Telangana: సస్పెన్షన్‌పై న్యాయస్థానానికి హైకోర్టును ఆశ్రయించిన భాజపా ఎమ్మెల్యేలు

బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి తమను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌లు హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. సస్పెన్షన్‌

Updated : 09 Mar 2022 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి తమను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌లు హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. సస్పెన్షన్‌ రాజ్యాంగ, చట్ట, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దాన్ని రద్దు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా సమావేశాలకు హాజరయ్యేందుకు తమను అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేయాలని తాము నిర్ణయించుకుని.. నల్ల శాలువాలతో సభకు హాజరైనట్లు చెప్పారు. తాము లేవనెత్తే అంశాన్ని బడ్జెట్‌ ప్రసంగానికి ముందే తేల్చాల్సి ఉందని కోరామన్నారు. అయితే, స్పీకర్‌ తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఆర్థికమంత్రికి చెప్పారన్నారు. తాము నిలబడే స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని.. కొద్దిసేపయ్యాక రాజాసింగ్‌ నెమ్మదిగా పోడియం వైపు నడక ప్రారంభించారని తెలిపారు. పోడియం వద్దకు వెళ్లడం సభలో సర్వసాధారణమేనని వివరించారు. ప్రారంభించిన పావుగంటకు మంత్రి బడ్జెట్‌ ప్రసంగాన్ని నిలిపివేశారని.. అదే సమయంలో మరో మంత్రి తలసాని అప్పటికే సిద్ధంగా ఉంచిన పేపరును చదువుతూ సస్పెన్షన్‌కు ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఆ వెంటనే.. స్పీకర్‌ సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మౌఖిక ఓటింగ్‌ ద్వారా ఆమోదించారన్నారు. మార్షల్స్‌ ద్వారా తమను బయటికి పంపారని వెల్లడించారు. సభ బయట నిరసన వ్యక్తం చేయగా పోలీసులు అనుచితంగా వ్యవహరించారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచన ఉందన్నారు. తమపై సస్పెన్షన్‌ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని.. అంతా ఒకటి రెండు నిమిషాల్లో పూర్తయిందని చెప్పారు. ఈ చర్యతో తమ హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రస్తావించేఅవకాశం లేకుండా పోతోందన్నారు. సస్పెన్షన్‌ తీర్మాన ప్రతితోపాటు వీడియో రికార్డులను సమర్పించేలా ఆదేశించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా అసెంబ్లీ, న్యాయశాఖ, సచివాలయ కార్యదర్శులను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు