TS News: వేరే జిల్లాకు వెళ్లలేక.. ఉద్యోగం మానలేక..!

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు(ఎస్జీటీ) బేతాల సరస్వతి (34) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. దశాబ్ద కాలం పాటు ఆమె సొంత మండలంలోనే ఉద్యోగం చేశారు. మొన్నటి వరకు భీమ్‌గల్‌ మండలం రహత్‌నగర్‌లో విధులు నిర్వహించేవారు. నూతన జీవో ప్రకారం కేటాయింపుల్లో భాగంగా ఆమె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా

Updated : 10 Jan 2022 07:10 IST

ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు(ఎస్జీటీ) బేతాల సరస్వతి (34) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. దశాబ్ద కాలం పాటు ఆమె సొంత మండలంలోనే ఉద్యోగం చేశారు. మొన్నటి వరకు భీమ్‌గల్‌ మండలం రహత్‌నగర్‌లో విధులు నిర్వహించేవారు. నూతన జీవో ప్రకారం కేటాయింపుల్లో భాగంగా ఆమె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. బతుకుదెరువు కోసం ఖతార్‌ వెళ్లిన భర్త భూమేష్‌కు ఈ విషయం తెలియజేయగా.. ఇబ్బందులు పడుతూ ఉద్యోగం చేయడం ఎందుకని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లలేక.. సొంత ఊరిలో ఉండలేక ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ ఈ నెల 7న కొత్త పాఠశాలకు వెళ్లి విధుల్లో చేరారు. అక్కడ ఆమె ఒక్కరే ఉపాధ్యాయురాలు. ఆదివారం ఇంట్లో ఇద్దరు కుమారుల(కవలలు)కు అన్నం పెట్టి ఇప్పుడే వస్తానని బంగ్లాపైకి వెళ్లి దూలానికి తాడుతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సరస్వతి సొంతూరు నుంచి ప్రస్తుతం పోస్టింగ్‌ పొందిన మర్లకుంట తండా 110 కి.మీ. దూరం. ఆమె సోదరుడు లోకేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనాథ్‌ తెలిపారు.


గుండె నొప్పితో మరో టీచర్‌..

మరిపెడ, న్యూస్‌టుడే: ఛాతీలో మంట.. కడుపు, గుండెలో నొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు శ్రీమతి(46) మృతి చెందారు. ఆమె భర్త సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం యర్జర్ల శివారు పూసలతండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీమతి ఇటీవలి కేటాయింపుల్లో ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని రొయ్యూరు పాఠశాలకు బదిలీ కాగా విధుల్లో చేరారు. హనుమకొండ నగరంలోని న్యూశాయంపేటలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీలో నీరు పేరుకుందని, గుండె వేగం పెరిగిందని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు భర్త సత్యనారాయణరెడ్డి తెలిపారు. సుదూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఆమె ఆందోళనతో అస్వస్థతకు గురై ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.


అవి కేసీఆర్‌ ప్రభుత్వ హత్యలే: సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య తనను కలిచివేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ‘317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చనిపోతున్నారు. ఇవన్నీ కేసీఆర్‌ ప్రభుత్వ హత్యలే’ అని ఆరోపించారు. దీనిపై భాజపా పోరాటం చేస్తుందని.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న, గుండె పోటుతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని భాజపా డిమాండ్‌ చేసింది.


ఆ జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం: రేవంత్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. ఈ చావులకు ప్రభుత్వంతో పాటు వత్తాసు పలికే ఉద్యోగ సంఘాల నాయకులూ బాధ్యులేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని