మైత్రీ బంధం.. మరింత దృఢం

వ్యూహాత్మక భాగసామ్యంలో భారత్‌, అమెరికా మైత్రీ బంధం మరింత దృఢతరం కానుంది. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ,....

Updated : 25 Sep 2021 09:16 IST

భారత్‌-అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం

మోదీతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు

క్లిష్ట సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొనబోతున్నాం: బైడెన్‌

సాంకేతిక, ఆర్థిక రంగాల్లో మరింత సహకారం: మోదీ

పర్యావరణం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ

వాషింగ్టన్‌


అమెరికా-భారత్‌ సంబంధాల్లో ఈ రోజు మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. కొన్ని క్లిష్టమైన సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొనబోతున్నాం. 40లక్షల మంది భారతీయ అమెరికన్లు నిత్యం అమెరికాను బలోపేతం చేసే కృషిలో నిమగ్నమయ్యారు.

- శ్వేతసౌధంలో మోదీకి స్వాగతం పలుకుతూ బైడెన్‌


వ్యూహాత్మక భాగసామ్యంలో భారత్‌, అమెరికా మైత్రీ బంధం మరింత దృఢతరం కానుంది. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, అఫ్గానిస్థాన్‌ పరిణామాలు, కొవిడ్‌పై ఉమ్మడిపోరు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక, రక్షణ సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించాయి. శుక్రవారం ఉదయం శ్వేతసౌధానికి చేరుకున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకూ ఫోన్‌ ద్వారా సంభాషించుకున్నారు.

వర్చువల్‌ సమావేశాల ద్వారా మాత్రమే కలుసుకున్నారు. 2014, 2016లలో వీరు కలుకున్నప్పటికీ అప్పుడు బైడెన్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శ్వేతసౌధంలో మోదీకి స్వాగతం పలుకుతూ... ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అత్యంత దృఢంగా, సన్నిహితంగా ఉండడం నిర్ణయాత్మకమని’’ బైడెన్‌ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని ప్రస్తావిస్తూ...బాపూజీ అహింస, సహనం, శాంతి సందేశాలు ప్రపంచానికి గతంలో కన్నా నేడెంతో అవసరమని పేర్కొన్నారు. సాదర స్వాగతానికి మోదీ కృతజ్ఞతలు చెబుతూ...‘2014, 2016లలోనూ మీతో మాట్లాడే అవకాశం లభించింది. భారత్‌-అమెరికా సంబంధాలపై మీ దార్శకతను అప్పుడు వెల్లడించారు. దీనిని సాకారం చేసేందుకు మీ నేతృత్వంలో కృషిని కొనసాగించడం హర్షణీయమ’ని అన్నారు. వాణిజ్యం, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం రెండు దేశాల స్నేహ సంబంధాల్లో కీలక భూమిక వహించనుందని తెలిపారు.

‘భూమికి ధర్మకర్తలా వ్యవహరించడం గురించి మహాత్మా గాంధీ నిత్యం చెబుతూ ఉండేవారు. ధర్మకర్తృత్వం అనే భావన ప్రపంచవ్యాప్తంగా నేటి తక్షణావసరం. 21వ శతాబ్దపు మూడో దశక ప్రారంభ సంవత్సరంలో మీ నేతృతంలో నాటే విత్తనాలు భారత్‌-అమెరికా స్నేహ బంధాన్ని మరింతగా వృద్ధిచెందేలా చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సమాజాల రూపాంతరీకరణకూ ఇది నిదర్శనంగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. అగ్రనేతలిద్దరి భేటీలో ఇరు దేశాల ఉన్నతాధికారులతో పాటు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, కార్యదర్శి శ్రింగ్లా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు తదితరులు పాల్గొన్నారు.


‘భారత్‌లో బైడెన్‌ బంధువులు...’

భారత దేశంలో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టుకోవడంపై బైడెన్‌ సరదాగా మాట్లాడారు. 1972లో సెనెటర్‌గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు బైడెన్‌ అని పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెబుతూ.. ఆ మరుసటి రోజే భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెపుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవ్వాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన మోదీ... ‘వారు మీ బంధువులే’ అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని