Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుందని అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం(ఏబీఏఎస్‌ఎస్‌) ప్రతినిధి అరుణ్‌ గురుస్వామి తెలిపారు. శుక్రవారం

Updated : 31 Dec 2021 09:14 IST

నేటి నుంచి అయ్యప్ప దర్శనం
రేపటి నుంచి పెద్దపాదంలో భక్తులకు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుందని అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం(ఏబీఏఎస్‌ఎస్‌) ప్రతినిధి అరుణ్‌ గురుస్వామి తెలిపారు. శుక్రవారం వేకువజామున 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. జనవరి 19 వరకు ఆలయం తెరిచిఉంటుందని, ప్రతిరోజూ వేకువజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతించి హరివరాసనం తరువాత రాత్రి 10 గంటలకు మూసివేస్తారన్నారు. ‘‘దేవస్థాన బోర్డు రెండేళ్ల తరువాత పెద్దపాదం(అటవీ ట్రెక్‌) మార్గాన్ని భక్తుల కోసం తెరిచింది. జనవరి 1 నుంచి భక్తులను ఈ మార్గంలో అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ఉదయం 5.30-రాత్రి 10.30 మధ్య ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. నీలక్కల్‌, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్‌బుకింగ్‌కు అవకాశముంది. వర్చువల్‌ క్యూపద్ధతిలో దర్శనం కోసం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు స్లాట్‌ నిర్ధారణ టికెట్‌తోపాటు రెండు డోసుల టీకా ధ్రువీకరణ లేదా ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ ఫలితం తాలూకు పత్రాలు వెంట తీసుకెళ్లాలి. మకరజ్యోతి దర్శనం జనవరి 14న ఉంటుంది. హరివరాసనం తరువాత జనవరి 19న దేవాలయాన్ని మూసివేస్తారు. ఎరుమేలి, అలుద, కరిమల, పెరియనపట్టం, పంబ ప్రాంతాల్లో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమాచార కేంద్రం, అన్నదాన సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు’ అని ఆయన వెల్లడించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని, చిన్న బృందాలుగా ప్రయాణిస్తూ రద్దీని నివారించాలని సూచించారు. మకరవిలక్కు ఉత్సవ సమయంలో గురుస్వాములు, భక్తులు శబరిమలలో బస చేయకుండా దర్శనం జరిగిన వెంటనే పంబకు తిరిగి రావాలని విన్నవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని