గొప్పగా ఆలోచించాలి.. ప్రపంచంతో పోటీపడాలి

మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలను, అదనంగా

Updated : 09 Mar 2022 05:54 IST

మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలు అతివలకే ఇస్తున్నామని వెల్లడి

ఈనాడు, సంగారెడ్డి: మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలను, అదనంగా 10 శాతం పెట్టుబడి రాయితీనీ వారికి అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పగా ఆలోచించాలని.. అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంతో పోటీపడాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్కును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు ఉజ్వలా సింఘానియా, హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షురాలు ఉమా చిగురుపాటి, ఎఫ్‌ఎల్‌ఓ ప్రతినిధులతో కలిసి  పార్కు ప్రాంగణంలోని పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 18 వేల అనుమతులు ఇచ్చామన్నారు. తద్వారా 32 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.6 మిలియన్‌ ఉద్యోగాలను సృష్టించామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో 100 ఎకరాలైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బల్క్‌డ్రగ్‌, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ దేశానికే రాజధానిగా మారిందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో మన నగరం ప్రపంచ రాజధాని అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా పారిశ్రామికవేత్తలు ఆహారశుద్ధి, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో సరికొత్త ఉత్పత్తులను రూపొందించేలా చొరవ చూపాలన్నారు.

‘ఉద్యామిక’తో మహిళా పారిశ్రామికవేత్తలకు దన్ను 

మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఉండేలా దేశంలోనే తొలిసారిగా ‘ఉద్యామిక’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టనున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. కార్పస్‌ ఫండ్‌ను అందుబాటులోకి తేవడం, వారి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామన్నారు. 2018లో ప్రారంభించిన వి-హబ్‌ ద్వారా 2,194 మంది మహిళలు అంకుర సంస్థలను నెలకొల్పారని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూ.66.3 కోట్ల నిధులు సమకూర్చినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ అధ్యక్షుడు గ్యాదరి బాలమల్లు, సీఈవో మధుసూదన్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


అతివలకు వరం

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మహిళాపారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్‌ ఎఫ్‌ఎల్‌ఓ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పగా ఆలోచించాలని.. అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంతో పోటీపడాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని