Marriage Age: యువతులకు పెళ్లి @ 21

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయసు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోనుంది. ఈ అంశంలోనూ ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును 18

Updated : 17 Dec 2021 04:53 IST

కనీస వివాహ వయసు పెంపు
కేంద్ర మంత్రిమండలి ఆమోదం
1978 తర్వాత బాలికల పెళ్లి వయసులో మార్పు ఇప్పుడే

ఈనాడు, దిల్లీ: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయసు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోనుంది. ఈ అంశంలోనూ ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా బాల్య వివాహాల నిరోధక చట్టం-2006, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టం-1955లకూ కేంద్ర ప్రభుత్వం తగిన సవరణలు చేయనుంది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది చట్టరూపం దాల్చితే యువకులతో సమానంగా యువతుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా మారుతుంది. ఆ వయసు కన్నా ముందే పెళ్లి చేయడం నేరమవుతుంది.

ఏడాది క్రితమే ప్రస్తావించిన ప్రధాని

మహిళల కనీస వివాహ వయసును పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గత ఏడాది ఎర్రకోటపై నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ ప్రసంగంలోనూ యువతుల పెళ్లి వయసు పెంచబోతున్నామనే సంకేతాన్నిచ్చారు. బాలికల వివాహ వయసును 15 నుంచి 18 ఏళ్లకు పెంచుతూ 1978లో నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.

లక్ష్యం జనాభా నియంత్రణ కాదు: జయా జైట్లీ

మహిళల కనీస వివాహ వయసును పెంచడం వెనుక కారణం జనాభా నియంత్రణ కాదని జయా జైట్లీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించడం కోసమే వారి వివాహ వయసు పెంచాలని సిఫార్సు చేసినట్లు వివరించారు. సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలైన జయా జైట్లీ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ నిపుణుల బృందం యువతుల వివాహ వయసు నిర్ధారణకు దేశ వ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరిపింది.

కొనసాగుతున్న బాల్యవివాహాలు..

యువతుల కనీస వివాహ వయసు 18 ఏళ్లు అమల్లో ఉన్నా బాల్యవివాహాలు ఆగడం లేదు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, చదువుకుంటే ఎక్కువగా కట్నాలు ఇవ్వాల్సి ఉంటుందని చిన్నవయసులో పెళ్లిళ్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమల్లోకి తెచ్చిన తరువాత కొంత వరకు బాల్యవివాహాలు తగ్గినా.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 20-24 ఏళ్లలోపు మహిళల్లో 23.5 శాతం మందికి 18 ఏళ్లలోపు వివాహాలు జరిగినట్లు వెల్లడైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెయ్యికి పైగా బాల్యవివాహాలు పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. 15-19 ఏళ్ల వయసులో గర్భం దాల్చుతున్న బాలికలు 5.8 శాతం మంది ఉన్నారు.


యువతుల ఆరోగ్యానికి మేలు
- డాక్టర్‌ బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్టు

మ్మాయిల వివాహ వయసు 21 ఏళ్లకు పెంచడంతో ఆరోగ్యపరంగా వారికెంతో మేలు జరుగుతుంది. 20-21 ఏళ్ల వయసులో అమ్మాయిల్లో పునరుత్పత్తి అవయవాల ఎదుగుదల పూర్తవుతుంది. 21-29 ఏళ్ల వయసులో గర్భం దాల్చితే తల్లి, బిడ్డకు ఆరోగ్యం. 18 ఏళ్లలోపు, 35 ఏళ్లు దాటిన తరువాత గర్భం దాల్చితే సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. బర్త్‌కెనాల్‌ చిన్నగా ఉండటంతో డెలివరీ ఇబ్బందితో సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. 18 ఏళ్ల సమయంలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది.


అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండాలి
- జమీలా నిషత్‌, షాహీన్‌ ఉమెన్‌ రిసోర్సెస్‌

వివాహం అమ్మాయిల వ్యక్తిగత అభీష్టం మేరకు జరగాలి. బాలికకు 18 ఏళ్లు వచ్చినపుడు పరిణితితో ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పిస్తోంది. ఆ వయసు వచ్చిన తరువాత యువతి తనకు ఇష్టమైనప్పుడు వివాహం చేసుకునే స్వేచ్ఛ అందించాలి. అంతేకానీ కనీస వయసు పేరిట ఆంక్షలు పెట్టడం సరికాదు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు