Green tea: గ్రీన్‌ టీతో కరోనా వైరస్‌కు చెక్‌!

గ్రీన్‌ టీలో ఆరోగ్యాన్ని కాపాడే యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని, ఈ టీ సేవనం క్యాన్సర్లకు చెక్‌ పెడుతుందనేది ఇప్పటికే తెలిసిన విషయం. కరోనా వైరస్‌నూ అడ్డుకునే శక్తి

Updated : 03 Feb 2022 07:27 IST

ఎన్‌ఐఎన్‌, ఓయూ అధ్యయనం వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రీన్‌ టీలో ఆరోగ్యాన్ని కాపాడే యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని, ఈ టీ సేవనం క్యాన్సర్లకు చెక్‌ పెడుతుందనేది ఇప్పటికే తెలిసిన విషయం. కరోనా వైరస్‌నూ అడ్డుకునే శక్తి ఇందులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది. కరోనా వైరస్‌పై గ్రీన్‌ టీ ప్రభావంపై ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లోని వివిధ విభాగాలు, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి చెందిన శాస్త్రవేత్తలు కరోనా తొలి, రెండు దశల్లో దాదాపు 6 నెలలపాటు ల్యాబ్‌లో పరిశీలించారు. సైంటిస్టులు రామకృష్ణ ఉంగరాల, మన్నె మునికుమార్‌, సురేష్‌ నారాయణ సిన్హా, ఆర్‌.శ్యాంసుందర్‌, సురేష్‌ చల్లా, డిలేశ్వర్‌కుమార్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

సాధారణంగా గ్రీన్‌ టీలో ఎపిగాల్లో కాటెచిన్‌-3-గాలేట్‌ (ఈజీసీజీ) అనే పదార్థం ఉంటుంది. ఇది బయట గాలితో కలిసినప్పుడు ఆక్సీకరణం చెంది వివిధ మ్యాలిక్యూల్స్‌గా విడిపోతుంది. మానవ కణాలపై వీటిని ప్రయోగించినప్పుడు కొవిడ్‌ నియంత్రణకు ఇవి తోడ్పాటు అందించాయి. కొవిడ్‌ బాధితుల్లో ఇన్‌ఫ్ల్లమేషన్‌ (వాపు) అతిపెద్ద సమస్య. కరోనా రెండో దశలో పలువురిలో.. శరీరంలోని వివిధ భాగాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగి ప్రాణాల మీదకు వచ్చింది. గ్రీన్‌ టీలో ఉండే ఈజీసీజీ ఇతర మూలకాలు ఇన్‌ఫ్ల్లమేటరీ మార్కర్లను తగ్గించడంలో కీలకంగా మారుతున్నట్లు తేలింది. అంతేకాక ఊపిరితిత్తుల్లోని స్పైక్‌ ప్రొటీన్లనూ ఈజీసీజీ, ఇతర మాలిక్యూల్స్‌ అడ్డుకుంటున్నట్లు ప్రాథమిక అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఎల్‌-6, ఐఎల్‌-1బీటా, టీఎన్‌ఎఫ్‌-గామా తదితర ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లనూ సమర్థంగా నిరోధిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారు నిత్యం 3-4 కప్పులు గ్రీన్‌టీ తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని