TSRTC: ఆర్టీసీలో ఇక పదవీ విరమణలేనా?

ఉద్యోగుల పదవీ విరమణలు మొదలవుతాయా? మరో ఏడాది అవకాశం లభిస్తుందా? రాష్ట్ర ఆర్టీసీలో ప్రస్తుతం ఇవే చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఉద్యోగులకు మరో ఏడాది గడువు పెంచేందుకు వీలుగా అధికారులు ప్రభుత్వానికి

Published : 27 Dec 2021 08:01 IST

పెంచిన రెండేళ్ల గడువు ఈ నెలాఖరుతో పూర్తి
సర్కారు దృష్టికి మరో ఏడాది పొడిగింపు దస్త్రం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల పదవీ విరమణలు మొదలవుతాయా? మరో ఏడాది అవకాశం లభిస్తుందా? రాష్ట్ర ఆర్టీసీలో ప్రస్తుతం ఇవే చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఉద్యోగులకు మరో ఏడాది గడువు పెంచేందుకు వీలుగా అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు.కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పెంపుదలపై కొందరు కండక్టర్లు, డ్రైవర్లు నిరాసక్తంగా ఉండగా అధికారులు, పరిపాలనా ఉద్యోగులు ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 డిసెంబరులో పెంచారు. దాంతో రెండేళ్లుగా ఆర్టీసీలో పదవీ విరమణలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ ఆర్థికంగా కుదేలయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను గడిచిన కొన్నేళ్లుగా చెల్లించలేని స్థితి ఉంది. 2019 మార్చిలో రిటైర్‌ అయిన వారికి మాత్రమే సెలవులు, చివరి నెల జీతం తదితరాలను చెల్లించింది. ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం సుమారు రూ.100 కోట్లకుపైగా ఉంటుందన్నది అంచనా.  


ఏటేటా భారీగా విరమణలు

2019లో ఆర్టీసీపై కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో ఆ సంవత్సరం నుంచి ఏటా ఎంతమంది పదవీ విరమణ చేస్తారన్న వివరాలతో  నివేదికను అందజేశారు. ఆ గణాంకాల ప్రకారం 2019లో  659 మంది, 2020లో 2,615, 2021లో 4,690 మంది పదవీవిరమణ చేయాల్సి ఉంది. రెండేళ్లలో పదవీ విరమణలు లేకపోవటంతో డిసెంబరు నాటికి ఆ సంఖ్య 7,964కి చేరుతుంది. ఆ తర్వాతా ఏటేటా భారీ సంఖ్యలోనే విరమణలు ఉండనున్నాయి. ఎంతమంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వారికి పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని