జీవశాస్త్రాల రంగానికి తెలంగాణ దిక్సూచి

భారత్‌లోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రాల రంగంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. గత ఏడాది కాలంలో తెలంగాణలో ఈ రంగం 200 శాతం అభివృద్ధి సాధించిందని, 215 పరిశ్రమలతో రూ.6,400 కోట్ల పెట్టుబడులను సమీకరించిందని వెల్లడించారు.

Updated : 25 Feb 2022 08:54 IST

ఏడాది కాలంలో 200 శాతం అభివృద్ధి
  215 కొత్త పరిశ్రమలు, రూ.6,400 కోట్ల పెట్టుబడులు
  కరోనా దేశీయ టీకాల్లో మూడింటిలో రెండు ఇక్కడే తయారీ
  తెలంగాణ ప్రోత్సాహం.. కేంద్రం పరిశ్రమలకు సహకరించాలి
  బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ప్రారంభోపన్యాసంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రాల రంగంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. గత ఏడాది కాలంలో తెలంగాణలో ఈ రంగం 200 శాతం అభివృద్ధి సాధించిందని, 215 పరిశ్రమలతో రూ.6,400 కోట్ల పెట్టుబడులను సమీకరించిందని వెల్లడించారు. 34 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయన్నారు. హైదరాబాద్‌ వేదికగా బయో ఆసియా 19వ అంతర్జాతీయ సదస్సును కేటీఆర్‌ గురువారం దృశ్యమాధ్యమంలో ప్రారంభించి ప్రసంగించారు. ఏటా బయో ఆసియా సదస్సులో ఇచ్చే జినోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని ఈసారి అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పిరల్‌మ్యాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధిపతి ప్రొఫెసర్‌ డ్రూ వైస్మాన్‌కు మంత్రి సమర్పించారు. తర్వాత  వైస్మాన్‌తో అపోలో ఆసుపత్రుల ఎండీ సంగీతారెడ్డి చర్చాగోష్ఠి నిర్వహించారు. మొత్తం నాలుగు అంశాలపై గోష్ఠులు జరిగాయి. సాయంత్రం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన చర్చాకార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

తొలిరోజు బయో ఆసియా సదస్సును మూడున్నర లక్షల మందికిపైగా దృశ్య మాధ్యమంలో తిలకించారు. ప్రారంభోపన్యాసంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు కొవిడ్‌ టీకాల్లో రెండు (కొవాగ్జిన్‌, కార్బెవ్యాక్స్‌) హైదరాబాద్‌కు చెందినవే కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ‘‘జీవశాస్త్రాల రంగానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత అభ్యున్నతిని సాధిస్తుంది. భారతీయ కంపెనీలు.. జనరిక్‌  ఔషధాలు, సమ్మిళిత జనరిక్స్‌, బయోసిమిలర్స్‌, బయోలాజిక్స్‌, సెల్‌, జీన్‌ థెరపీ, క్లినికల్‌ పరిశోధన వంటి రంగాల్లో మరింత బలపడాలి. ప్రపంచస్థాయిలో నిలిచేందుకు భారత సంస్థలు పోటీ పడాలి. వ్యాల్యూ చైన్‌ వృద్ధికి సంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పని చేయాలి. జీవశాస్త్రాలు, ఔషధరంగాలకు తెలంగాణలో చక్కటి అనుకూల వాతావరణం ఉంది. జీనోమ్‌వ్యాలీ వెన్నెముకగా నిలుస్తోంది. కొత్తగా ప్రారంభమయ్యేవే గాక ప్రస్తుతం ఉన్న ప్రతీ సంస్థ విస్తరణ చేపట్టడం రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై నమ్మకానికి నిదర్శనం. వైద్యపరికరాల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మరో ఆరు నెలల్లో ఏడు కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే  50కి పైగా సంస్థలు వైద్య పరికరాల తయారీ, పరిశోధన అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. వీటి ద్వారా 7వేల మందికి ఉపాధి కలిగింది. త్వరలో మరికొన్ని సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తాయి.  

బయో ఆసియా సదస్సుతో రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచానికి ఎనలేని మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర విధానాలు, మౌలిక వసతులు, సాధించిన ప్రగతిని ప్రపంచానికి తెలియజేసేందుకు సదస్సు ఓ అద్భుత వేదిక. సదస్సు సూచనల మేరకు ఔషధ, జీవశాస్త్రాల పురోగతికి ప్రభుత్వపరంగా చర్యలు చేపడతాం. గత ఏడాది సదస్సు స్ఫూర్తితో కరోనాను పారదోలేందుకు టీకాలు వృద్ధి చెందుతున్నాయి. తాజా సదస్సులో వచ్చే విలువైన సూచనలతో మరింత ముందుకెళ్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.  కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీకర్‌రెడ్డి, నొవార్టిస్‌ ప్రపంచ విభాగాధిపతి నవీన్‌ గుల్లపల్లి, అరజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ మన్ని కంటిపూడి, లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో సత్యనారాయణ చావా, ఎంఎస్‌ఎన్‌ వ్యవస్థాపకుడు ఎంఎస్‌ఎన్‌రెడ్డి, సింజైన్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మల్లేశ్‌ బల్గట్‌, సాయి లైఫ్‌సైన్సెస్‌ సీఈవో, ఎండీ కృష్ణ కనుమూరి, పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


వ్యాధి నిర్ధారణ తీరు మారాలి

అధునాతన సాంకేతిక విధానాలు అందిపుచ్చుకోవాలి
  కేటీఆర్‌తో చర్చా గోష్ఠిలో బిల్‌గేట్స్‌
  కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ కృషి భేష్‌ అని ప్రశంస
  హైదరాబాద్‌కు రావాలని కోరిన మంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాధి నిర్ధారణలో అధునాతన సాంకేతిక విధానాలు రావాలని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. సాంకేతికత సాయంతో ఆరోగ్య సేవలు సులభమవుతాయని,  ప్రతీదానికి రోగి ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో భాగంగా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రయోక్తగా ఆయనతో చర్చాగోష్ఠి నిర్వహించారు. కొవిడ్‌ మహమ్మారితో గత రెండేళ్ల ప్రపంచ అనుభవాలు, ఆరోగ్య పరిరక్షణలో కొత్త పోకడలు, జీవశాస్త్రాల రంగ భవిష్యత్తు, సాంకేతికత., వంటి అంశాలపై చర్చించారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? కరోనా లాంటి వాటిని నివారించేందుకు  ఇంకా ఏం చర్యలు అవసరం అని కేటీఆర్‌ అడిగిన ప్రశ్నలకు బిల్‌గేట్స్‌ సమాధానమిచ్చారు.

‘‘కరోనా నివారణకు భారత్‌ విశేష కృషి చేసింది. టీకాల తయారీ, పంపిణీపై అత్యంత వేగంగా స్పందించింది. వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌ ఔషధ సంస్థలు కీలకపాత్ర పోషించాయి. కరోనా టీకాలతో పాటు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి వచ్చింది. క్యాన్సర్‌, గుండె జబ్బుల కన్నా సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రమాదకరం. ముఖ్యంగా భారత్‌లాంటి దేశాలకు ఇలాంటి వ్యాధులు పెనుసవాలుగా మారాయి. అవి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తులో కరోనా వంటి అనేక వైరస్‌లు దాడి చేసే అవకాశం ఉంది. మానవాళి అప్రమత్తంగా ఉండాలి. 

ఆది నుంచి భారత్‌... గేట్స్‌ ఫౌండేషన్‌ వంటి ప్రపంచ భాగస్వాములతో కలిసి గొప్ప టీకాలను అభివృద్ధిచేయడంతో పాటు పంపిణీ చేయడం వల్ల లభ్యత బాగుంది. కరోనా సమయంలోనూ ఇదే వ్యూహం పనిచేసింది. భారత్‌లో కరోనా టీకాల ధరలు అందరికీ అందుబాటులో ఉండడం శుభ పరిణామం. రాత్రికి రాత్రి ఏదీ మనం తయారు చేయలేం. సమయం పడుతుంది.. కానీ కొత్త సాంకేతికతను వాడుకుంటూ వేగంగా మందులు తయారు చేయాల్సిన అవసరం ఉంది. నిమోనియా, టైఫాయిడ్‌లపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనాతో పాటు ఇతర వైరస్‌లపై పోరుకు మా ఫౌండేషన్‌ కృషి చేస్తోంది. వచ్చే పదేళ్లలో పిల్లల్లో పోషకాహార లోపాల నివారణ, హెచ్‌ఐవీ నియంత్రణపై దృష్టి సారిస్తుంది. 

పుస్తకం రాస్తున్నా: భవిష్యత్తులో కరోనా వంటి వాటిని ఎదుర్కోడానికి డయాగ్నస్టిక్స్‌, థెరపిటిక్స్‌ అభివృద్ధి చెందాలి. పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాలి. భవిష్యత్తులో కొవిడ్‌ వంటి వాటిని ఎదుర్కోవడం (ఫ్యూచర్‌ పాండమిక్‌ రెడీనెస్‌)పై పుస్తకం రాస్తున్నా. ఇప్పటికే వాతావరణ మార్పులపై రాశా. ఇది నా రెండో పుస్తకం’’ అని గేట్స్‌ తెలిపారు.  

ఇది సరికొత్త హైదరాబాద్‌: కేటీఆర్‌ 

‘ఔషధాల తయారీ నిరంతర ప్రక్రియ. సవాళ్లతో కూడుకున్నది. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని కేటీఆర్‌ చెప్పారు. గతంలో బిల్‌గేట్స్‌ హైదరాబాద్‌ పర్యటనను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. తనకు అప్పటి పర్యటన మంచి అనుభూతిని ఇచ్చిందని బిల్‌గేట్స్‌ స్పందించారు. ‘‘గతంలో మీరు వచ్చినప్పుడు హైదరాబాద్‌ వేరు.. ఇప్పుడు వేరు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నగరం ప్రపంచ ఔషధ కేంద్రంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధనగరిని త్వరలో ప్రారంభిస్తాం. మరోసారి హైదరాబాద్‌ను సందర్శించండి. నవీన, అభివృద్ధి చెందిన నగరం మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.

 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts