TS News: 2 రోజుల్లో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులు

రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం కింద జోన్లు, బహుళజోన్లకు కేటాయించిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల ప్రక్రియను ఈ నెల ఏడో తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం బుధవారం...

Updated : 06 Jan 2022 10:01 IST

ఐచ్ఛికాలు, కౌన్సెలింగుకు అవకాశం

శాఖాపరమైన కమిటీల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం కింద జోన్లు, బహుళజోన్లకు కేటాయించిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల ప్రక్రియను ఈ నెల ఏడో తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం బుధవారం అన్నిశాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకొని, కౌన్సెలింగు ద్వారా నియామకాలు జరపాలని నిర్దేశించింది. దీని కోసం శాఖాపరమైన కమిటీలను ఏర్పాటు చేసింది. గత వారమే జోనల్‌, బహుళజోనల్‌ అధికారులు, ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యాయి. దీనికి అనుగుణంగా వారు మంగళవారం వరకు తమ ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్‌ చేశారు. కేటాయింపుల మేరకు జోన్లలో, బహుళజోన్ల పరిధిలో చేరిక పూర్తి కావడంతో ప్రభుత్వం వారి బదిలీలు, నియామకాలపై దృష్టి సారించింది. శాఖలు, విభాగాల వారీగా కార్యదర్శులు, సంచాలకులు/కమిషనర్లతో కమిటీలను ఏర్పాటు చేసింది. వీరంతా ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకొని, వాటి ఆధారంగా కౌన్సెలింగు నిర్వహించి, పోస్టింగుల జాబితాను రూపొందిస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏడో తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా శాఖల్లో ఖాళీల సమాచారం ఉద్యోగులకు ముందుగానే తెలియజేయాలని సూచించింది. దీంతో పాటు ఐచ్ఛికాల నమూనా పత్రాన్ని సైతం విడుదల చేసింది. జోనల్‌/బహుళజోనల్‌ అధికారి/ఉద్యోగి పేరు, గుర్తింపు సంఖ్య, ఫోన్‌ నంబర్‌, కేటాయించిన జోన్‌, బహుళజోన్‌, భార్యాభర్తలు, ప్రత్యేక కేటగిరిలో ఉంటే దానికి సంబంధించిన వివరాలు, ధ్రువీకరణపత్రాలు, ఎక్కడ పోస్టింగు కావాలో దానికి సంబంధించిన ఐదు ఐచ్ఛికాలను ఇవ్వాలని సూచించింది.

జిల్లాస్థాయి పోస్టులకు ప్రత్యేకాధికారులు

మరోవైపు జిల్లా స్థాయిల్లో ఇప్పటికే జరుగుతున్న బదిలీలు, పోస్టింగుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం జోన్ల వారీగా ప్రత్యేకాధికారులను నియమించింది. వారు తమ పరిధిలోని జిల్లాల్లో నియామకాలు, ఎంత మంది విధుల్లో చేరింది, ఇతరత్రా సమాచారం తీసుకొని తమ శాఖ కార్యదర్శికి నివేదించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని