అప్పులు ‘రూ.5000 కోట్లు’ దాటాయ్‌..!

ఆర్టీసీ అప్పుల కుప్పల్లో చిక్కుకుంది. నష్టాల బాటలో సాగుతోంది. కాలంచెల్లిన బస్సులతో నెట్టుకొస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలితాన్ని ఇస్తున్నాయి.

Published : 19 Feb 2022 03:46 IST

ఏడేళ్లలో ఆర్టీసీ నష్టాలు రూ.9 వేల కోట్లకు చేరువలో..

ఈనాడు, హైదరాబాద్‌

ఆర్టీసీ అప్పుల కుప్పల్లో చిక్కుకుంది. నష్టాల బాటలో సాగుతోంది. కాలంచెల్లిన బస్సులతో నెట్టుకొస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది జనవరి వరకు ఆర్టీసీ చెల్లించాల్సిన అప్పులు రూ.5,043.33 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.2,321 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సినవే కావటం విశేషం. మరోపక్క నష్టాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు వరకు సంస్థ నష్టం రూ.8,995.31 కోట్లకు చేరింది. కరోనా సమయంలో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింది. ప్రభుత్వం నెలవారీగా నిధులిస్తే కానీ జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు చెల్లించేలా బ్యాంకుతో యాజమాన్యం ఒప్పందం చేసుకోవటంతో వెతుకులాట తప్పింది.

దుబారాకు ముకుతాడు వేస్తేనే..

ఆర్థికంగా కుదుటపడేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పెంచుకోవటంతో పాటు దుబారాకు ముకుతాడు వేయాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గడిచిన కొద్ది కాలంగా ఇమేజ్‌ పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వకపోగా ఆదాయానికి గండి పడుతోందని అధికారులు సైతం చెబుతున్నారు.

* వాహనాల విషయంలో దుబారా భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. వివిధ స్థాయుల్లో 246 వాహనాలు వినియోగిస్తున్నారు. అందులో ఆర్టీసీ సొంతవి 81 కాగా, అద్దెవి 136. మరో 29 అధికారుల స్వంత వాహనాలను అద్దె ప్రాతిపదికన అనుమతి తీసుకుని వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. వీటికి సంస్థ నెలకు రూ.35 లక్షలకుపైగా చెల్లిస్తోంది.
* దుబారా తగ్గించుకోవటంతో పాటు నిరుపయోగంగా ఉన్న స్థలాలను లీజు ప్రాతిపదికన ఇవ్వటం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకున్న అవకాశాలపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.
* విద్యుత్తు సంస్థల తరహాలోనే ఆర్టీసీ అప్పులను కూడా ప్రభుత్వం తీసుకుని, కనీసం 150 నూతన బస్సుల కొనుగోలు కోసం ఏకమొత్తంగా ఆర్థిక సహాయం చేస్తే కొంత మేరకు కుదుటపడుతుంది. లేని పక్షంలో అప్పులు, నష్టాలతో మరింత కుదేలవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని