Omicron: మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాణాంతకం కాదని, వైరస్‌ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. తాజాగా

Updated : 18 Dec 2021 05:29 IST

ఒకరు హనుమకొండ మహిళ

మరొకరు హైదరాబాద్‌ యువకుడు

వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే యంత్రాంగం: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాణాంతకం కాదని, వైరస్‌ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. తాజాగా ఇద్దరికి ఈ వేరియంట్‌ నిర్ధారణవడంతో కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందన్నారు. యూకే నుంచి హనుమకొండకు వచ్చిన మహిళకు, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరో వ్యక్తికీ ఒమిక్రాన్‌ నిర్ధారణయినట్టు చెప్పారు. శ్రీనివాసరావు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒమిక్రాన్‌ ముప్పు ఉన్న పది దేశాల నుంచి ఇప్పటివరకు 6,764 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వారిలో 2శాతం మందికి పరీక్షలు చేయగా ఏడు కేసులు వచ్చాయి. హనుమకొండకు చెందిన మహిళ(29) చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో భర్తతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వివాహమై ఒక బిడ్డ జన్మించాక ఈ నెల 2న భారత్‌కు వచ్చారు. విమానాశ్రయంలో పరీక్ష చేయగా నెగిటివ్‌ వచ్చింది. అప్పట్నుంచి ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నారు. ఎనిమిదో రోజున ఇంటి వద్ద పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. జన్యుక్రమ విశ్లేషణలో ఒమిక్రాన్‌గా వెల్లడైంది. ఈ నెల 13న దుబాయ్‌ నుంచి వచ్చిన మరో యువకుడు(30)కి ఒమిక్రాన్‌ సోకినట్లు గురువారం అర్ధరాత్రి తర్వాత నిర్ధారణయింది. పాతబస్తీ మీర్‌చౌక్‌ ఠాణా పరిధి పంజేషా గురాన్‌గల్లీకి చెందిన ఆ యువకుడినీ శుక్రవారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించామని’’ శ్రీనివాసరావు తెలిపారు.


అదృశ్యమైన కెన్యా దేశస్థుడి గుర్తింపు

జూబ్లీహిల్స్‌, చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: పోలీసులు, వైద్యశాఖ అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న కెన్యా దేశానికి చెందిన ఒమిక్రాన్‌ బాధితుడి ఆచూకీ లభ్యమైంది. మూడురోజుల క్రితం అతనికి ఈ వేరియంట్‌ నిర్ధారణయింది. ఫిలింనగర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో అతడు ఉన్నట్లు గుర్తించిన బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ‘మూడు రోజులుగా సదరు వ్యక్తి అపోలో ఆసుపత్రి ముందున్న గెస్ట్‌హౌస్‌లో గదికే పరిమితమైనట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని’’ బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. గదిలో ఉన్న అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఇద్దరినీ మాదాపూర్‌లోని టిమ్స్‌ ఆసుప్రతికి తరలించారని చెప్పారు.


95 శాతం మందిలో లక్షణాల్లేవు

ఒమిక్రాన్‌తో భయపడాల్సినంత ముప్పేమీ లేదని శ్రీనివాసరావు తెలిపారు. ‘ఇది సోకిన 95 శాతం మందికి ఎలాంటి వ్యాధి లక్షణాల్లేవు. ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల్లో ఒకట్రెండు మినహా ఎక్కడా ఆస్పత్రుల్లో చేరికలు జరగలేదు. డెల్టాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్‌తో యూకేలో తప్ప ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఒకేసారి 60 వేల మందికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లుచేశాం’’ అని వెల్లడించారు.


కొత్తగా 181 కరోనా కేసులు

రాష్ట్రంలో శుక్రవారం 39,781మందికి పరీక్షలు నిర్వహించగా 181 మందికి పాజిటివ్‌గా తేలింది.  కరోనా చికిత్స పొందుతూ మరొకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 4,013కి చేరింది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని