AP News: జై కిసాన్‌... జైజై అమరావతి

వారసత్వంగా వస్తున్న భూములను అప్పగించి, ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి వెలుస్తోందని సంతోషించిన రైతులు... ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా

Updated : 18 Dec 2021 05:24 IST

తిరుపతిలో రైతుల మహోద్యమ సభ విజయవంతం.. పాల్గొన్న వివిధ పక్షాలు

అమరావతిపై మడమ తిప్పిన జగన్‌.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు, తిరుపతి: వారసత్వంగా వస్తున్న భూములను అప్పగించి, ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి వెలుస్తోందని సంతోషించిన రైతులు... ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గర్జించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చి, తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభతో రాష్ట్ర, దేశ దృష్టిని ఆకర్షించారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా ప్రజలు పెద్దసంఖ్యలో సభకు తరలివచ్చి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. సభ జరుగుతున్నంతసేపు జై కిసాన్‌, జైజై అమరావతి నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. సభకు అధికార వైకాపా మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఐకాస నేతలు చెబుతున్న సమయంలో తాను వచ్చినట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందుకొచ్చారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. అమరావతి కరకట్ట దాటి తొలిసారిగా తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతం కావడం పట్ల ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సభకు పలువురు న్యాయవాదులు తరలివచ్చారు. ప్రజలు తరలిరాకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. సిద్ధాంతాలు వేరైనా విపక్ష పార్టీలన్నీ ప్రజల కోసం ఒక్కటయ్యాయి. సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి అమరావతి నినాదానికి కట్టుబడ్డారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినదించాయి.. రైతులు, మహిళలు చేస్తున్న ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెదేపా, కాంగ్రెస్‌, భాజపా, సీపీఐ, జనసేనల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం రైతులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.


అమరావతిపై మడమ తిప్పిన జగన్‌: చంద్రబాబు

ఈనాడు, తిరుపతి, అమరావతి: ఏపీకి రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘అమరావతినే రాజధానిగా పెట్టండి. చిన్న రాష్ట్రం... ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు. 30 వేల ఎకరాలు సరిపోతుందని ఎన్నికల ముందు అసెంబ్లీలో చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే.. మూడుముక్కలాట ఆడుతున్నారు. అమరావతి ఏ కొద్దిమంది రాజధానో కాదు... ప్రజలు కోరుకున్న రాజధాని.. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిపై ఆయనకు ఎందుకింత కుళ్లు?’ అని నిలదీశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు సభకు వస్తుంటే అడ్డుపడ్డారని, నేతల ఇళ్లకు పోలీసుల్ని పంపారని ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ... ‘అమరావతి మునిగిపోతుందన్నారు.. దేశంలోని ఎన్నోనగరాల్లోకి వరద నీరొచ్చినా ఈ మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా? పునాది సరిగాఉండదన్నారు. హైదరాబాద్‌, చెన్నై కంటే బ్రహ్మాండమైన పునాదులు వేసుకోవచ్చని చెన్నై ఐఐటీ చెప్పింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్నారు. భూసేకరణలో అలాంటి పదమే లేదని హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పాయి’ అని గుర్తుచేశారు. అమరావతికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సహా కాంగ్రెస్‌, జనసేన, సీపీఐ, సీపీఎంల నేతలూ అమరావతే రాజధాని అని స్పష్టంగా చెప్పారన్నారు. ‘అమరావతిపై కులముద్ర వేస్తున్నారు... అమరావతి పరిరక్షణ సమితి శివారెడ్డి, ఏపీ రాజధాని పరిరక్షణ సమితి శ్రీనివాస్‌లది ఏ కులం? ఇక్కడకు వచ్చిన నాయకులది ఏ కులం? సమాధానంచెప్పే ధైర్యం జగన్‌కి ఉందా?’అని ప్రశ్నించారు.


దోపిడీ కోసమే విశాఖలో రాజధాని

- కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ భాజపా నేత

అమరావతిలో దోచుకోవడానికి ఏమీ లేదని అదే అభివృద్ధి చెందిన విశాఖలో అయితే అన్నీ దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే అక్కడ రాజధాని పెడతామంటున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధే ప్రభుత్వ విధానమైతే గత రెండున్నరేళ్లలో రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఈ ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసేశారు.


అమరావతిని మార్చడం ఎవరితరం కాదు
-కె.రఘురామ కృష్ణరాజు, వైకాపా ఎంపీ

విభజన చట్టం ప్రకారం రాజధానిగా ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరితరమూ కాదు. మీరంతా ధైర్యంగా ఉండండి. అమరావతి రూపశిల్పి చంద్రబాబు... ప్రజల భాగస్వామ్యంతో, సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ నమూనాలో నిర్మించాలనుకున్నారు. అయితే ఒకాయన దురదృష్టవశాత్తూ హ్రస్వదృష్టితో అపార్థం చేసుకున్నారు.


మూడు ముక్కలు చేశారు
-కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

మీ రాజధాని నగరం ఏదీ? అని ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని నగరంగా మిగలడం చాలా అవమానకరం. 1952 నుంచే బెజవాడలోనే రాజధాని ఉండాలని సీపీఐ తరఫున డిమాండు చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకూ మేం మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. అమరావతి అనే ముక్కుపచ్చలారని పసికందును మూడు ముక్కలుగా నరికేసి.. మూడు ప్రాంతాల్లో పడేసి ఇదే రాజధాని అంటున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని