CM KCR:సరైన సమయంలో గళం విప్పారు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పాలన, విధానాలను వ్యతిరేకిస్తూ ఫెడరల్‌ న్యాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. సమగ్రంగా చర్చించేందుకు ముంబయి రావాలని ఆయన ఆహ్వానించగా కేసీఆర్‌ అంగీకరించారు.

Updated : 17 Feb 2022 06:18 IST

కేంద్రంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు.. కేసీఆర్‌తో మహారాష్ట్ర సీఎం
ముంబయికి రావాలని ఆహ్వానం.. 20న వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
ఈనాడు - హైదరాబాద్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పాలన, విధానాలను వ్యతిరేకిస్తూ ఫెడరల్‌ న్యాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించారు. సమగ్రంగా చర్చించేందుకు ముంబయి రావాలని ఆయన ఆహ్వానించగా కేసీఆర్‌ అంగీకరించారు. ఈ నెల 20న తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లనున్నారు. సీఎంవో కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం..‘‘ఠాక్రే బుధవారం కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ధోరణి, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. మీరు గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. దీనికి ప్రజలందరి నుంచి మద్దతు లభిస్తుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఠాక్రే అన్నారు. ఈ దేశాన్ని విభజనశక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. వీటిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా ముంబయికి రావాలని, తమ ఆతిథ్యాన్ని తీసుకోవాలని కేసీఆర్‌ను కోరగా తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న ముంబయికి వస్తున్నట్లు చెప్పారు’’.

సీఎం రాష్ట్రాల పర్యటనలు

భాజపా పాలనపై వివిధ రాజకీయ పార్టీల మద్దతు సమీకరణలో భాగంగా కేసీఆర్‌ మరోసారి రాష్ట్రాలు పర్యటించనున్నారు.20న ముంబయితో ప్రారంభిస్తారు. గత కొన్ని రోజలుగా ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కేంద్రం వైఖరి, దానికి వ్యతిరేక వ్యూహం గురించి చర్చించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ హైదరాబాద్‌ రాగా ఆయనతోనూ సీఎం సమావేశమయ్యారు. నాలుగు రోజుల క్రితం ఉద్ధవ్‌ఠాక్రేతోనూ ప్రాథమికంగా చర్చించారు. మళ్లీ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబయిలో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆయన మరోసారి బెంగాల్‌, తమిళనాడు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తోనూ కేసీఆర్‌ మంతనాలు సాగిస్తున్నారు. త్వరలో ఒడిశా పర్యటనకు వెళ్లే వీలుంది. ముందుగా పలువురు ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం ఆయన దిల్లీకి వెళ్లి అక్కడ విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలతో భేటీ అయ్యే వీలుంది.

21న బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18 నుంచి మరోసారి వరుస పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ నెల 18న మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు హాజరుకానున్నారు. 20న ముంబయి వెళ్తారు. 21న నారాయణఖేడ్‌లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 23న..మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.


వార్ధా బ్యారేజీపైనా చర్చ

ఈనాడు హైదరాబాద్‌: మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశంలో వార్ధా బ్యారేజీ నిర్మాణం గురించి కూడా కేసీఆర్‌ చర్చించనున్నట్లు తెలిసింది. గతంలో ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. మొదట 152 మీటర్లతో చేపట్టగా ముంపు సమస్యతో మహారాష్ట్ర సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో పునరాకృతిలో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి కాళేశ్వరం చేపట్టిన ప్రభుత్వం, ప్రాణహిత వద్ద 148 మీటర్లతో చేపట్టి అదిలాబాద్‌ జిల్లాలోని ఆయకట్టుకే పరిమితం చేసింది. ఇటీవల ఈ బ్యారేజీని తుమ్మిడిహట్టి వద్ద కాకుండా వార్ధాపైన చేపట్టాలని ప్రతిపాదించింది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని