Samatha Murthy: వామపక్షవాదులకు సమతా కేంద్రాన్ని చూపించాలి: రాందేవ్‌ బాబా

‘‘భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే చెబుతుంటారు. సనాతన ధర్మంపై ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు. అలాంటి

Updated : 12 Feb 2022 08:45 IST

సనాతన ధర్మంపై వారి అనుమానాలన్నీ పటాపంచలవుతాయి

యోగా గురు వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌: ‘‘భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే చెబుతుంటారు. సనాతన ధర్మంపై ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు. అలాంటి వామపక్షవాదులకు ఒక్కసారి సమతామూర్తి కేంద్రాన్ని చూపించాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదో వారికి తెలుస్తుంది. వారిలోని అనుమానాలన్నీ పటాపంచలవుతాయి’’ అని యోగా గురు రాందేవ్‌ బాబా అన్నారు. శుక్రవారం రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు హాజరై సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రవచన మండపంలో జరిగిన సమావేశంలో చినజీయర్‌స్వామికి పాదాభివందనం చేసి మాట్లాడారు. ‘‘లక్ష మంది విద్యార్థులకు సనాతన ధర్మాన్ని బోధించేందుకు వీలుగా పతంజలి గ్లోబల్‌ విశ్వవిద్యాలయాన్ని తలపెట్టాం. పదివేల మంది విద్యార్థుల కోసం గురుకులం ఏర్పాటవుతోంది. వీటికి సంబంధించిన డిజైన్లను చినజీయర్‌స్వామి అనుమతించాకే నిర్మాణాలు చేపడతాం’’ అని రాందేవ్‌ బాబా చెప్పారు.

ఆచార్యుల తత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: గణపతి సచ్చిదానంద స్వామి

అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం వెయ్యేళ్ల క్రితమే గొంతెత్తిన శ్రీరామానుజాచార్యుల తత్వాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. లోకానికి ఉపకారం చేయడమే లక్ష్యంగా గణపతి సచ్చిదానంద స్వామి ముందుకు సాగుతున్నారని చినజీయర్‌ పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్‌ రవీంద్రనారాయణ్‌ రవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీఆర్డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, బక్సర్‌కు చెందిన లక్ష్మీ ప్రపన్న జీయర్‌ స్వామి, అయోధ్యకు చెందిన విద్యాభాస్కర్‌ తదితరులు కూడా కేంద్రాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ఇక్కడకు రానున్నారు.

నేత్రపర్వం.. దివ్యదేశ ప్రతిష్ఠాపనోత్సవం

చిన జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శుక్రవారం 36 ఆలయాలలో దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగింది. ఇందులో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రమూ ఉంది. మొత్తం 108 దివ్యదేశాలు ఉండగా.. ఇప్పటివరకు 87 ఆలయాలలో క్రతువు పూర్తయింది.

రాష్ట్రపతి పర్యటన రెండ్రోజులు..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రెండ్రోజుల హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 13న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి రామానుజుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేస్తారు. సాయంత్రం 6.50 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు బయల్దేరి దిల్లీ వెళతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు