ఎకరా లీజు రూ.8

అడవులను ఆదాయ వనరుగా చూడరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా అటవీశాఖ వ్యవహరిస్తోంది. వేలాది ఎకరాల అటవీ భూములను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ)కు

Updated : 23 Aug 2021 05:28 IST

ఎఫ్‌డీసీకి అటవీభూమిని కట్టబెడుతున్న అటవీశాఖ
తమకూ అదే ధరకు భూములు లీజుకు ఇవ్వాలని గిరిజనుల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అడవులను ఆదాయ వనరుగా చూడరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా అటవీశాఖ వ్యవహరిస్తోంది. వేలాది ఎకరాల అటవీ భూములను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ)కు అతితక్కువ ధరకు లీజుకిచ్చి ఆదాయం పొందుతోంది. ఈ లీజు ద్వారా సదరు సంస్థ భారీగా సొమ్ములు ఆర్జిస్తున్నా అడవి బిడ్డలకు ఎటువంటి ప్రయోజనం కలిగించడంలేదు. ఓ సామాజిక కార్యకర్త స.హ.చట్టం ద్వారా ఎఫ్‌డీసీ అటవీ భూముల లీజు విషయాన్ని వెలుగులోకి తేవడంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఎఫ్‌డీసీకి రూ.100 కోట్ల ఆదాయం

క్షీణించిన అటవీ ప్రాంతాల్లోని భూమిని హెక్టారుకు రూ.20(ఎకరా లీజు రూ.8) చొప్పున ఎఫ్‌డీసీకి అటవీశాఖ లీజుకు ఇస్తోంది. ఇలా రాష్ట్రంలోని 55,696 ఎకరాల్లో ఎఫ్‌డీసీ జామాయిల్‌, వెదురు, సుబాబుల్‌ సాగు చేస్తోంది. ఈ పంటను కాగితపు మిల్లులకు సరఫరా చేయడం ద్వారా ఏటా రూ.వంద కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇంత ఆదాయం ఉన్నా ఆ సంస్థకు అటవీశాఖ అతి తక్కువకు లీజుకు ఇస్తుండటాన్ని గిరిజనులు తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో అడవిపై వ్యాపారం చేయడానికి ఏ సంస్థకు హక్కులు లేవని చెబుతున్నారు.

గిరిజనులకేదీ ఆదాయం

గిరిజనుల భాగస్వామ్యం లేకుండా ఏ వ్యాపారం చేయొద్దని ఏజెన్సీ (1970) చట్టం చెబుతోంది. ఏ హక్కులైనా గిరిజనులకు మాత్రమే ఉంటాయనేది చట్టం నిబంధన. 2006-2007లో రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) చట్టం కింద గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇచ్చింది. వీటిని కూడా అటవీశాఖ అధికారులు అనుమతించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీల పెంపు పేరుతో హక్కులున్న భూములను కూడా లాక్కుంటున్నారని వారు చెబుతున్నారు. భూములను వ్యాపారానికి ఇచ్చినట్లే తమకు కూడా లీజుకు ఇవ్వాలని కోరుతున్నారు.


అడవిని ఆదాయ వనరుగా చూడొద్దు
- మాలోత్‌ లీలా, గ్రీన్‌ ఎర్త్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి, పాల్వంచ

అటవీశాఖ పోడు భూములను బలవంతంగా లాక్కుంటోంది. ఎఫ్‌డీసీకి జామాయిల్‌ వ్యాపారానికి లీజుకు ఎలా ఇచ్చింది. అడవులను ఆదాయ వనరుగా చూడొద్దని సమతా జడ్జిమెంట్‌ (1997) సూచిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయం నుంచి 20 శాతం గిరిజనులకు ఇవ్వాలి. అసలు ఏ చట్టం ప్రకారం గిరిజనులను కాదని ఏజెన్సీలో వేలాది ఎకరాలు వ్యాపార కార్యకలాపాలకు ఇస్తున్నారు. ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు