CM KCR: దేశమంతా తెలంగాణలా..

‘స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం ఉండాల్సిన విధంగా లేదు. దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోంది. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పనికిమాలిన దందా నడుస్తోంది. మనకు పరిశ్రమలు రావాలన్నా, కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా వాతావరణం మంచిగా ఉండాలి. శాంతిభద్రతలు బాగుండాలి. మతం పేరిట కత్తులు పట్టి పొడుచుకుంటారు.. కర్ప్యూ, ఫైరింగ్‌ ఉంటాయంటే ఎవరూ రారు. మనం తెలంగాణను ఎంత బాగా చేసుకున్నామో, దేశమూ

Updated : 22 Feb 2022 05:38 IST

అలా అభివృద్ధి చెందాలన్నదే నా ఆశయం
అందుకే దిల్లీ దాకా మనం కొట్లాడాల్సిన అవసరముంది
పోరాటానికి బయలుదేరా.. మీ అందరి దీవెనలు కావాలి  
నారాయణఖేడ్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, సంగారెడ్డి: ‘స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం ఉండాల్సిన విధంగా లేదు. దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోంది. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పనికిమాలిన దందా నడుస్తోంది. మనకు పరిశ్రమలు రావాలన్నా, కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా వాతావరణం మంచిగా ఉండాలి. శాంతిభద్రతలు బాగుండాలి. మతం పేరిట కత్తులు పట్టి పొడుచుకుంటారు.. కర్ప్యూ, ఫైరింగ్‌ ఉంటాయంటే ఎవరూ రారు. మనం తెలంగాణను ఎంత బాగా చేసుకున్నామో, దేశమూ అదే విధంగా అభివృద్ధి సాధించాలి. దేశం గురించి మనం కొట్లాడాల్సిన అవసరముంది. బంగారు తెలంగాణ మాదిరిగా.. బంగారు భారతదేశాన్ని తయారు చేసుకోవాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు వివరించారు. అమెరికా కంటే గొప్పగా దేశాన్ని తయారు చేసేలా ముందుకు సాగాలన్నారు. మనం అమెరికాకు పోవడం కాదు.. వాళ్లే ఇక్కడకు వచ్చేలా చేసే గొప్ప సంపద, వనరులు ఈ దేశంలో ఉన్నాయన్నారు. జాతీయ రాజకీయాల్లో మనం ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. తాను పోరాటానికి బయలుదేరానని.. ప్రజలందరి దీవెనలు కావాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు నీళ్లందించేలా రూపొందించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు ఆయన సోమవారం నారాయణఖేడ్‌లో శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘ఈ ఏడేళ్లలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మీ అందరికీ తెలుసు. అనేక రంగాల్లో మనం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబడ్డాం. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ మనమే నంబర్‌ వన్‌. అర్హులందరికీ అసరా పింఛన్లు ఇస్తున్నాం. పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష ఇస్తున్నాం. వ్యవసాయ రంగంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మీ అందరికీ తెలుసు. విద్యార్థులు బయటకు వెళ్లి చదువుకోవాలంటే ఏ రాష్ట్రంలోనూ రూ. 20 లక్షలు ఇవ్వడం లేదు. మనం అంబేడ్కర్‌, జ్యోతిరావు ఫులే పేరు మీద అన్ని వర్గాల పిల్లలు విదేశాల్లో చదువుకునేలా స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాం. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి మీద రూ. 1.25 లక్షలు ఖర్చుచేస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఆ పిల్లలు బ్రహ్మాండంగా, అద్భుతంగా పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారు.  

అక్కడా.. రైతుబంధు, బీమా ఇస్తామంటున్నారు!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నన్ను అడిగారు. ‘మీరు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నారంట.. ఎలా ఇస్తున్నరో చెప్పండి.. మేము ఇస్తాం’ అని అడిగారు. రైతు చనిపోతే పది రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా ఇచ్చేది ఒక్క తెలంగాణలోనే. రైతుబంధు కావాలంటూ దండం పెట్టాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఇవ్వాల్సిన పనిలేదు. యాసంగి, వానాకాలాల్లో నేరుగా మీ ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. మనం అద్భుత ప్రగతి దిశగా దూసుకుపోతున్నాం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ప్రజల కోసం తపించే వ్యక్తి హరీశ్‌రావు

హరీశ్‌రావుపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. క్రియాశీల మంత్రి అంటూ కితాబిచ్చారు. ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉండే వ్యక్తి అని వివరించారు. ఆయన ఈ జిల్లాలో ఉండబట్టే అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఏడాదిన్నరలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలను పూర్తి చేసి జిల్లాకు గోదావరి జలాలు అందేలా చూడాలని హరీశ్‌రావుకు సూచించారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పథకాలకు తాను శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో పదిరోజుల తర్వాత కేతకీ సంగమేశ్వర దర్శనం కోసం వస్తానన్నారు. ఆ సమయంలో సంగారెడ్డిలో వైద్యకళాశాలను ప్రారంభిస్తానన్నారు.  ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. సంగారెడ్డి, జహీరాబాద్‌ పురపాలికలకు రూ. 100 కోట్లు, మిగతా ఆరు పురపాలికలకు రూ. 150 కోట్లు, 699 పంచాయతీలకు ఒక్కోదానికి రూ. 20 లక్షల చొప్పున రూ. 140 కోట్లు కేటాయిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిదుల కోరిక మేరకు నిజాంపేటను కొత్త మండలం చేస్తామని ప్రకటించారు.


దేశం బాగుంటే తెలంగాణ మరింత అభివృద్ధి

మీరు చాలా గౌరవం, ప్రేమతో ఎమ్మెల్యేలను గెలిపిస్తున్నారు.. రాష్ట్రంలో కేసీఆర్‌ ఉండాలని దీవిస్తున్నారు. వలసవాదుల పాలనలో జరిగిన అన్యాయాలను మీ అందరి దీవెనలతో.. తిప్పికొట్టాం. సాగు, తాగునీళ్లు, కరెంటు, విద్య, వైద్య రంగాల్లో మనం దూసుకుపోతున్నాం. మన తలసరి ఆదాయం దేశంలో గర్వంగా చెప్పుకొనే స్థాయిలో ఉంది. మరింత అభివృద్ధి సాధించాలంటే.. రాష్ట్రమే కాదు దేశమూ బాగుండాలి. అప్పుడే తెలంగాణను మరింత మెరుగ్గా మార్చుకోగలం.

మాట్లాడినోళ్ల వద్దే ఇప్పుడు కరెంటు లేదు

‘‘పట్టుబట్టి మనం తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడే ముందు ఎన్నో బద్నాంలు పెట్టారు. ఎన్నో అపనమ్మకాలు కలిగించారు. మీకు కరెంటు రాదు.. చీకటైపోతది. పరిశ్రమలు మొత్తం తరలిపోతాయి.. మీకు పరిపాలన చేతకాదని అన్నారు. ఇప్పుడు వాళ్ల వద్దే కరెంటు లేదు. ఇవాళ తెలంగాణలో 24 గంటల కరెంటుంది. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోని నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మీరిచ్చిన శక్తితోనే ఇది సాధ్యమైంది. మంచినీళ్ల బాధ శాశ్వతంగా పోయింది.’’  

- సీఎం కేసీఆర్‌


వేదికపైకి చిమ్నీబాయి

భలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల సందర్భంగా 2017లో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న చిమ్నీబాయి అనే మహిళ గురించి గుర్తు చేశారు. సర్దార్‌ తండాకు చెందిన ఆమె.. తమ తండాలో నీళ్లు లేవని, కరెంటు ఉండదని, రోడ్డు లేదంటూ తనకు చెప్పగా తాము అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్‌కు సాగునీళ్లు రానున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో చిమ్నీబాయి ఇక్కడే ఉండొచ్చు అని హరీశ్‌రావు అనగానే.. ఆమె ముందుకొచ్చారు. ఆమెను సీఎం కేసీఆర్‌ వేదికపైకి రమ్మన్నారు. తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. నారాయణఖేడ్‌ అభివృద్ధి కోసం హరీశ్‌రావు ఎంతగా కృషి చేశారో చెప్పడానికి చిమ్నీబాయిని ఇన్ని రోజులు గుర్తుంచుకోవడమే నిదర్శమని తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని