Vanama Raghava: భూ కబంధుడు

ఎకరాల కొద్దీ అటవీ భూములను కొల్లగొట్టాడు. అసైన్డ్‌ భూములను కబ్జా చేశాడు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చిన వనమా రాఘవ అక్రమాలు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం

Updated : 12 Jan 2022 18:41 IST

రాఘవ ఆగడాల్లో నయా కోణాలు

పాల్వంచ కేటీపీఎస్‌, గ్రామీణం, న్యూస్‌టుడే: ఎకరాల కొద్దీ అటవీ భూములను కొల్లగొట్టాడు. అసైన్డ్‌ భూములను కబ్జా చేశాడు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చిన వనమా రాఘవ అక్రమాలు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కటకటాల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. భూ దందాలు,  అరాచకాలకు పాల్పడ్డాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్నింటిపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. వెలుగు చూడనివి కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.  

అక్రమించిన అటవీ భూముల్లో ఆయిల్‌పాం సాగు

అటవీ భూములను చెరబట్టి
పాల్వంచ ప్రాదేశిక ప్రాంతంలోని (టెరిటోరియల్‌) బంగారుజాల అటవీ బీట్‌ పరిధిలో దాదాపు 50 ఎకరాల అటవీ భూమిని రాఘవ ఆక్రమించారు. పాల్వంచ పురపాలక సంఘం పరిధిలోకి వచ్చే 999 సర్వే నంబరు, ఉప సంఖ్యల పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్‌పాం పంట, అంతర్‌పంటగా మొక్కజొన్న సాగు చేపట్టారు. ఒకప్పుడు అడవి ఉండగా చెట్లను కొట్టేసి చదును చేసేశారు. ఆ పక్కనే రాఘవకు చెందిన పట్టా భూములు ఉన్నాయి. వాస్తవానికి ఈ సర్వే సంఖ్యలో 4,180 ఎకరాల భూమి ఉంది. దీనిలో 1,153 ఎకరాలు అటవీ భూమి, 850 ఎకరాలు పట్టా భూములున్నాయి. మిగిలింది రెవెన్యూ భూమి. ప్రస్తుతం అటవీ ప్రాంతం కొంత పోను మిగిలినదంతా ఆక్రమణలోనే ఉంది. మరోవైపు కొన్నేళ్ల క్రితం కొంత మందికి భూమిని ఎసైన్డ్‌ చేశారు. దీనిలో కొంత విస్తీర్ణాన్ని రాఘవ బెదిరించి ఎంతో కొంత చేతుల్లో పెట్టి లాక్కున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చర్యలు చేపట్టని యంత్రాంగం
నిరుపేదలైన గిరిజనులు పోడు చేసుకున్న భూములను స్వాధీనపర్చుకోవడానికి నిత్యం వారి వెంట పడుతున్న అధికారులు.. రాఘవ ఆధీనంలోని అటవీ భూమిని వెనక్కు తీసుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై పాల్వంచ అటవీశాఖ డివిజన్‌ అధికారి తిరుమలరావును వివరణ కోరగా.. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందగా వాటిపై విచారణ నిర్వహిస్తున్నామని, గుర్తించాక ఏదైనా విషయం చెబుతామని తెలిపారు.

ఎసైన్డ్‌ భూముల్లో 20 ఎకరాలు..
పాల్వంచ పురపాలక పరిధిలో పలు చోట్ల పేదలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూములనూ రాఘవ, ఆయన అనుచరులు ఆక్రమించారు. విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిలో ఉన్న ఈ పట్టణంలో పట్టా భూములున్న చోట స్థిరాస్తి వ్యాపారానికి మంచి గిరాకీ ఉండటంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రహదారి పక్కనే, ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావు నివాస గృహానికి ఎదురుగా ఉన్న చింతల చెరువులోనూ ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. చెరువు నీళ్లు నిల్వ ఉండే చోటే వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి భవనాలు నిర్మించారు. బంగారుజాలలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఎసైన్డ్‌ భూముల్లో 20ఎకరాలను రాఘవ కబ్జా చేశారని బాధితులు చెబుతున్నారు. బాధితులు ఇంటి చుట్టూ తిరిగి ఒత్తిడి చేయడంతో ఎకరాకు రూ.10 వేలు మాత్రం చేతుల్లో పెట్టారని కొందరు పేర్కొంటున్నారు. పాల్వంచ కాంట్రాక్టర్స్‌ కాలనీకి చెందిన శ్రీదేవి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రాఘవ కబ్జా చేశాడని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వనమా రాఘవపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నా నేరాల కోణంలోనే(క్రైం) కేసులు నమోదు చేశారని, భూముల ఆక్రమణ, ఆర్థిక దందాలకు సంబంధించి ఎలాంటి విచారణలు చేపట్టడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.


బెదిరించి లాక్కున్నాడు

మాకు ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ భూమిని రాఘవ కబ్జా చేశాడు. మొక్కలు వేసి సాగు చేపట్టాడు. ఇంటికెళ్లి పలుమార్లు మా భూమి మాకు ఇవ్వాలని బతిమిలాడాం. ‘మీకు భూమి ఎక్కడుంది? మా భూమి అది’ అని ఇంటిల్లిపాది తిట్టారు. పహాణీలు, పాసుపుస్తకం ఉందని చెప్పినా తిరిగి ఇవ్వలే.

- వెంకట రమణ, బంగారుజాల, అసైన్డ్‌ లబ్ధిదారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని