Software Boom: సాఫ్ట్‌వేర్‌ బూమ్‌.. బూమ్‌..

బీటెక్‌ విద్యార్థులకు ఈసారి ఐటీ కంపెనీల నుంచి వార్షిక వేతన ప్యాకేజీ పంట పండుతోంది. డిజిటల్‌ టెక్నాలజీలపై పట్టున్న విద్యార్థులను గతంలో ఎన్నడూ లేనంతగా పలు సంస్థలు

Updated : 08 Jan 2022 06:19 IST

ఫ్రెషర్లకు వేతన ప్యాకేజీల పంట

రూ.33 లక్షల నుంచి రూ.44 లక్షల చొప్పున చెల్లిస్తున్న అమెజాన్‌

అధిక ప్రాజెక్టులతో ఉద్యోగుల అవసరమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ విద్యార్థులకు ఈసారి ఐటీ కంపెనీల నుంచి వార్షిక వేతన ప్యాకేజీ పంట పండుతోంది. డిజిటల్‌ టెక్నాలజీలపై పట్టున్న విద్యార్థులను గతంలో ఎన్నడూ లేనంతగా పలు సంస్థలు వార్షిక వేతన ప్యాకేజీలు పెంచి నియమించుకునేందుకు పోటీపడుతున్నాయి. అమెజాన్‌ గత ఏడాది వరకు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీరు(ఎస్‌డీఈ)గా ఎంపికైన వారికి రూ.33 లక్షల వార్షిక వేతనం ఇచ్చేది. ఈసారి రూ.44 లక్షలకు పెంచడం గమనార్హం. గత ఏడాది వరకు సర్వీస్‌ కంపెనీలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో నూతన ఉద్యోగులను నియమించుకునేవి. ఈదఫా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ప్రొడక్ట్‌ కంపెనీలూ ఎక్కువ మందిని ఎంపిక చేసుకుంటుండటం మరో పరిణామం. కరోనా కారణంగా వివిధ సంస్థలు ఆటోమేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో చిన్న కంపెనీలు కూడా ప్రాజెక్టులు దక్కించుకుంటున్నాయి. ఫలితంగా ఆ సంస్థలు తాజా అభ్యర్థుల(ఫ్రెషర్స్‌)ను ఎక్కువగా నియమించుకుంటున్నట్లు ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు.

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌లను బిగ్‌ 4 కంపెనీలుగా పిలుస్తారు. ఈ సంస్థలు సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రతిభ గల అభ్యర్థులకు అధిక వేతనమిచ్చి తక్కువ మందిని ఎంపిక చేసుకుంటాయి. ఈసారి అవి కూడా నియామకాల సంఖ్యను పెంచాయి. గోకరాజు రంగరాజు కళాశాలలో గత ఏడాది రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీకి అమెజాన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీరు(ఎస్‌డీఈ) కొలువుకు ముగ్గురు ఎంపికవ్వగా..., ఈసారి రూ.44 లక్షల ప్యాకేజీకి 10 మంది ఎంపికయ్యారు. వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతిలో ఈసారి 17 మంది ఎంపికయ్యారు. గత ఏడాది ఆ సంఖ్య 12గా ఉంది. వాసవి కళాశాల నుంచి అమెజాన్‌కు ఇద్దరు ఎంపికయ్యారు. తమ కళాశాలలో 600 మంది విద్యార్థుల్లో 101 మందిని వివిధ కంపెనీల్లో రూ.15 లక్షలకు మించి వేతన ప్యాకేజీ(సూపర్‌ డ్రీమ్‌ ఆఫర్‌) కొలువులకు తీసుకున్నట్లు వాసవి కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి కిశోర్‌ తెలిపారు. చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (సీబీఐటీ)లో ఆ సంఖ్య ఈసారి 70 ఉంది. మొత్తం 650 మంది విద్యార్థులకు మొత్తం 1500 ఆఫర్లు వచ్చాయని, ఇప్పటివరకు కళాశాల చరిత్రలో ఇదే అధికమని ప్లేస్‌మెంట్‌ అధికారి ఎన్‌ఎల్‌ఎన్‌రెడ్డి చెప్పారు. ఇంకా పలు కంపెనీలు వేతన ప్యాకేజీలను రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా పెంచాయి. ఉదాహరణకు ఎన్‌సీఆర్‌ కంపెనీ రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు, రూ.10 లక్షల కొలువుకు రూ.14 లక్షలు ఇస్తోంది. క్యాప్‌ జెమినీ సైతం రూ.లక్ష పెంచి వార్షిక వేతనాన్ని రూ.7.50 లక్షలు చేసింది.


అవసరమని రాజీ పడవు
-పార్థసారథి, ప్రాంగణ నియామకాల అధికారి, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాల

ఐటీ నిపుణుల అవసరం పెరిగినంత మాత్రాన అధిక వేతనం ఇచ్చే కంపెనీలు ప్రతిభ విషయంలో రాజీపడవు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు జరిపి వడపోతల అనంతరమే ఎంపిక చేసుకుంటున్నాయి. దానికితోడు విద్యార్థులకు మొదటి నుంచి శిక్షణ ఇస్తుండటంతో వారు ప్రతిభను చాటుకుంటున్నారు.


సగం మందికి రూ.7లక్షలకు మించి..
-డాక్టర్‌ కటారి బుచ్చిబాబు, ప్లేస్‌మెంట్‌ అధికారి, గోకరాజు రంగరాజు కళాశాల

ఎన్నడూ లేనంతగా ఈసారి వెయ్యి మంది విద్యార్థులకు 2,050 ఆఫర్లు వచ్చాయి. వారిలో 524 మందికి వార్షిక వేతనం రూ.7 లక్షలకు మించి ఉండటం రికార్డు. సన్‌టెక్‌ కార్ఫ్‌ సొల్యూషన్‌ అనే సంస్థ సహకారం తీసుకొని విద్యార్థులకు తొలి ఏడాది నుంచి శిక్షణ ఇస్తున్నాం. దాంతో అమెజాన్‌కు ఎంపికైన వారు బాగా పెరిగారు.


ఫస్టియర్‌ నుంచే సన్నద్ధమైతేనే...
-కాంచనపల్లి వెంకట్‌, సీఈఓ, సన్‌టెక్‌ కార్ఫ్‌ ప్లేస్‌మెంట్‌ శిక్షణ సంస్థ

తొలి ఏడాది నుంచే విద్యార్థులు సిద్ధమవ్వాలి. చదువు నాలుగేళ్లు కదా అని మూడో ఏడాది వరకు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఫస్టియర్‌లో ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, సాఫ్ట్‌స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. సెకండియర్‌ కోడింగ్‌ మొదలుపెట్టాలి. డేటా స్ట్రక్చర్స్‌, అల్గారిథమ్స్‌పై పట్టుంటే కోడింగ్‌ చేయడం సులభం. మూడో ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించడం మంచిది.


కోడింగ్‌పై తొలి నుంచి ఆసక్తి
-జి.మహేశ్‌కుమార్‌, బీటెక్‌ విద్యార్థి, హైదరాబాద్‌

గోకరాజు రంగరాజు కళాశాలలో బీటెక్‌ ఈసీఈ చదువుతున్నా. నాకు కోడింగ్‌ అంటే ఇష్టం. ఇంటర్‌ చదువుతున్నప్పుడే కొంత నేర్చుకున్నా. అమెజాన్‌ సంస్థ ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించింది. అందులో ప్రతిభ చూపడంతో రెండు రౌండ్ల ముఖాముఖి నిర్వహించారు. కళాశాలలో పరీక్షలు, ముఖాముఖిలకు ఎలా సన్నద్ధమవ్వాలో శిక్షణ ఇవ్వడం లాభించింది. దీంతో రూ.44 లక్షల ప్యాకేజీ కొలువుకు ఎంపికయ్యా.


కోడింగ్‌ క్లబ్‌లో చేరా
-కె.గుణశ్రీ, బీటెక్‌ విద్యార్థిని హైదరాబాద్‌

వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ఈ చదువుతున్నా. తొలి ఏడాదిలోనే ఆయా కంపెనీలకు ఎంపికైన సీనియర్లు వచ్చి కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి, ఎలా సిద్ధమవ్వాలో వివరించారు. కళాశాలలో ఉన్న కోడింగ్‌ క్లబ్‌లో చేరి కోడింగ్‌పై కొంత పట్టు సాధించా. దాంతో రూ.44 లక్షల వేతనంతో అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీరుగా ఎంపికయ్యా. జులైలో ఉద్యోగంలో చేరతా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని