Huzurabad By Election: తెరాస.. నిరాశ

అధికార పార్టీ తెరాసకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నిరాశే మిగిలింది. హుజూరాబాద్‌, వీణవంక మండలాల్లో మెజారిటీ సాధిస్తామని, ఇల్లందకుంటలో సమానంగా వస్తాయని, జమ్మికుంట, కమలాపూర్‌లో ఆధిక్యం తగ్గినా స్వల్ప మెజారిటీతోనైనా నెగ్గుతామని భావించినా అదీ జరగలేదు.

Updated : 09 Aug 2022 12:27 IST

హుజూరాబాద్‌లో అంచనాలు తలకిందులు
బలగాలన్నీ మోహరించినా లభించని ఫలితం

ఈనాడు, హైదరాబాద్‌: అధికార పార్టీ తెరాసకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నిరాశే మిగిలింది. హుజూరాబాద్‌, వీణవంక మండలాల్లో మెజారిటీ సాధిస్తామని, ఇల్లందకుంటలో సమానంగా వస్తాయని, జమ్మికుంట, కమలాపూర్‌లో ఆధిక్యం తగ్గినా స్వల్ప మెజారిటీతోనైనా నెగ్గుతామని భావించినా అదీ జరగలేదు. మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఈటల రాజీనామా చేస్తారనే భావనతో ఉపఎన్నిక ఖాయమని భావించిన పార్టీ అప్పటినుంచే సన్నద్ధమయింది. మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో ప్రచార వ్యూహం రూపొందింది. నాలుగు నెలల పాటు ఆయన  హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే మకాం వేసి విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు మినహా మిగిలిన మంత్రులంతా పర్యటించారు. ‘దళితబంధు’ ద్వారా దళితుల ఓట్లు అధికశాతం తమకే వస్తాయన్న అంచనా కూడా తప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు అలాంటి పథకం తమకు ప్రకటించలేదని బీసీ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ప్రచారం చేయాలని కేసీఆర్‌ భావించినా ఎన్నికల కమిషన్‌ నిబంధనలతో సభ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇది కొంత నష్టం కలిగించిందని పార్టీ సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు.

అభ్యర్థిత్వంపై తప్పిన అంచనాలు
పార్టీ అభ్యర్థి ఎంపికకు సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ సర్వేలు నిర్వహించడంతో పాటు పార్టీశ్రేణుల అభిప్రాయాలు తీసుకుని తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఎంపిక చేశారు. బలమైన బీసీ సామాజికవర్గం కావడం.. ఉద్యమకారుడిగా నేపథ్యం అనుకూలిస్తాయని భావించింది. ఈటలకు దీటుగా గెల్లును ఓటర్లు గుర్తించలేదని తెలుస్తోంది. 

ఫలితమివ్వని పథకాలు
పార్టీ కార్యక్రమాలకు తోడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు దళితులకోసం ప్రత్యేకంగా ‘దళితబంధు’ను నియోజకవర్గంలో అమలు చేసింది. 24 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు తేలగా, 16 వేల కుటుంబాలకు మొత్తం బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. దీనికి తోడు ఆసరా, రైతుబంధు సహా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు పార్టీకి అనుకూలమవుతాయని, ఆ లబ్ధిదారులు తెరాస వైపే ఉంటారని భావించింది. ఎన్నికలకు ముందు హుజూరాబాద్‌లో దాదాపు 18కి పైగా సామాజికవర్గాలకు సంబంధించిన భవనాలకు శంకుస్థాపన చేసింది. అయినా మెజారిటీ ఓట్లను సాధించలేకపోయింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల ఓటమి లక్ష్యంతో తెరాస కాంగ్రెస్‌ పార్టీ నేత కౌశిక్‌రెడ్డిని తెరాసలో చేర్చుకుంది. ఆ తర్వాత మాజీ మంత్రులు ఎల్‌.రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకుంది. వకుళాభరణం కృష్ణమోహన్‌రావును బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ఎక్కువమంది తెరాస వైపే ఉండటం అనుకూలమని పార్టీ భావించింది. ఇవేమి ప్రభావం చూపలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
* హుజూరాబాద్‌లో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాసకు 95,315 (61.44శాతం) ఓట్లు రాగా... 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1,04,840 (59.34 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ రెండు సందర్భాల్లో ఈటల రాజేందర్‌ తెరాస అభ్యర్థిగా ఉన్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పోటీ చేశారు. పోటీ చేసిన ఆయనకు 83,167 (40.38శాతం) వచ్చాయి.

కేసీఆర్‌ విశ్లేషణ
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మండలాలు, పురపాలికలు, గ్రామాల వారీగా సమాచారంతో ఆయన ఫలితాలను, ఓటమికి కారణాలను విశ్లేషించారని తెలిసింది. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.


తెరాసకు ఓట్లు తగ్గలేదు: హరీశ్‌

హుజూరాబాద్‌లో తెరాసకు ఓట్లేమీ తగ్గలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక్క ఎన్నికలో ఓటమితో తెరాస కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదని అన్నారు. తెరాస తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందని మంగళవారం ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. తెరాసకు ఓట్లేసిన ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారంటూ ధన్యవాదాలు తెలిపారు. ‘‘దేశంలో ఎక్కడా లేనివిధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, భాజపాలు కలిసి పనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కూడా చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే భాజపా, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు’’ అని హరీశ్‌రావు తెలిపారు.


నైతిక విజయం తెరాసదే: గెల్లు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నైతిక విజయం తెరాసదేనని పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.  ‘‘పేద కుటుంబానికి చెందిన నన్ను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా గుర్తించి ప్రజలకు సేవ చేసేందుకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నా. నన్ను గెలిపించేందుకు కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు; నాకు అండగా నిలిచిన హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. గతంలో ఈటల ఒక వ్యక్తిగా ఈ ప్రాంతంలో పనిచేశారే తప్ప పార్టీపరంగా ఏమీ చేయలేదు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం పనిచేస్తాను. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’’ అన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని