KCR:జనహృదయ సాగరమిది

ఎన్నో కష్టాలకోర్చితే మల్లన్నసాగర్‌ సాకారమైందని.. ఇది తెలంగాణ జనహృదయ సాగరమని.. రాష్ట్రం మొత్తాన్ని జలాలతో అభిషేకించే జలాశయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశమంతా కరవు వచ్చినా మనకా సమస్య ఉండదని పేర్కొన్నారు.

Updated : 24 Feb 2022 05:37 IST

దేశమంతటా కరవొచ్చినా.. మనకు రాదు
హైదరాబాద్‌ తాగునీటికి శాశ్వత పరిష్కారం
20 లక్షల ఎకరాలకు నీరందించే అద్భుత అవకాశం
మల్లన్నసాగర్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
దేశాన్ని దారికి తెచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడి

ఇక్కడ పనిచేసిన ఇంజినీర్ల బృందానికి నా కృతజ్ఞతలు. ఒక ఇంజినీర్‌పై నాలుగుసార్లు కోర్టు ధిక్కరణ కేసులు పెట్టారు. ఏమయ్యా భయపడుతున్నావా అని అడిగితే.. ‘ఏం సార్‌.. దొంగతనం చేసిననా? పోతే జైలుకు పోతా. నేను జైలునుంచి బయటకు వస్తే వందలు, వేల మంది ప్రజలు నన్ను ఊరేగింపుగా తీసుకొస్తారు సార్‌’ అని అన్నాడు. అలా ఎన్నో కష్టాల కోర్చి ఎండనక, వాననక అంతా కష్టపడి పనిచేశారు. వలసలు పోయే భయంకర కరవు నేలలో ప్రజలకు న్యాయం జరగాలని పనిచేశారు.


చిల్లర రాజకీయాల కోసమో.. నాలుగు ఓట్ల కోసమో ఉచిత కరెంటు ఇవ్వడం లేదు. నాకూ వ్యవసాయం ఉంది. గతంలో నాలుగేళ్లు బోర్లలో చుక్కనీళ్లు లేక ఒక్క గింజ కూడా పండించలేకపోయా. అలా గోసపడ్డాం. రైతాంగం వలసపోయింది. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ దుస్థితి పోవాలని రైతుబంధు, బీమా, ఉచిత కరెంటు ఇస్తున్నాం. తెలంగాణ రైతులు ఇప్పుడు ధీమాగా కాలరెగరేసి బతుకుతున్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవాళ్లు కూడా పల్లెటూళ్లలో పాత ఇళ్లు సర్దుకుంటున్నారు.

- సీఎం కేసీఆర్‌ 


ఈనాడు, సిద్దిపేట -ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: ఎన్నో కష్టాలకోర్చితే మల్లన్నసాగర్‌ సాకారమైందని.. ఇది తెలంగాణ జనహృదయ సాగరమని.. రాష్ట్రం మొత్తాన్ని జలాలతో అభిషేకించే జలాశయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశమంతా కరవు వచ్చినా మనకా సమస్య ఉండదని పేర్కొన్నారు. 557 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ జలాశయం 20 లక్షల ఎకరాల ఆయకట్టును కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని చెప్పారు. హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా మంచినీటి గోసను దూరం చేసే జలభాండాగారం అంటూ అభివర్ణించారు. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఏడేళ్లలోనే అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమైందని.. మత్స్య, పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని.. తాగునీటి గోస పోయిందని వివరించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని వాళ్లు తాగే స్వచ్ఛమైన మంచినీళ్లను ఆదిలాబాద్‌లోని అడవిబిడ్డలకూ అందిస్తున్నామన్నారు.తెలంగాణ రైతులు నష్టాలకు భూములు అమ్మడం లేదని, కనిష్ఠంగా ఎకరా రూ.20 లక్షల పైనే ధర ఉందని తెలిపారు. దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు.

చెప్పిన మాట మేరకు సాధించుకున్నాం

‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మించిన భారీ జలాశయం మల్లన్నసాగర్‌ ప్రారంభం చారిత్రక ఘట్టం. ఈ కలసాకారమయ్యే మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక దశలో ఏకకాలంలో 58 వేలమంది కార్మికులు పనిచేసేవారు. ఒక దుర్మార్గుడు పోయి కోర్టు స్టే తెచ్చాడు. నేను దిల్లీలో ఉన్నా.. అక్కడి నుంచే మన రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గారికి ఫోన్‌ చేశా. ఇది చిల్లర వ్యవహారం కాదు. ఇది తెలంగాణ ప్రజల జీవనాడి. వారి బతుకుతెరువుకు సంబంధించిన విషయం. మీరు దయచేసి ఉన్నతంగా ఆలోచించి ప్రాజెక్టును కాపాడాలని కోరా. మీరొచ్చి వివరాలు ఇవ్వండి.. నేను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. తర్వాత స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దుష్టశక్తులు దాదాపు 600కు పైగా కేసులు పెట్టాయి.. ఒక్కసారి కోర్టు స్టే వల్ల పని ఆగితే అంతమంది కార్మికులను తిరిగి తీసుకురావాలంటే ఏడాది పడుతుంది. ఆరోజు నేను చెప్పాను.. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకిస్తానని.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని.. ఆ కలను నేరవేర్చుకుంటున్నాం.

పరిజ్ఞానం లేకుండా మాట్లాడారు..

ప్రాజెక్టులంటే కనీస అవగాహన లేని వారు, కొన్ని పార్టీల వాళ్లు చిల్లర రాజకీయాలు చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు వద్ద దానిని నింపే సమయంలో రాద్ధాంతం చేశారు. భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి. వాటిని సవరించి మళ్లీ కడతారు. కనీస పరిజ్ఞానం లేనివారు రాజకీయాలు చేశారు. దిక్కుమాలిన సోషల్‌ మీడియాలో ఒకడు మిడ్‌మానేరు బలహీనంగా కట్టారని చిల్లర పోస్టులు పెట్టారు. నేను చాలా బాధపడ్డాను. నేను ఇంజినీర్లను ఒకటే కోరుతున్నా. కొండపోచమ్మ వద్ద కాల్వల మీద కట్టిన తూములు బలహీనంగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. లోపాలుంటే సవరించాలి. ప్రతిపక్షాలు ఇప్పటికైనా గమనించాలి.. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది. ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకల్లో పరిస్థితులేంటి.. ఏపీని మించి పంజాబ్‌తో పోటీపడుతూ మనం ధాన్యం పండిస్తున్నాం. ఏప్రిల్‌ నెలలోనూ చెరువులు కళకళలాడేలా చూడాలని అధికారులను కోరుతున్నా. కేంద్రం సహకరించకపోయినా బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నాం. తమ రాష్ట్రంలోనూ ఇక్కడిలాంటి స్కీంలు అమలు చేస్తామని మహారాష్ట్ర సీఎం నాతో చెప్పారు.

హరీశ్‌ సేవలు చాలా కీలకం

హరీశ్‌రావు సేవలు చాలా కీలకం. ఆయననూ అనేక ఇబ్బందులు పెట్టి బద్‌నాం చేశారు. వెరవకుండా క్రమశిక్షణతో అవినీతిరహితంగా పనిచేశారు. హరీశ్‌రావు చాలా కష్టపడే వ్యక్తి. జలాశయాలతో పాటు ప్రాజెక్టులను అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. రూ. 1,500 కోట్లు కేటాయిస్తున్నాం. వీటిని పర్యాటకులకు స్వర్గధామంగా మార్చాలి. మల్లన్నసాగర్‌లో బుర్జ్‌ ఖలీఫా కంటే అద్భుతమైన అంతర్జాతీయ కలర్‌ ఫౌంటెయిన్లు రావాలి. అవసరమైతే విదేశాలకు వెళ్లి చూసి రండి. సింగపూర్‌ నుంచి పర్యాటకులు మల్లన్నసాగర్‌కు రావాలి. హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా ఏర్పాట్లు చేయాలి.  

నిర్వాసితులను కాపాడుకుంటాం

ఎక్కడ ప్రాజెక్టు కట్టినా ముంపు తప్పదు. నా కుటుంబం కూడా అప్పర్‌ మానేరు ప్రాజెక్టులో మునిగింది. నిర్వాసితుల బాధేంటో నాకు తెలుసు. అందుకే వారికి పరిహారం ఇచ్చేలా ప్రత్యేక జీవో తెచ్చాం. రూ.100 కోట్లు ఖర్చయినా సరే వారు సంతోషంగా ఉండేలా చూడాలి. ఈ ప్రాంత బిడ్డగా మీరు దీవిస్తేనే తెలంగాణ తెచ్చిన. ఈ రోజు మల్లన్నసాగర్‌ తెచ్చిన. మీ బిడ్డగా ఈ ప్రాంతవాసులకు అన్యాయం జరగాలని నేను కోరుకోను’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కొమురవెల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అప్పట్లో చెప్పినట్లుగానే మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు తీసుకువెళ్లి మల్లన్న పాదాలను అభిషేకించారు.

కల సాకారం చేసుకున్నాం: హరీశ్‌రావు

మూడున్నరేళ్లలోనే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును పూర్తి చేయడం వెనక సీఎం కేసీఆర్‌ కృషి ఎంతో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం కోసం ఆయన కొన్నివేల గంటల సమయం వెచ్చించారన్నారు. జలాశయ నిర్మాణం కోసం స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే మిగతా ప్రాంతాలకు సులభంగా నీరు అందుతుందనే ఉద్దేశమే ఇందుకు కారణమన్నారు. నదికి నడకలు నేర్పిన నాయకుడు కేసీఆర్‌ అంటూ అభివర్ణించారు. నిర్మాణాల్లో పాలుపంచుకోవడంతో తన జీవితం ధన్యమైందన్నారు.


దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తా

దేశం దారి తప్పుతోంది. జుగుప్సాకరమైన పరిస్థితులున్నాయి. మతకల్లోలాలు జరిగి కర్ఫ్యూలు విధించే పరిస్థితులు ఉంటే మన వద్దకు ఎవరూ రారు. పెట్టుబడులు పెట్టరు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నందువల్లే ఇక్కడికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. రూ. 1.50 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులే దేశంలోనూ ఉండాలి. అప్పుడే అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. ఇటీవల ఇద్దరు ఐఏఎస్‌లు నన్ను కలిశారు. తమ బిడ్డలు బెంగళూరులో చదువుతున్నారని, ఇప్పుడు వారిని అక్కడికి పంపాలంటే భయమేస్తుందన్నారు. మతకల్లోలాలు ఈ దేశానికి ప్రమాదం. దానిని సహించొద్దు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా నేను వెళుతున్నా. దేశాన్ని సన్మార్గంలో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతాను. చివరి రక్తపు బొట్టు వరకూ కృషి చేస్తా. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలి.

  - సీఎం కేసీఆర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని