Updated : 04 Dec 2021 05:50 IST

TS News: సభలో సలసల

బియ్యం కొనుగోలుపై పార్లమెంటులో వాడీవేడీ..
ఏడాదికెంత సేకరిస్తారో తేల్చాలని ఉభయ సభల్లో నిలదీసిన తెరాస
కొత్త రాష్ట్రం సమస్యలను ఆలకించాలని కేంద్రాన్ని కోరిన టీఎంసీ ఎంపీ
మద్దతు పలికిన శివసేన, కాంగ్రెస్‌, బీజేడీ, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం
ఇవ్వాల్సిన బియ్యమే తెలంగాణ ఇంకా ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి గోయల్‌
మంత్రి సమాధానంపై అసంతృప్తి.. తెరాస ఎంపీల వాకౌట్‌

బియ్యం సేకరణ అంశం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో సలసలా మరిగింది. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ ప్రధాన చర్చగా మారింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బియ్యం ఎంత కొంటారో చెప్పాలంటూ తెరాస సభ్యులు కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి కేంద్రమంత్రిపై ప్రశ్నాస్త్రాలు సంధించగా, లోక్‌సభలో ఆ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు రాష్ట్ర సమస్యపై కేంద్ర మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. ఉదయం సభా సమయానికి ముందు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేసిన ఎంపీలు సభలోకి అడుగుపెట్టిన తర్వాతా అదే పంథాను కొనసాగించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమకు మద్దతివ్వాలంటూ నామా చేసిన విన్నపానికి లోక్‌సభలోని వివిధ పక్షాల నేతలు, రాజ్యసభలో బీజేడీ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఎట్టకేలకు రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని లేఖ ఇచ్చి ఇప్పుడు ఈ అంశంపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ రబీలో ఎంత కొంటారనే అంశంపై కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేయనందుకు నిరసనగా రాజ్యసభ నుంచి, ఐదు రోజులుగా తాము చేస్తున్న డిమాండ్‌పై కేంద్రం తన వైఖరిని వెల్లడించనందుకు లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్‌ చేశారు. మొత్తంగా తెరాస ఎంపీల పోరాటం శుక్రవారం తారస్థాయికి చేరింది. ఈ అంశంపై స్వల్ప కాలిక చర్చకోసం ఉభయసభలలో నోటీసులు ఇవ్వాలని ఎంపీలు నిర్ణయించారు.  


ఎంత కొంటారో తేల్చండి
లోక్‌సభలో నామా, రాజ్యసభలో కేకే డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశంపై లోక్‌సభలో శుక్రవారం తెరాస ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏడాదికి ఎంత మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు తెరాస నినాదాలు ఆటంకంగా మారుతుండడంతో సభాపతి ఓం బిర్లా మాట్లాడేందుకు నామాకు అవకాశం ఇచ్చారు. గత అయిదు రోజులుగా తాము తెలంగాణ రైతుల సమస్యలపై ఆందోళన చేస్తున్నామని, రైతుల దగ్గర నుంచి ఎంత ధాన్యం కొంటారో సంబంధిత మంత్రితో సభలో స్పష్టమైన ప్రకటన చేయించాలని  నామా కోరారు. ధాన్యం కొనుగోళ్లపై ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తున్నారన్నారు. ఈ సమయంలో సభాపతి మైక్‌ ఆపేయడంతో ఆగ్రహించిన తెరాస సభ్యులు మరింత పెద్దగా నినాదాలు చేస్తూ వెల్‌లో బైఠాయించారు. ఈ కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండడంతో విపక్ష నేతలు స్పందించారు. తొలుత తృణమూల్‌ లోక్‌సభ పక్ష నేత సుదీప్‌ బందోపాధ్యాయ ఈ అంశంపై సభాపతిని సమయం కోరారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. వారు కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు. ఒక పార్టీకి చెందిన ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరంతరంగా నినాదాలు చేస్తున్నారు. సంబంధిత మంత్రి స్పందించి తగిన సమయంలో జవాబు ఇస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఈ విషయంపై మీరు దృష్టిసారించాలని’’ సభాపతి ఓం బిర్లాను కోరారు. కాంగ్రెస్‌, బీజేడీ, శివసేన, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం సభ్యులు మద్దతు పలికారు. ఆందోళనకు విపక్షాలు మద్దతు పలకడంతో జీరో అవర్‌లో నామా నాగేశ్వరరావుకు మరోసారి మాట్లాడేందుకు స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ ‘‘పార్లమెంటు సమావేశాలకు ముందు 28వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో, బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లోనూ తెలంగాణలో ధాన్యం సేకరణ సమస్యను వివరించాం. వేడి వాతావరణంతో రాష్ట్రంలో యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. అవి వద్దంటున్నారు. అందువల్లనే ఒక ఏడాదిలో ఎంత మొత్తం, ఏఏ రకాలు సేకరిస్తారో చెప్పాలని కోరాం. మీ ద్వారా ప్రభుత్వం నుంచి సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాం’’ అని విజ్ఞప్తి చేశారు. నామా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెరాస ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఒక దశలో ఫ్లకార్డులు చించి, వెల్‌లోకి విసిరి సభ నుంచి వాకౌట్‌ చేశారు.

రాజ్యసభలో నిలదీసిన కేకే, సురేష్‌రెడ్డి
రాజ్యసభలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆ పార్టీ ఎంపీ కె.ఆర్‌. సురేష్‌రెడ్డి ధాన్యం సేకరణ అంశాన్ని లేవనెత్తారు. ‘‘బియ్యం రకాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ నుంచి మొత్తం కొనుగోలుచేయడానికి సిద్ధంగా ఉందా? లేదా? కేంద్ర కేబినెట్‌ మంత్రి (కిషన్‌రెడ్డి) ప్రతి బియ్యం గింజనూ కొంటామని చెప్పారు. దానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా? గత ఏడాది 94 లక్షల టన్నులు తీసుకున్నారు. ఈసారి కూడా కనీసం గత ఏడాది తీసుకున్న 94 లక్షల టన్నులైనా తీసుకుంటారా? లేదా?’’ అనినిలదీశారు. స్పందించిన కేంద్ర మంత్రి మంత్రి పీయూష్‌గోయల్‌ సమాధానమిచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం బియ్యం ఇవ్వలేదని, ఇప్పుడు భవిష్యత్తులో సేకరించేదాని గురించి మాట్లాడుతూ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.కేంద్ర మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ తెరాస సభ్యులు ఆయన సమాధానం పూర్తయిన వెంటనే వాకౌట్‌ చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో సాయంత్రం తెలంగాణ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.


తిప్పితిప్పి అదే సమాధానం: కె.కేశవరావు

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తిప్పితిప్పి అదే సమాధానం ఇస్తున్నారు. రైతు ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. రైతు, పేదల వ్యతిరేక ప్రభుత్వం ఇది. కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంతవరకూ ఆందోళనలు ఉపసంహరించుకోబోం.


కుట్రపూరిత వ్యవహారం: నామా

వానాకాలం, యాసంగి పంటల కొనుగోలుపై భాజపా నేతలు కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతున్నారు. పరిశ్రమలను అమ్ముతూ కార్మికులకు, ధరలు పెంచుతూ పేదలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రైతుల విషయంలోనూ అలానే ప్రవర్తిస్తోంది.


 


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని