TEXT TILE PARK: రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కు?

రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రప్రభుత్వం తెలంగాణ సర్కారును కోరింది. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ కార్యదర్శి యూపీసింగ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం,

Updated : 17 Feb 2022 06:31 IST

పీఎం-మిత్ర పథకం కింద దేశంలో 7 పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం
రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు కోరిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రప్రభుత్వం తెలంగాణ సర్కారును కోరింది. ఈ మేరకు కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ కార్యదర్శి యూపీసింగ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం, ఉద్యోగావకాశాల కల్పన కోసం ప్రధానమంత్రి మెగా సమీకృత టెక్స్‌టైల్‌ పారిశ్రామికవాడలు, అపరెల్‌ పార్కులు (పీఎం మిత్ర) పథకం కింద కేంద్రం ఈ పార్కులను ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగా రూ.4445 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఏడు పార్కుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15లోగా ప్రతిపాదనలు అందజేయాలని సూచించింది.

కనీసం వెయ్యి ఎకరాల్లో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఒకో పార్కు కనీసం వెయ్యి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతంగా ఉంటుంది. తొలివిడత నిధుల కింద కొత్తగా ఏర్పాటు చేసే పార్కుకు రూ.300 కోట్లు, అప్పటికే ఉపయోగంలో ఉన్న పార్కులకు రూ.100 కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. తొలివిడత ప్రాజెక్టులో 60 శాతం ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడంతో పాటు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, 25 వేల మందికి ఉపాధి కల్పిస్తే రెండో విడత నిధులు మంజూరవుతాయి. రెండో విడతలో కొత్త పార్కుకు రూ.200 కోట్లు, ఇప్పటికే వినియోగిస్తున్న పార్కుకు రూ.100 కోట్లు కేటాయించనుంది. ప్రాజెక్టులను కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదిస్తుంది. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును నిర్మిస్తోంది. ఈ పార్కుతో పాటు రాష్ట్రంలో 20 పార్కులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి మరో లేఖ రాసింది.


‘పీఎం మిత్ర’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
సీఎంకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

పీఎం-మిత్ర పథకం కింద టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు సకాలంలో ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘కేంద్ర ప్రభుత్వం 5ఎఫ్‌ ఫార్ములా కింద పీఎం-మిత్ర టెక్స్‌టైల్‌ పార్కులను ప్రకటించింది. దీని ద్వారా దారం నుంచి వస్త్రం తయారీ వరకు అన్ని రకాల ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం చేనేత, జౌళి పరిశ్రమలు, విభిన్న చేనేత సంప్రదాయాలకు కేంద్రంగా ఉంది. భూభౌతిక (జీఐ) గుర్తింపు కలిగిన చేనేత ఉత్పత్తులైన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ చీరలు, చేనేత కార్పెట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రజల పాలిట ఈ పథకం వరంగా మారుతుందని ఆశిస్తున్నా. పథకం నోటిఫికేషన్‌, మార్గదర్శకాలతో కేంద్ర జౌళి శాఖ జనవరి నెలలో తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు పంపింది. రాష్ట్ర సర్కారు దీన్ని మంచి అవకాశంగా తీసుకుని, సకాలంలో ప్రతిపాదనలు సమర్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నిర్ణయంలో ఆలస్యం చేస్తే బంగారు తెలంగాణ సాధనలో మరో అవకాశాన్ని కోల్పోతాం’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని