Telangana News: మేడారం జాతర కోసం 3,845 బస్సులు

‘మేడారం జాతరకు వచ్చే భక్తులకు లాభనష్టాలతో సంబంధం లేకుండా మెరుగైన సేవలను అందించాలి. వారికి ఎక్కడా ఇబ్బందులు కలగకూడదు’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు.

Updated : 01 Feb 2022 07:27 IST

కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి

ఆర్టీసీ ఏర్పాట్లపై రవాణా మంత్రి పువ్వాడ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ‘మేడారం జాతరకు వచ్చే భక్తులకు లాభనష్టాలతో సంబంధం లేకుండా మెరుగైన సేవలను అందించాలి. వారికి ఎక్కడా ఇబ్బందులు కలగకూడదు’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 13 నుంచి 20వ తేదీ వరకు మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ‘జాతర కోసం 3,845 బస్సులు నడపాలని నిర్ణయించాం. మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో బస్సు ప్రాంగణం ఏర్పాటుచేస్తున్నాం. వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి బస్సులు నడపాలి. సిబ్బందికి మంచి ఆహారాన్ని అందించటంతోపాటు మెరుగైన వసతి సదుపాయాలను కల్పించాలి. వారికి కరోనా బూస్టర్‌ డోస్‌ వేయించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. శానిటైజర్లు, మాస్కులు ఇవ్వాలి. వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. డిపో నుంచి బయలుదేరే ముందు బస్సులను పూర్తిగా శానిటైజ్‌ చేయాలి’ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ‘ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి’ అని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సూచించారు. 

12,150 మంది సిబ్బంది

జాతరకు సేవలు అందించేందుకు 12,150 మంది సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ చెప్పారు. వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఆర్టీసీ అధికారులు మునిశేఖర్‌, పురుషోత్తం, వినోద్‌, యాదగిరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మొగిలయ్యకు సత్కారం

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర మొగిలయ్యను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌లు సత్కరించారు. ఉచిత బస్‌పాస్‌ ఇచ్చినందుకు మొగిలయ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు