Covaxin: భారత్‌ బయోటెక్‌, కొవాగ్జిన్‌పై కథనాలను తొలగించండి

భారత్‌ బయోటెక్‌, కొవాగ్జిన్‌ టీకాపై ప్రచురించిన 14 కథనాలను నోటీసులు అందిన 48 గంటల్లో తొలగించాలని ది వైర్‌ వెబ్‌సైట్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీచేసింది. భవిష్యత్తులోనూ భారత్‌ బయోటెక్‌ కంపెనీ, డైరెక్టర్లు,

Updated : 24 Feb 2022 07:32 IST

ది వైర్‌ వెబ్‌సైట్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌, కొవాగ్జిన్‌ టీకాపై ప్రచురించిన 14 కథనాలను నోటీసులు అందిన 48 గంటల్లో తొలగించాలని ది వైర్‌ వెబ్‌సైట్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు ఇంజంక్షన్‌ ఉత్తర్వులు జారీచేసింది. భవిష్యత్తులోనూ భారత్‌ బయోటెక్‌ కంపెనీ, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు ఉత్పత్తుల పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి కథనాలనూ ప్రచురించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

తమ కంపెనీతోపాటు తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌పై ది వైర్‌ వెబ్‌సైట్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా రాసిన కథనాలను తొలగించేలా ఆదేశించాలని, భవిష్యత్తులోనూ తమపై తప్పుడు కథనాలు ప్రచురించకుండా నియంత్రించాలని భారత్‌ బయోటెక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ది వైర్‌ వెబ్‌సైట్‌ దురుద్దేశాలతో కంపెనీ ఉత్పత్తులపై కథనాలు రాసింది. గతంలో పిటిషనర్‌ కంపెనీ టీబీ, చికున్‌గన్యా, టైఫాయిడ్‌ తదితరాలకు టీకాలు ఉత్పత్తి చేసి జాతీయ అవార్డులు పొందింది. ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ప్రభుత్వం ఈ కంపెనీకే అనుమతించింది. వైర్‌ రాసిన రాతల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించడానికి వెనుకంజవేసే ప్రమాదం ఉంది’’ అని తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఆయా కథనాలను తొలగించాలని, భవిష్యత్తులో రాయకూడదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన వైర్‌కు, వ్యవస్థాపక ఎడిటర్లు సిద్ధార్థ్‌ వరదరాజన్‌, సిద్ధార్థ్‌ భాటియా తదితరులకు నోటీసులు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని