GOVT MEDICAL COLLEGE: జిల్లాకో ప్రభుత్వ వైద్యకళాశాల!

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైద్యకళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను వచ్చే బడ్జెట్‌లోనే పొందుపర్చాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. బడ్జెట్‌కు సన్నాహకంగా ఇటీవల జరిగిన శాఖాపరమైన సమావేశాల్లో

Updated : 17 Feb 2022 06:29 IST

బడ్జెట్‌లో ప్రతిపాదించనున్న ఆరోగ్యశాఖ
రాష్ట్రంలో 5,390కి పెరగనున్న ఎంబీబీఎస్‌ సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైద్యకళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను వచ్చే బడ్జెట్‌లోనే పొందుపర్చాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. బడ్జెట్‌కు సన్నాహకంగా ఇటీవల జరిగిన శాఖాపరమైన సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉస్మానియా (250), గాంధీ (250), కాకతీయ (250), మహబూబ్‌నగర్‌ (175), సిద్దిపేట (175), నల్గొండ (150), సూర్యాపేట (150), నిజామాబాద్‌ (120), ఆదిలాబాద్‌ రిమ్స్‌ (120) వైద్య కళాశాలల్లో కలిపి మొత్తంగా 1,640 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వచ్చే వైద్యవిద్యా సంవత్సరంలో (2022-23) సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్‌, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, రామగుండంలలో మొత్తం 8 ప్రభుత్వ వైద్యకళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో దాంట్లో 150 ఎంబీబీఎస్‌ సీట్లుంటాయి. వీటికి అదనంగా 2023-24 వైద్యవిద్యా సంవత్సరంలో వికారాబాద్‌, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లోనూ వైద్యకళాశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఇటీవల జనగామ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ జిల్లాలోనూ ప్రభుత్వ వైద్యకళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం 21 జిల్లాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. దశలవారీగా మిగిలిన 12 జిల్లాల్లోనూ కొత్త కళాశాలలను నెలకొల్పడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు పొందుపర్చనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఒక్కో కళాశాలలో 150 చొప్పున.. వచ్చే మూణ్నాలుగు ఏళ్లలోనే రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే మొత్తంగా 5,390 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి. తద్వారా జిల్లాల్లోనూ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు విస్తరిస్తాయి. బోధనాసుపత్రులుగా అభివృద్ధి చెందడం వల్ల 24 గంటలూ స్పెషలిస్టు వైద్యుల సేవలు లభిస్తాయి. ఎక్కువమంది వైద్యవిద్యలో చేరడానికి అవకాశాలు మెరుగవుతాయి. 2022-23 బడ్జెట్‌లో వైద్యఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపులు 20-30 శాతం పెరిగే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని