TS News: గిరాకీని బట్టి మార్కెట్‌ విలువ

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువల మదింపునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల విలువలు గణనీయంగా పెంచేలా ప్రక్రియ సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్‌ విలువను

Updated : 22 Jan 2022 06:27 IST

రెండ్రోజుల్లో కొత్త ధరలు కొలిక్కి
రెండేళ్లకోసారి సవరించాలనే యోచనలో సర్కారు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువల మదింపునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల విలువలు గణనీయంగా పెంచేలా ప్రక్రియ సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్‌ విలువను 40 శాతం పైగా పెంచనున్నారని విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి తెచ్చేలా రెండ్రోజులుగా జిల్లా రిజిస్ట్రార్లు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయంలో చేస్తున్న మదింపు ప్రక్రియ ముగింపుదశకు చేరుకుంది. రెండ్రోజుల్లో ప్రభుత్వ ఆమోదానికి దస్త్రాన్ని పంపనున్నారు.

ఎనిమిది నెలల్లోనే మరోసారి ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువలను సవరించారు.తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి 2021 జులైలో మార్కెట్‌ ధరలను సవరించడంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. ఏటా సుమారు రూ.3,000-3,500 కోట్ల అదనపు రాబడి వస్తుందని సర్కారు అంచనా వేసింది. గత ఎనిమిది నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పాటు ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్యే తొమ్మిది లక్షలు దాటింది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆస్తులకు భారీ డిమాండ్‌ ఉంది. ఏడేళ్ల తర్వాత మార్కెట్‌ విలువలు పెంచినా వాస్తవంగా ఉన్న బహిరంగ మార్కెట్‌ ధరలకు పొంతనలేదని సర్కారు గుర్తించింది. ఇటీవల హెచ్‌ఎండీఏ ద్వారా భూములను విక్రయించినపుడు ఈ అంశాన్ని గమనించింది. దీంతో రిజిస్ట్రేషన్‌కు ప్రాతిపదికగా ఉండే మార్కెట్‌ విలువల్లో మరింత హేతుబద్ధత ఉండాలని భావిస్తోంది. అందుకే ఎనిమిది నెలల్లోనే మరోమారు సవరించాల్సి వస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. సాధారణంగా రెండేళ్లకు ఒకసారి మార్కెట్‌ విలువల్ని సవరిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని.. తాజాగా స్థిర పరచి రెండేళ్లకోసారి సవరణ ప్రక్రియ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ రాబడుల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం కీలకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భూముల విలువ ప్రస్తుతం ఉన్నదానికంటే 50 శాతం, ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువ 35 శాతం, అపార్ట్‌మెంట్‌ ప్లాట్ల విలువ 25 శాతం పెంచేలా కసరత్తు జరుగుతోంది.

ప్రస్తుత విధానం ఇది..
వ్యవసాయ భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాలను పరిధులుగా నిర్ణయించి ప్రతిదాంట్లో కనీస ధరతో పాటు తక్కువ, మధ్య, గరిష్ఠ శ్రేణి విలువలు అమలులో ఉన్నాయి. ఖాళీ స్థలాలకు సంబంధించి రెవెన్యూ గ్రామాలు, మండల కేంద్రాలు, 50 వేల జనాభా కంటే తక్కువ ఉన్న పురపాలక పట్టణాలు, గ్రేడ్‌1 పురపాలక పట్టణాలు, నగరపాలక సంస్థలు, హెచ్‌ఎండీఏ పరిధి-1, హెచ్‌ఎండీఏ పరిధి-2, జీహెచ్‌ఎంసీ పరిధిలో వేర్వేరు మార్కెట్‌ విలువలున్నాయి. ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్‌లకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు- నగరపాలక సంస్థలు, హైదరాబాద్‌ మహా నగర పాలక సంస,్థ జీహెచ్‌ఎంసీ పరిధి అంటూ వివిధ వర్గీకరణలున్నాయి. వీటిలో కూడా డోర్‌ నంబర్లు, వీధుల ప్రాతిపదికగా వేర్వేరు మార్కెట్‌ రేట్లు అమలులో ఉన్నాయి.


విలువల సవరణకు ఉత్తర్వులు

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువలను సవరించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి అనుమతిచ్చారు. ఉత్తర్వులకనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని