The Great Resignation: మనసు విరిగిన ఉద్యోగి

కొవిడ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. భయానక జీవన పరిస్థితులను కళ్లకు కట్టింది. కుటుంబం విలువేమిటో, డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో

Updated : 15 Oct 2021 05:24 IST

కొవిడ్‌ పాఠాలతో కొత్త మార్గాల అన్వేషణ

ప్యాకేజీలు పెంచినా ఆగని రాజీనామాలు

అగ్రదేశాల్లో ‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ సునామీ!

వాషింగ్టన్‌: కొవిడ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. భయానక జీవన పరిస్థితులను కళ్లకు కట్టింది. కుటుంబం విలువేమిటో, డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. మహమ్మారి పుణ్యమాని అనేకమంది కొలువులు కోల్పోయారు. కంపెనీల ఆదాయం తగ్గడంతో.. ఉద్యోగాలు ఉన్నా, వేతన జీవులకూ వెతలు తప్పలేదు. కరోనా నెమ్మదించి, ప్రస్తుతం వ్యాపారాలు పుంజుకొంటున్నాయి. ఆకర్షణీయ జీతాలు, ప్యాకేజీలు ఇస్తామని ఇప్పుడు కంపెనీలు ప్రకటిస్తున్నా... చాలామంది ఉద్యోగులు ఉండటం లేదు. కొలువులను ధైర్యంగా వదిలేసి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’గా పిలిచే ఈ సంక్షోభం అగ్రరాజ్యాలను కుదిపేస్తోంది.


ఏ రంగాల్లో అంటే..

రిటైల్‌, గోదాములు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్‌ విభాగాల్లో మాత్రం రిజిగ్నేషన్లు రికార్డుస్థాయిలో ఉంటున్నట్టు బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ చెబుతున్నాయి. ఇలాంటి వారిలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ పరిణామాన్ని ‘ఒత్తిడి వాతావరణంలో పనిచేస్తున్నా తక్కువ వేతనాలు అందడంపై తిరుగుబాటు’గా వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొంది. టెక్సాస్‌లో ఓ మహిళ వాల్‌మార్ట్‌పై ఆరోపణలుచేస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పెట్టింది. దీంతో ఆ సంస్థ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అగ్రరాజ్యంలో మహిళలు భారీ సంఖ్యలో కొలువులను వీడుతున్నట్లు కార్మిక విభాగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా సమయంలో పని వాతావరణానికి ప్రాధాన్యం పెరగడం కూడా ఉద్యోగుల రాజీనామాలకు కారణమవుతున్నట్టు ‘స్టేట్‌ ఆఫ్‌ వర్క్‌ ఇన్‌ అమెరికా’ సర్వేలో వెలుగులోకి వచ్చింది.


పరిశ్రమలకు తిప్పలు..

అమెరికాలో గత ఆగస్టు నాటికి 1.4 కోట్ల కొలువులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు ఉన్న ఉద్యోగులను కాపాడుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తూనే, మరోవైపు ప్రతిభావంతులను భారీ జీతాలు ప్రకటిస్తున్నట్టు ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లాట్జ్‌ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా రెస్టారెంట్లు, బార్లలో పనిచేసేవారి గంట వేతనం 15 డాలర్లకు చేరడం గమనార్హం! అమెజాన్‌, సీవీసీ, వాల్‌గ్రీన్స్‌ కూడా ఇంతే మొత్తం చెల్లిస్తున్నాయి. ఐరోపా విషయానికొస్తే... కొవిడ్‌ సంబంధిత రాజీనామాలు అత్యధికంగా జర్మనీలో నమోదయ్యాయి. అక్కడ మొత్తం 6% మంది కొలువులను వదిలేశారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్‌ (4.7%), నెదర్లాండ్స్‌ (2.9%), ఫ్రాన్స్‌ (2.3%), బెల్జియం(1.9%) నిలిచాయి.


ఏమిటీ రాజీనామాల పర్వం?

‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ అనే పదాన్ని తొలిసారిగా 2019లో టెక్సాస్‌లోని ఏ-అండ్‌-ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లాట్జ్‌ ప్రయోగించారు. మహమ్మారి మందగించిన తర్వాత కోట్ల సంఖ్యలో ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేస్తారని అంచనా వేశారు. సరిగ్గా ఇప్పుడు అదే నిజమవుతోంది! ఒక్క అమెరికాలోనే గత ఆగస్టులో 43 లక్షల మంది తమ కొలువులకు రాజీనామా చేశారు. ఆ దేశ ఉద్యోగాల్లో ఈ సంఖ్య 2.9 శాతమని కార్మిక విభాగం గురువారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో 50% మంది ఉద్యోగులు కొత్త కొలువుల కోసం చురుగ్గా వేట మొదలుపెట్టారని ‘గాల్‌ అప్‌’ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 40% మంది ఉద్యోగులు.. రాజీనామా చేయడం/కంపెనీ మారడంపై ఆలోచిస్తున్నట్టు గత మార్చిలోనే మైక్రోసాఫ్ట్‌ సర్వేలో తేలింది.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని