TSRTC: దసరా బాదుడు షురూ

దసరా టికెట్ల బాదుడు మొదలవుతోంది. ప్రైవేటు ట్రావెల్‌ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. అందులోనూ రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న సర్వీసుల్లో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఆరో తేదీ నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో ఇటు ఆర్టీసీ,

Updated : 05 Oct 2021 10:13 IST

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం పెంపు
ప్రైవేటులోనూ భారీగా వడ్డన

ఈనాడు, హైదరాబాద్‌: దసరా టికెట్ల బాదుడు మొదలవుతోంది. ప్రైవేటు ట్రావెల్‌ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచుతున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. అందులోనూ రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న సర్వీసుల్లో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఆరో తేదీ నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా వేల సంఖ్యలో సర్వీసులు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా ఏడో తేదీ నుంచి బస్సుల సంఖ్య పెంచాయి. ప్రైవేటు సంస్థలు టికెట్‌ ధరను 100 నుంచి 125 శాతం పెంచాయి. పండగ దగ్గర పడే కొద్దీ అవి మరింత పెరుగుతాయని అంచనా. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖలకు డిమాండ్‌ ఉంటుంది. విజయవాడకు ఏసీ స్లీపర్‌ బస్సుల్లో టికెట్‌ రూ. 1,100కు విక్రయిస్తున్నారు. నాన్‌ ఏసీ స్లీపర్‌ ధర రూ. 1,000, వోల్వో అయితే ఆ ధర రూ. 2,000 వరకు పలుకుతోంది. ఏసీ బస్సుల్లో సీటుకు రూ. 1,000 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ. 500 నుంచి రూ. 600 వరకు మాత్రమే. విశాఖపట్నం మార్గంలో బస్సు స్థాయిని బట్టి రూ. 1,100 నుంచి రూ. 3,000 వరకు ఉంది. రాజమండ్రి మార్గంలో టికెట్‌ ధర రూ. 900 నుంచి రూ. 2,000 వరకు పలుకుతోంది. ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల టికెట్‌ ధరను 50 శాతం పెంచింది. గతంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు పుంజుకున్నాయని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ 4,035 సర్వీసులు  
పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 4,035 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు 950, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,085 సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఎనిమిదో తేదీ నుంచి వీటిని కేటాయించింది. అత్యధికంగా 14వ తేదీన 889 సర్వీసులను, అతి తక్కువగా 15వ తేదీన 84 సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా నాలుగైదు వేల సర్వీసులు నడపనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని