Mamata Banerjee: ప్రత్యామ్నాయం దిశగా

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారును సాగనంపాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో గళమెత్తిన తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విపక్ష సీఎంలను ఏకంచేసే దిశగా పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు.

Updated : 15 Feb 2022 04:39 IST

మమత నోటా.. అదే మాట
కేసీఆర్‌, స్టాలిన్‌లతో ఫోన్‌ సంభాషణ
విపక్ష సీఎంలతో భేటీకి ప్రతిపాదన
కాంగ్రెస్‌ దారి వేరు.. మా మార్గం వేరు
అధ్యక్ష తరహా పాలనవైపు దేశం అడుగులు వేస్తోంది
సమాఖ్య స్వరూపాన్ని కాపాడతామన్న తృణమూల్‌ అధ్యక్షురాలు
కోల్‌కతా


కాంగ్రెస్‌తో ఏ ప్రాంతీయ పార్టీకి సుహృద్భావ సంబంధాల్లేవు. ఆ పార్టీ దాని దారిలో వెళ్తోంది. మా దారిలో మేం వెళ్తాం. తమను తాము లౌకికవాదులుగా చెప్పుకొనేవారు ప్రతి ఒక్కరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలి.

- మమతా బెనర్జీ


భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపైనా మేం మాట్లాడుకున్నాం. విపక్ష ముఖ్యమంత్రుల సమావేశం త్వరలో జరగనుంది.

- స్టాలిన్‌


కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారును సాగనంపాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో గళమెత్తిన తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విపక్ష సీఎంలను ఏకంచేసే దిశగా పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు. భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి గురించి గట్టిగా ప్రతిపాదిస్తున్న ఆమె కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మమత సోమవారం స్వయంగా వెల్లడించారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నానికి గురి కాకుండా తామంతా కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌.. యోగి కాదు భోగి అని విమర్శించారు. మార్చి 3న వారణాసిలో సమాజ్‌వాదీ తరఫున ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొంటానని, దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా యూపీలో తృణమూల్‌ అభ్యర్థుల్ని పోటీ చేయించడం లేదని ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆమె చెప్పారు. ‘అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) యూపీలో ఏ ఒక్క స్థానంలో బలహీనపడాలని మేం కోరుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలిదశలో ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో 37 చోట్ల ఎస్పీయే నెగ్గుతుందని అంచనా వేస్తున్నాం. దేశాన్ని రక్షించాలంటే ముందుగా యూపీని కాపాడాలి’ అని వివరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలంటే యూపీ, బెంగాల్‌వంటి పెద్ద రాష్ట్రాలు అత్యంత కీలకమన్నారు.

కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలకు మంచి సంబంధాల్లేవు 

‘మాతో చేతులు కలపాలని కాంగ్రెస్‌, సీపీఎంలను అడిగా. వారు వినకపోతే నేను చేసేదేమీ లేదు. విద్వేషం, దురాగతాలు అనే బీజాల నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం అధ్యక్ష తరహా సర్కారు వైపు అడుగులు వేస్తోంది. అందుకే రాజ్యాంగాన్ని కుప్పకూలుస్తున్నారు’అని మమత ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలన్నీ  ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

నగరపాలక సంస్థల్లో విజయంపై హర్షం 

బెంగాల్‌లోని నాలుగు నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల మమత హర్షం వ్యక్తం చేశారు. బిధాన్‌నగర్‌లో 41 స్థానాల్లో 39, అసన్సోల్‌లో 106 స్థానాల్లో 66, చందర్‌నాగోర్‌లో 32 సీట్లకు 31, శిలిగుడిలో 47 స్థానాల్లో 37 తృణమూల్‌ గెలుచుకుంది. భాజపా, కాంగ్రెస్‌, వామపక్షాలు ప్రభావం చూపలేకపోయాయి. దీనిని ప్రజా విజయంగా మమత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని