Telangana: ప్రభుత్వరంగ సంస్థల్లోనూ 95% ఉద్యోగాలు స్థానికులకే

తెలంగాణలో అమలుచేస్తున్న కొత్త జోనల్‌ విధానాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకూ వర్తింపజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీచేసింది. సేవా నిబంధనలనూ అమలు చేయాలని నిర్దేశించింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టి

Updated : 20 Feb 2022 05:28 IST

కొత్త జోనల్‌ విధానం మేరకు రిజర్వేషన్ల అమలు

ప్రక్రియపై 23లోగా నివేదిక ఇవ్వండి

అన్ని శాఖల కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అమలుచేస్తున్న కొత్త జోనల్‌ విధానాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకూ వర్తింపజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీచేసింది. సేవా నిబంధనలనూ అమలు చేయాలని నిర్దేశించింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టి ఈ నెల 23 నాటికి  సాధారణ పరిపాలనా శాఖకు నివేదిక పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఆ ప్రకారం ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలైన వివిధ కార్పొరేషన్లు, కంపెనీలు (సింగరేణి కాలరీస్‌, ట్రైబల్‌ మైనింగ్‌ వంటివి), బోర్డులు (హౌసింగ్‌, పారామెడికల్‌, వక్ఫ్‌, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి తదితరాలు), అథారిటీలు, సమాఖ్యలు, సొసైటీలు (సెర్ప్‌, గురుకుల విద్యాలయాలు, టెస్కో తదితరాలు), అకాడమీలలో జరిగే కొత్త ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ స్థాయి వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు లభిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, బోర్డులు, కమిషన్లలో దాదాపు 41 వేల మంది ఉద్యోగులున్నారు. గతంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వీటిలో అమలు కాలేదు. ఎక్కువ మంది స్థానికేతరులకు అవకాశాలు లభించాయి. కొత్త జోనల్‌ విధానం మేరకు 95 శాతం స్థానికతను అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయాలన్న ఉద్యోగ సంఘాల వినతి మేరకు సీఎం కేసీఆర్‌ స్పందించారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 వేల వరకు ఖాళీలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వాటి భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వాటిల్లోనూ జిల్లాల వారీగా 95 శాతం రిజర్వేషన్ల మేరకు నియామకాలు జరిగే వీలుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎన్జీవో, టీజీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్‌, మమత, ప్రతాప్‌, సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ పద్మాచారి, రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్‌ హర్షం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని