Telangana News: బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్ల్లు?

రాష్ట్రంలో మరో భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధమవుతోంది. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావహంతో పెద్దపద్దుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్‌ దిశగా అడుగులు వేస్తోంది.

Updated : 19 Feb 2022 08:45 IST

సొంత ఆదాయంలో గణనీయ వృద్ధి

సంక్షేమం, దళితబంధుకు పెద్దపీట

భారీగా పెరగనున్న ప్రభుత్వ వ్యయం

2022-23 పద్దుపై ఆర్థికశాఖ కసరత్తు వేగవంతం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధమవుతోంది. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావహంతో పెద్దపద్దుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్‌ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో  ప్రక్రియను వేగవంతం చేసింది. పన్నురాబడులు, పన్నేతర ఆదాయం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో పెరగనున్న రుణాలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో వృద్ధిరేటు పెరుగుదల తదితర అంశాల ప్రాతిపదికగా పెద్దబడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. సంక్షేమం, వ్యవసాయం, దళితబంధు పథకానికి భారీగా కేటాయింపులుండాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో పద్దు పరిమాణం పెరగనుంది. ప్రస్తుత అంచనా రూ.2.30 లక్షల కోట్లు కాగా వచ్చే బడ్జెట్‌ రూ.2.50 లక్షల కోట్లు దాటుతుందని విశ్వసనీయ సమాచారం. పద్దు కసరత్తు ఈ నెల మూడో వారంలోపు పూర్తిచేయాలని ఆర్థికశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. శాఖల వారీ ప్రతిపాదనల పరిశీలన దాదాపు పూర్తయింది.

పెరిగిన వాణిజ్య పన్నులశాఖ ఆదాయం

అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే విభాగాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వాణిజ్య పన్నులశాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖతో పాటు ఎక్సైజ్‌ శాఖల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదాయ పెంపుపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. 

* 2021-22 ఆర్థిక సంవత్సంలో వాణిజ్యపన్నులశాఖ సాధించిన రాబడి మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు 25 నాటికే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ శాఖ అంచనాలు దాటనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, అమ్మకంపన్ను ఆదాయ పెరుగుదల 15-20 శాతం ఉంటుందని భావిస్తున్నారు.
* రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ సారి రూ.12,500 కోట్లుగా అంచనా వేయగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.15,000 కోట్లు దాటనుంది. జీఎస్‌డీపీలో వృద్ధిరేటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకునే రుణం మొత్తం కూడా పెరగనుంది. ప్రస్తుత ఏడాది ఈ రుణ లక్ష్యం రూ.45,559గా అంచనా వేసింది.
* ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ఈ సారి ఈ రెండు ప్రాధాన్య రంగాలకు భారీ కేటాయింపులుంటాయని అంచనా. దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయడం లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ సంక్షేమానికి పెద్దమొత్తంలో నిధులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్‌సీ అమలు, పథకాలకు కేటాయింపులు, వివిధ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయం కూడా పెరగనుంది. దీంతో బడ్జెట్‌ పరిమాణం పెరగడం అనివార్యమని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషించారు. ఆదాయ అంచనాలపై దాదాపు స్పష్టత రావడంతో బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చి సీఎంకి నివేదించడానికి ఆర్థికశాఖ సిద్ధమైంది.

తొలగిన అవరోధాలతో పక్కాగా పన్నేతర రాబడి

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా సర్కారు భారీగా నిధులను సమకూర్చుకోనుంది. ఈ బడ్జెట్‌లో భూముల అమ్మకం ద్వారా రూ.20వేల కోట్ల అంచనా వేయగా ఇప్పటికి రూ.5,000 కోట్లలోపే వచ్చింది. అయితే విక్రయానికి అవరోధాలు తొలగిపోవడంతో వేలం ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే వేలం వేసిన భూములకు రికార్డు స్థాయిలో ధరలు, హైదరాబాద్‌ చుట్టుపక్కల రియల్‌ఎస్టేట్‌ జోరు తదితర అంశాలతో భూముల అమ్మకం ద్వారా భారీ రాబడిని అంచనా వేస్తుంది. న్యాయపరమైన వివాదాలు పరిష్కారం కావడంతో పాటు అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ద్వారా భూముల విక్రయానికి రంగం సిద్ధంచేస్తోంది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందే మొత్తం రూ.32వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని