Natural disasters:ప్రపంచాన్ని వణికించిన వైపరీత్యాలు

ఒకవైపు కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని కోలుకోలేని దెబ్బతీశాయి. తుపాన్లు, వరదలు, అతి భారీ వర్షాలు.. తీవ్ర వడగాలులు, సుడిగాలులు, కరవు..

Published : 28 Dec 2021 05:27 IST

 పది సంఘటనల్లో ఆస్తి నష్టం రూ.12.77 లక్షల కోట్లు

టాక్టే, యస్‌ తుపాన్లతో భారత్‌కు భారీ నష్టం

అతలాకుతలమైన ప్రపంచ దేశాలు

ఇదా హరికేన్‌తో అమెరికాలో జరిగిన విధ్వంసం

ఈనాడు హైదరాబాద్‌: ఒకవైపు కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని కోలుకోలేని దెబ్బతీశాయి. తుపాన్లు, వరదలు, అతి భారీ వర్షాలు.. తీవ్ర వడగాలులు, సుడిగాలులు, కరవు.. ఇలా అన్ని రకాలుగా ప్రజలను తీవ్రంగా నష్టపరచాయి. వాతావరణ మార్పు ప్రభావంతో ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే పడటం, 240 కి.మీ వేగంతో గాలులు విరుచుకుపడటం, సముద్రాల నీటిమట్టాలు పెరగడం, భారీ సుడిగుండాలు జనాన్ని అతలాకుతలం చేశాయి. కరవుతో ఆహారం దొరక్క అల్లాడిన పరిస్థితులు మరికొన్ని దేశాల్లో నెలకొన్నాయి. ఇలా 2021వ సంవత్సరంలో భారీ నష్టం సంభవించింది. ఈఏడాది ప్రపంచంలో జరిగిన పది వైపరీత్యాల వల్ల సంభవించిన ఆర్థిక నష్టం అక్షరాలా రూ.12,77,250 కోట్లు. ఇందులో అత్యధికంగా కోల్పోయింది అమెరికాయే. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన హరికేన్‌ వల్ల రూ.4,87,500 కోట్ల నష్టం వాటిల్లితే, తక్కువగా భారత్‌, మాల్దీవులు, శ్రీలంకను నష్టపరచిన టాక్టే తుపానుతో రూ.11,250 కోట్లు ఆర్థిక నష్టం సంభవించింది. వాతావరణ మార్పుల కారణంగా జరిగిన నష్టంపై లండన్‌కు చెందిన క్రిస్టియన్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల శాస్త్రవేత్తలతో పాటు హైదరాబాద్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ కూడా ఈ నివేదిక తయారీలో పాలుపంచుకొన్నారు. 2021లో 1.5 బిలియన్‌ డాలర్ల (రూ.11250 కోట్లు) కంటే ఎక్కువ నష్టం వాటిల్లిన పది ప్రకృతి వైపరీత్యాలపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. వీటిలో టాక్టే, యస్‌.. ఈ రెండు తుపాన్ల వల్ల భారత్‌లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. నివేదికలోని ముఖ్యాంశాలు...

యస్‌ తుపానుకు జలమయమైన కోల్‌కతా వీధులు

వరదలతో యూరప్‌ అతలాకుతలం

జులైలో సంభవించిన వరదలు, అతి భారీ వర్షపాతం కారణంగా జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌ దేశాల్లో ఒక్క రోజులోనే 240 మంది మరణించారు. రూ.3.225 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పు వల్ల యూరప్‌లో తరచూ ఇలాంటి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కాలంలో 9 రెట్ల వరకు అధికమయ్యాయి.

భారత్‌లో తుపాన్ల విలయం

అరేబియా సముద్రంలో వచ్చిన మార్పులతో సంభవించిన టాక్టే తుపాను భారత్‌తో పాటు మాల్దీవులు, శ్రీలంకకు తీవ్రనష్టం కలిగించింది. మొత్తం 198 మంది చనిపోయారు. ముంబయితో పాటు గుజరాత్‌లో ప్రభావాన్ని చూపింది. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబయిలో చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. మే నెలలో బంగాళాఖాతంలో వచ్చిన యస్‌ తుపాను వల్ల 12 లక్షల మంది ఇళ్లను వదిలివెళ్లాల్సి వచ్చింది. ఒడిశాలో పదివేల గ్రామాలు దెబ్బతిన్నాయి. కోల్‌కతా వీధులను వరద ముంచెత్తింది.

ఫ్రాన్స్‌ను దెబ్బతీసిన కోల్డ్‌వేవ్‌

ఫ్రాన్స్‌లో కోల్డ్‌వేవ్‌ వల్ల వ్యవసాయానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రత్యేకించి వైన్‌యార్డ్స్‌కు. 21వ శతాబ్దంలోనే వ్యవసాయానికి జరిగిన అతి పెద్ద నష్టంగా ఫ్రాన్స్‌ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కోతకొచ్చిన పంట 80 శాతానికి పైగా పోయింది. ఇలాంటి కోల్డ్‌వేవ్స్‌ 60 శాతం పెరిగినట్లు మరోసంస్థ అధ్యయనం.


గడగడలాడిన అమెరికా

అమెరికాను గడగడలాడించిన హరికేన్‌ ఇదా కారణంగా లూసియానా రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యుత్తు సరఫరా లేకుండా గడపాల్సి వచ్చింది. నగరంలోని ఒక ప్రాంతంలో 75 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. టెక్సాస్‌లో ఫిబ్రవరిలో సంభవించిన శీతాకాల తుపాను వల్ల అధికారికంగా 210 మంది మరణించినట్లు పేర్కొన్నా.., వాస్తవానికి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా. ఆర్థిక నష్టం 23 బిలియన్‌ డాలర్లుగా పేర్కొనగా, 200 బిలియన్‌ డాలర్లు ఉంటుంది.


మనదేశానికి తీవ్ర నష్టం

వాతావరణ మార్పుల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే దేశాల్లో భారతదేశం ఒకటని తాజా నివేదికను బట్టి స్పష్టమవుతోంది. వాతావరణ పరిరక్షణ కోసం 2020 నుంచి ఏటా 100 బిలియన్‌ డాలర్లను సమీకరించాలని అంగీకరించిన దేశాలు ఆచరణలో అమలు చేయలేదు. ఇందుకు నిధులే ప్రధాన సమస్య. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను నిరోధించడానికి సాంకేతికత బదిలీ, నిధులు ప్రధానం.

-డాక్టర్‌ అంజల్‌ ప్రకాశ్‌, ఐ.ఐ.ఎం.. హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని