Inter Exams: ఏప్రిల్‌ 20 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఆ రోజు ప్రథమ సంవత్సరం, 21వతేదీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష

Updated : 08 Feb 2022 05:20 IST

మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ప్రాక్టికల్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఆ రోజు ప్రథమ సంవత్సరం, 21వతేదీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు సోమవారం కాలపట్టికను విడుదల చేసింది. ప్రాక్టికల్స్‌ మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరుగుతాయని బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఏప్రిల్‌ 11వ తేదీన మొదటి ఏడాది విద్యార్థులకు నైతికత, మానవీయ విలువలు, 12వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రథమ ఏడాది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మే నెల 2వ తేదీ నాటికి, రెండో ఏడాదికి అదే నెల 5వ తేదీకి పరీక్షలు పూర్తవుతాయి. అన్ని పరీక్షలు 10వ తేదీతో ముగుస్తాయి. ఈసారి 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతాయని గతంలోనే ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ప్రాక్టికల్స్‌ కూడా 70 శాతం సిలబస్‌తోనే నిర్వహిస్తారు. కాలపట్టిక విడుదలైన నేపథ్యంలో మార్చి నాటికి పాఠ్య ప్రణాళిక పూర్తిచేయాలని బోర్డు అధికారులు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

జూన్‌ నెలాఖరులోనే ఎంసెట్‌?
ఇంటర్‌ సెకండియర్‌ సైన్స్‌ పరీక్షలు మే నెల 5వ తేదీతో ముగియనున్నందున ఎంసెట్‌ను జూన్‌ నెలాఖరులోపు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. జేఈఈ మెయిన్‌ను ఎన్ని విడతలు, ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఇప్పటివరకు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటించలేదు. మార్చిలో మొదటి విడత జరుపుతామని గతంలో వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ కూడా ఇప్పటివరకు వెల్లడికాలేదు. దాంతోపాటు ఇంకా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఆ పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని జేఈఈ మెయిన్‌ పరీక్షల కాలపట్టికను విడుదలచేసే అవకాశం ఉంది. ఎంసెట్‌ నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రిని ‘ఈనాడు’ సంప్రదించగా జేఈఈ మెయిన్‌ తేదీలపై స్పష్టత వచ్చిన తర్వాతే తాము తేదీలను ఖరారు చేస్తామన్నారు. ఊహించిన దానికంటే ముందుగానే ఇంటర్‌ పరీక్షలు ముగుస్తున్నందున జూన్‌ నెలాఖరులోపు ఎంసెట్‌ జరుపుకోవడానికి మార్గం సుగమమైందని చెప్పారు.

ఇంటర్‌ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే నెల 5వ తేదీతో ముగుస్తున్నందున ఆ వెంటనే పదో తరగతి పరీక్షలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఆ పరీక్షల కాలపట్టికను విడుదలచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని