TS News: పరి‘శ్రమకు’ దిక్కేది!
కరోనా సంక్షోభంతో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి కోలుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా 2.6 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు రావడం లేదు. రోజూ 22 లక్షల మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా... 15 లక్షల మందే వస్తున్నారు. కరోనాకు ముందు మూడు పూటలా నడిచే పరిశ్రమల్లో ఎక్కువశాతం ఇప్పుడు రెండు పూటలే నడుస్తున్నాయి.
చిక్కులు వీడని చిన్న కార్ఖానాలు
కరోనా ప్రభావం నుంచి కోలుకోని పారిశ్రామికవేత్తలు
పెరిగిన ముడిసరకుల ధరలు.. తగ్గిన ఆర్డర్లు, ఉత్పత్తులు
రుణసాయం అందించడానికి బ్యాంకుల నిరాసక్తత
దరఖాస్తుల దశ దాటని ‘ఆత్మనిర్భర్ భారత్’
రాష్ట్ర ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూపులు
లక్ష్మి.. రంగారెడ్డి జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్త. మల్కాపూర్‌లో బ్యాగుల తయారీ పరిశ్రమ నడుపుతున్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు అది నడవలేదు. అప్పులు చెల్లించలేదని బ్యాంకులు పరిశ్రమను జప్తు చేశాయి. పునరుద్ధరించేందుకు ఆమె నానా అవస్థలు పడుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: కరోనా సంక్షోభంతో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి కోలుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా 2.6 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు రావడం లేదు. రోజూ 22 లక్షల మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా... 15 లక్షల మందే వస్తున్నారు. కరోనాకు ముందు మూడు పూటలా నడిచే పరిశ్రమల్లో ఎక్కువశాతం ఇప్పుడు రెండు పూటలే నడుస్తున్నాయి. ఆర్డర్లూ తగ్గాయి. ప్రభుత్వరంగ సంస్థలు, మరికొన్ని ప్రైవేటు సంస్థల నుంచే అవి వస్తున్నాయి. దాంతో 60% మేరకే ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఆర్డర్లకు 50% ముందస్తు చెల్లింపులు జరగాల్సి ఉన్నా.. అలా చేయడం లేదు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు సొంత పెట్టుబడులతోనే ముడిసరకులను కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది అప్పులపాలవుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలకు తోడు రవాణా ఖర్చులు పెరగడంతో ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినియం, ఇతర ముడిసరకుల ధరలు పెరిగాయి. ఆ మేరకు ఉత్పాదక వస్తువుల ధరలను పెంచితే కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో పాత ధరలకే విక్రయించాల్సి వస్తోంది.
జీఎస్టీ భారం
వస్తువుల ముడిసరకుల కొనుగోలు సమయంలో పారిశ్రామికవేత్తలు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. వాటితో ఉత్పత్తులు చేసి విక్రయించిన తర్వాత కొనుగోలుదారుల్లో చాలా మంది జీఎస్టీ చెల్లించడం లేదు. దీంతో పారిశ్రామికవేత్తలకు పన్ను భారం పెరుగుతోంది. విలువ ఆధారితంగానే జీఎస్టీ చెల్లించడానికి అధికారులు అనుమతించడం లేదు.
బ్యాంకుల నిస్సహాయత
కొవిడ్‌తో నష్టపోయిన పారిశ్రామికవేత్తలను బ్యాంకర్లు ఆదుకోవడం లేదు. కరోనాకు ముందుతో పోలిస్తే బ్యాంకుల రుణసాయం 42% తగ్గింది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గతంలో ఏటా రూ.42 వేల కోట్ల మేరకు ఎంఎస్‌ఎంఈలకు రుణాలను బ్యాంకులు అందించాయి. గత రెండేళ్లలో రూ.19 వేల కోట్ల కంటే తక్కువ రుణాలనే ఇచ్చారు. సీజీటీఎంఎస్‌ఈ పథకం కింద పూచీకత్తు లేకుండా రూ.కోటి వరకు రుణం ఇవ్వాల్సి ఉన్నా... అవీ మంజూరు కావడం లేదు.
నిరర్థక ఆస్తులుగా పరిశ్రమలు
ఆదాయం లేక... పారిశ్రామికవేత్తలు బ్యాంకుల కిస్తీలు చెల్లించడం లేదు. కరోనా దృష్ట్యా ఈ గడువును 6నెలలకు పెంచాలని వారు కోరుతున్నా బ్యాంకులు ఒప్పుకోవడం లేదు. కిస్తీలు చెల్లించనందుకు గత రెండేళ్లలో 1200కి పైగా పరిశ్రమలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. వాటి వేలం, జప్తులు కొనసాగుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద పరిశ్రమలకు ఎలాంటి సాయం అందలేదని, దరఖాస్తుల ప్రక్రియే ప్రహసనంగా మారిందని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. పరిశ్రమలకు వివిధ సబ్సిడీలు, రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1500 కోట్లను కేటాయించినా రూ.1000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
* రాజు.. వరంగల్‌లో కేబుల్ తయారీదారు. కొవిడ్ సమయంలో పరిశ్రమ మూతపడింది. గత ఏడాది మార్చిలో ప్రారంభించాక ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ రావడంతో మళ్లీ ఆర్డర్లపై ప్రభావం పడింది. క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి
- తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి
పరిశ్రమలు కష్టకాలంలో ఉన్నాయి. పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రుణాల వాయిదాతోపాటు పునరుజ్జీవ ప్యాకేజీని కేంద్రం ప్రకటించి ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీలు విడుదల చేయాలి.'
చిన్న పరిశ్రమలను ఆదుకుంటాం
- పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలకు హెల్త్‌క్లినిక్ ద్వారా చేయూతనిస్తున్నాం. పరిశ్రమలకు అండగా నిలిచేందుకు త్వరలో మార్గనిర్దేశకేంద్రం ఏర్పాటు చేస్తాం. చిన్న పరిశ్రమల కష్టాలపై మంత్రి కేటీఆర్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. రుణాల వాయిదాను కోరాం. రాయితీలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
-
Sports News
Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్ ప్రసాద్
-
General News
KTR: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అత్యవసర విచారణకు సీజేఐకి విజ్ఞప్తి
-
World News
Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా
-
Politics News
Balasaheb Thorat: మహారాష్ట్రలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీ పదవికి థోరట్ రాజీనామా!