Viveka Murder Case: నేరాన్ని నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తారన్నారు

కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి,

Updated : 27 Feb 2022 10:48 IST

దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఈ విషయం నాతో చెప్పారు
అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించానన్నారు
సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-కడప: కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు రూ.10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారని వెల్లడించారు. పులివెందుల వాసి అయిన గంగాధర్‌రెడ్డి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉండేవారు. గతేడాది అక్టోబరు 2న సీబీఐ అధికారుల ఎదుట ఆయన  వాంగ్మూలం ఇచ్చారు. ‘‘అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబానికి వివేకాతో తీవ్ర శత్రుత్వం ఉంది. వివేకా అనుచరులు అవినాష్‌రెడ్డిని, భాస్కర్‌రెడ్డిని, వారి కుటుంబాన్ని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సరిగా పట్టించుకునేవారు కాదు. అందుకే వారంతా వివేకాను అంతం చేయాలనుకునేవారు. 2019 ఆగస్టు చివరి వారంలో శివశంకర్‌రెడ్డి నాకు వాట్సప్‌ కాల్‌ చేశారు. అత్యవసరంగా మాట్లాడాలని, పులివెందులకు 8 కి.మీ. దూరంలోని గోదాము వద్దకు రావాలని పిలిస్తే వెళ్లాను. అవినాష్‌రెడ్డి పీఏ రమణారెడ్డి నా ఫోన్‌ తీసుకుని, మొదట అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అక్కడ ఉన్న శివశంకర్‌రెడ్డి నా బాగోగులు తెలుసుకోవడంతో పాటు ఏం చేస్తున్నావని అడిగారు. ఏమీ చేయట్లేదని, తిరుపతిలో నా భార్యకు ఉద్యోగం ఇప్పించాలని అడిగాను. ‘నీ భార్య ఉద్యోగం గురించి ఎందుకు అంతలా ఆందోళన చెందుతావు.. నీకు మంచి ఆఫర్‌ ఇస్తాను’ అని చెప్పారు. ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకో. మరో ఇద్దరు, ముగ్గురితో కలిసి నువ్వే హత్య చేసినట్లు సిట్‌ అధికారుల ఎదుట అంగీకరించు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి ప్రణాళిక వేసి, కొత్తవాళ్లతో వివేకాను హత్య చేయించా. హత్య చేసినవారిని పోలీసులు విచారిస్తే... వారు నిజం చెప్పేస్తే నేను, మిగతా వారు ఇబ్బందుల్లో పడతాం’ అని శివశంకర్‌రెడ్డి చెప్పారు. ఇది సీఎం జగన్‌ సొంత బాబాయ్‌ హత్య విషయమని.. తేడా వస్తే తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని నేను తిరస్కరించాను’’ అని గంగాధర్‌రెడ్డి తన వాంగ్మూలంలో వివరించారు.

వివేకా హత్యలో తండ్రీకుమారుల ప్రమేయం: ఆర్‌.వెంకటరమణ

‘వివేకా హత్యలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డిల ప్రమేయం ఉందని కడప, పులివెందుల నియోజకవర్గాల్లోని చాలామందికి తెలుసు. కానీ వారి అధికారబలాన్ని చూసి భయంతో ఎవరూ నోరు విప్పట్లేదు’ అని పులివెందులకు చెందిన ఆర్‌.వెంకటరమణ గతేడాది డిసెంబరు 1న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.  నేను గతంలో కడపలో సీబీఐ అధికారులను కలిసిన విషయాన్ని శివశంకర్‌రెడ్డి తెలుసుకున్నారు. ‘సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో హత్య జరిగిన ప్రదేశంలో నేను ఉన్నట్టుగా చెప్పావా?’ అని అడిగారు. ఆధారాల ధ్వంసం గురించి వారికి చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు’ అని వెంకటరమణ తన వాంగ్మూలంలో చెప్పారు.

వారికి వివేకాతో శత్రుత్వం: జగదీశ్వర్‌రెడ్డి

వివేకానందరెడ్డికి వైకాపాలో పెరుగుతున్న ఆదరణ చూసి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వారి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఆయనతో శత్రుత్వం పెంచుకున్నారని పులివెందుల వాసి నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. కల్లూరు గంగాధర్‌రెడ్డి స్నేహితుడైన జగదీశ్వర్‌రెడ్డి గతేడాది డిసెంబరు 18న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని