజర్‌, ఆర్‌వీఎన్‌ఎల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు