AP News:  విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించింది.

Updated : 11 Dec 2021 11:10 IST

దాదాపు 10 గంటల పాటు హైదరాబాద్‌లో తనిఖీలతో ఉత్కంఠ

కళ్లుతిరిగి పడిపోయిన మాజీ అధికారి

ఆసుపత్రికి తరలింపు..

గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ..

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-షాబాద్‌: ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించింది. విచారణ సందర్భంగా ఉద్వేగానికి గురైన లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు పది గంటల పాటు సోదాలు చేసిన సీఐడీ అధికారులు.. తిరిగి వెళ్లిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.

గురువారమే హైదరాబాద్‌కు సీఐడీ బృందం

లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల కోసం సీఐడీ పోలీసులు గురువారమే హైదరాబాద్‌ చేరుకుని, అదే రోజు రాత్రి జుబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించారు. మర్నాడు తాము సోదాలు చేస్తామని, ఓ మహిళా కానిస్టేబుల్‌ను, మరో ఇద్దరు పోలీసు సిబ్బందిని తమకు సహాయంగా పంపాలని కోరారు. ఇందుకు తాము ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని, ఇతర వివరాలు కూడా కావాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు కోరారు. అయితే సోదాలు ఎక్కడ చేయాలన్న సమాచారం తమకు సీల్డ్‌ కవర్‌లో అందాకే వివరాలు అందించగలమని సీఐడీ సిబ్బంది చెప్పి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్‌ పోలీసుల సాయం తీసుకోకుండానే... డీఎస్పీ ధనుంజయుడు, సీఐ జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని దాదాపు పదిమంది పోలీసు బృందం జూబ్లీహిల్స్‌ నవనిర్మాణ నగర్‌లో ప్లాట్‌ నెంబర్‌ 108లో నివసించే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకుంది.

లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబసభ్యులు పోలీసులను లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా.. వచ్చింది ఎవరో తెలియకుండా, వారెంట్‌ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించబోమన్నారు. సీఐడీ పోలీసులు తమ వద్ద ఉన్న పత్రాలను చూపించడంతో లక్ష్మీనారాయణ వారిని ఇంట్లోకి అనుమతించారు. ఈ క్రమంలోనే సీఐడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఇంట్లో ఉన్న పని మనుషులు ఆరోపించారు. సోదాల్లో భాగంగా కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు సిబ్బంది సోదాలు చేస్తుండగా మరికొందరు లక్ష్మీనారాయణను ప్రశ్నించడం మొదలుపెట్టారు. సోదాల విషయం తెలుసుకున్న తెదేపా నేతలు పయ్యావుల కేశవ్‌, కాట్రగడ్డ ప్రసూన, జీవీజీ నాయుడు, పొగాకు జయరాం తదితరులు అక్కడికి చేరుకున్నారు. సీఐడీ పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని, గో బ్యాక్‌ సీఐడీ అంటూ నినాదాలు చేశారు. దీంతో తమకు భద్రత కావాలంటూ సీఐడీ అధికారులు అప్పుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించారు. ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పినా పట్టించుకోకుండా సోదాలకు వెళ్లడంపై జుబ్లీహిల్స్‌ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసు సిబ్బందిని లక్ష్మీనారాయణ ఇంటికి పంపారు. వారు వచ్చిన తర్వాత నినాదాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులను శాంతింపజేసి, అక్కడి నుంచి పంపించారు. ఇదే సమయంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్కడకు వచ్చారు. ‘మీరు ఇక్కడ ఉంటే లక్ష్మీనారాయణ సహకరిస్తారు. త్వరగా పని పూర్తిచేసుకొని వెళ్తాం’ అని సీఐడీ అధికారులు కోరడంతో ఆయన అక్కడ కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. అనంతరం సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణను ప్రశ్నించడం కొనసాగించారు. ఈ క్రమంలో ఉద్వేగానికి గురైన ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై పడిపోయారు. తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్టార్‌ ఆసుపత్రిలో పనిచేసే తమ కుటుంబ వైద్యుడు దిలీప్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. ఆ వెంటనే ఆయన అక్కడకు చేరుకొని లక్ష్మీనారాయణకు వైద్యపరీక్షలు చేశారు. రక్తపోటు పెరిగినట్లు గుర్తించారు. అక్కడే కొన్ని వైద్యపరీక్షలు, ప్రాథమిక చికిత్స చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించినా సీఐడీ అధికారులు అంగీకరించక, ఇంట్లోనే వైద్యం అందించాలని కోరారు. అయితే లక్ష్మీనారాయణకు గతంలో రెండు శస్త్రచికిత్సలు జరగడం, రక్తపోటు పెరగడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యబృందం స్పష్టం చేసింది. కుటుంబసభ్యులు కూడా సీఐడీ అధికారులను నిలదీశారు. అనారోగ్యంతో పడిపోయినా ఆసుపత్రికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. చివరకు సీఐడీ అధికారులు అంగీకరించడంతో ఆయనను బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అనంతరం సీఐడీ బృందంలోని కొందరు సభ్యులు తాము స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్కులు, ఇతర పత్రాలు తీసుకొని రెండు వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోగా మరికొందరు కొద్దిసేపు లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉండి, సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్లారు. ఈ నెల 13న ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు తమ ఎదుట హాజరుకావాలంటూ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు నోటీసు అందించారు.

నాకు మాత్రమే నోటీసు ఇవ్వడం ఏంటి?

నైపుణ్యాభివృద్ధి సంస్థలో తాను సంచాలకుడిగానే పనిచేశానని, అప్పుడు గౌరవ వేతనం కూడా తీసుకోలేదని లక్ష్మీనారాయణ చెప్పారు. తన ఇంటి వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, ఈ సంస్థలో ఛైర్మన్‌తో పాటు ఐదుగురు కార్యదర్శులు ఉన్నారని, వీరిలో కొందరు ఇప్పటికీ పనిచేస్తున్నారన్నారు. వారందరినీ వదిలేసి తనకు నోటీసులు ఇవ్వడం ఏంటని పోలీసులను ప్రశ్నించానన్నారు.

కక్ష సాధించాలంటే మొదట్లోనే చర్యలుండేవి కదా?: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘నిజంగా కక్ష సాధింపులకు దిగాలనుకుంటే.. మేం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చాం. అదే ఏడాది డిసెంబరులోపే వీళ్లందరిపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టేవాళ్లం. తెదేపా హయాంలో పోలవరం సహా మామూలు దోపిడీ చేశారా? మేం కక్ష సాధింపునకు దిగలేదు కాబట్టే ఇప్పుడు చర్యలకు రెండేళ్లకు పైనే పట్టింది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు కక్షసాధింపు చర్యలన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా సజ్జల పైవిధంగా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని