Omicron: గాలి ద్వారా ఒమిక్రాన్‌ వ్యాప్తి

ఒమిక్రాన్‌ వేరియంట్‌ అతి వేగంగా విస్తరిస్తోందని.. దీనిబట్టి ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమవుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో అతి సూక్ష్మరేణువులు కొద్దిసేపు తేలియాడుతుంటాయనీ,

Updated : 16 Dec 2021 10:12 IST

ఇంటాబయటా మాస్కు తప్పనిసరి
సోకిన వారిద్దరూ విదేశీయులే
త్వరలో ఆంక్షలుండొచ్చు..  లాక్‌డౌన్‌ ఉండదు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌ అతి వేగంగా విస్తరిస్తోందని.. దీనిబట్టి ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమవుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో అతి సూక్ష్మరేణువులు కొద్దిసేపు తేలియాడుతుంటాయనీ, ఆ సమయంలో అక్కడి గాలిని పీల్చినవారికి ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఇంటాబయటా మాస్కు ధరించడం తప్పనిసరని చెప్పారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన ఇద్దరు విదేశీయుల్లోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగులోకి వచ్చిందనీ, రాష్ట్ర ప్రజల్లో ఒక్కరిలోనూ నమోదుకాలేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవనీ, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. బుధవారం కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు.

ఆందోళన అవసరం లేదు
‘‘ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సన్నద్ధమైంది. రోజూ సుమారు 40 వేల పరీక్షలు చేస్తుండగా.. వీటిని 50-60 వేలకు పెంచాలని నిర్ణయించాం. లక్షణాలున్న వ్యక్తులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి. అందుకే హోంఐసోలేషన్‌ కిట్లనూ సమృద్ధిగా సమకూర్చుకున్నాం. 550 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని సాధించాం. ఈ వేరియంట్‌ అక్కడక్కడా వ్యాక్సిన్‌ నుంచి కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి మన చేతుల్లో అన్నింటికంటే పదునైన ఆయుధం మాస్కు. గత కొద్దిరోజుల్లో మాస్కు ధరించే వారి సంఖ్య దాదాపు 50 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో 100 శాతం మంది మాస్కు ధరించాలి. ఒకవేళ వైరస్‌ బారినపడ్డా ప్రాణాలు కోల్పోకుండా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయని నిరూపణ అయింది.
విమానాశ్రయంలో పరీక్షలను మరింత బలోపేతం చేస్తాం. ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ వస్తే హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలున్నాయి. ఒమిక్రాన్‌ రకం అని తేలితే అప్పుడు ఆసుపత్రిలో చేర్చాలి. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ ఉండే పరిస్థితుల్లేవు. అవసరమైన చోట ఆంక్షలుంటాయి. ప్రభుత్వం మూడోదశ ఉద్ధృతిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంది’’ అని శ్రీనివాసరావు తెలిపారు.

కొత్తగా 186 కొవిడ్‌ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 186 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,78,874కు పెరిగింది. ముప్పు దేశాల నుంచి బుధవారం 1,248 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాగా.. వీరికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి  పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఒమిక్రాన్‌ ఉందా? లేదా? అని తేల్చడానికి జన్యుక్రమ విశ్లేషణ కోసం ముగ్గురి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. ఈ ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,010 మంది మృతిచెందారు.


అవసరాన్ని బట్టి ఇంటింటికీ వ్యాక్సిన్లు: మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, అర్హులైన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణులు టీకా తీసుకోవద్దనే అపోహలు వీడాలన్నారు. అవసరాన్ని బట్టి సిబ్బంది ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్‌ అందించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు