Telangana News: ఉద్యోగాల ఉగాది

నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలే ప్రాధాన్యంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పటికే నీళ్లు సాధించుకున్నాం. ఇంకా పోరాటం చేస్తున్నాం.. చేస్తాం కూడా. మన నిధులను మన

Updated : 10 Mar 2022 10:12 IST

91,142 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

80,039 కొత్త నియామకాలు

95 శాతం స్థానిక రిజర్వేషన్లు

11,103 మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ 

ఆంధ్రాతో పేచీ తెగాక మరో   40 వేల పోస్టులు

ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి పదేళ్ల పెంపు

ప్రతి ఏడాదీ ఉద్యోగ భర్తీ క్యాలెండర్‌

సత్వరమే నోటిఫికేషన్లు

శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశాలే ప్రాధాన్యంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పటికే నీళ్లు సాధించుకున్నాం. ఇంకా పోరాటం చేస్తున్నాం.. చేస్తాం కూడా. మన నిధులను మన రాష్ట్రంలోనే ఖర్చు చేసుకుంటున్నాం. కొంచెం ఆలస్యమైనా ఇప్పుడు నియామకాలపై దృష్టి పెట్టాం. స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి.

-అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

తెలుగు సంవత్సరాది ఉగాది ఏటా ఎన్నో కొత్త ఆశలతో మన ముందుకొస్తుంది. తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఈ ఏడు  ముందే వచ్చింది. కలల కొలువులను మోసుకొచ్చింది. ముందుగా ప్రకటించినట్టుగానే సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ఒకేసారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు బుధవారం శాసనసభలో ప్రకటించారు. వీటిలో 80,039 నియామకాలు చేపడతామని, 11,103 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్పారు.  జిల్లా స్థాయిలో 39,829, జోనల్‌వి 18,866, బహుళజోనల్‌వి 13,170, సచివాలయం, శాఖాధిపతి కార్యాలయాలు, విశ్వవిద్యాయాలకు చెందిన 8,174 పోస్టులను భర్తీచేస్తామన్నారు. ఆంధ్రాతో పేచీ తెగాక మరో 40 వేల నియామకాలుంటాయన్నారు. ప్రస్తుత ఖాళీలు కాక ఇప్పటికే మొత్తం 1,56,254 పోస్టుల భర్తీకి ప్రకటనలిచ్చి 1,33,942 భర్తీ చేశామని, మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతోందని సీఎం వివరించారు. పోలీసు, ఇతర యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ఉద్యోగాల అర్హతకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచినట్లు తెలిపారు. ఈ మేరకు ఓసీలకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు,  దివ్యాంగులకు 54 ఏళ్లుగా చేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి కొత్త జోనల్‌ విధానంలో భర్తీ కానున్న కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి కేడర్‌ దాకా అంటే అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే లభిస్తాయన్నారు. మరో అయిదు శాతం ఓపెన్‌ కోటా అని, దానికి అందరూ పోటీ పడవచ్చని, అందులోనూ ఎక్కువ శాతం ఉద్యోగాలు తెలంగాణవాళ్లే పొందే అవకాశం ఉందన్నారు. స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్‌, బహుళ (మల్టీ) జోన్లలో 95% రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లలోని 5% ఓపెన్‌ కోటా ఉద్యోగాలకూ పోటీ పడవచ్చని తెలిపారు. కొత్తగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ.7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని, అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందన్నారు. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోందని, ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవని తెలిపారు.

కొత్త జోనల్‌ విధానంపై కేంద్రం అనవసర తాత్సారం

నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్ఠమైన వ్యవస్థను, విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలు, విధానాలను రూపొందించుకున్నాం. వివిధ శాఖలను పునర్‌వ్యవస్థీకరించి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం. కేంద్రం అనవసర తాత్సారం చేసింది. దీంతో నేనే స్వయంగా అనేక సార్లు దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి దీనికున్న ప్రాధాన్యాన్ని వివరించా. ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని దిల్లీలోనే పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 2021లో తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా స్థానిక కేడర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయ్యింది. పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత.. ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్ల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబరులో ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రతి జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ క్యాడర్లలో నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది. నోటిఫికేషన్ల జారీకి మార్గం సుగమమైంది.

ప్రభుత్వరంగ సంస్థలపై కేంద్ర జాప్యం, ఏపీ అర్థరహిత వివాదాలు

కొత్త రాష్ట్ర ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతో కూడుకున్న  ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలే గాక ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య, ఇతర సంస్థలకు చెందిన ఆస్తుల, ఉద్యోగుల విభజన కూడా ముడిపడి ఉంది. ఈ ప్రక్రియకు కేంద్రప్రభుత్వ ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సృష్టిస్తున్న అర్థరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి.. దీనికి తోడు కేంద్ర బాధ్యతారాహిత్యం, నిర్లిప్తత వల్ల కార్పొరేషన్ల విభజన ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏపీ గొంతెమ్మ కోర్కెలు కోరుతోంది. ఉస్మానియా భూముల్లో ఆర్టీసీ ఆసుపత్రి నడుస్తుంటే అందులోనూ వాటా అడుగుతోంది. గండిపేట చెరువు భూముల్లోనూ వాటా కోరుతోంది. ఏపీ వల్ల ప్రభుత్వ రంగ సంస్థల విభజన పూర్తికావడం లేదు. ఆ పంచాయితీ తేలితే వాటిల్లో మరో 40 వేల ఉద్యోగ నియామకాలు చేపడతాం. ఇప్పుడున్న కార్పొరేషన్లలో కొన్ని మూసేస్తాం, మరికొన్నింటిని కొత్తగా ప్రారంభిస్తాం.త్వరలోనే వివాదాలన్నీ కొలిక్కి వస్తాయనుకుంటున్నాం. దాని ద్వారా మరిన్ని పోస్టులతో నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


95 శాతం స్థానిక రిజర్వేషన్లున్న ఏకైక రాష్ట్రం

‘‘ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మక విజయం. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్‌ సాధించిన ఒకే ఒక రాష్ట్రం మనదే. ప్రభుత్వ కృషి వల్ల, ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా ఈ రిజర్వేషన్‌ అమలవుతుంది. అర్ధశతాబ్దం పాటు ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయ పరంపరను రాష్ట్ర ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి గర్వపడుతున్నా. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అరవై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే స్థానిక రిజర్వేషన్‌ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు వర్తిస్తాయి. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్‌ పోస్టులకు.. తమ జోన్‌లోని జోనల్‌ పోస్టులకూ అర్హత కలిగి ఉంటారు. నిరుద్యోగ యువతకు గతంలో కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. రెండు బహుళ జోన్లు, ఏడు జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఇక సిబ్బంది సమస్య ఉండదు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్‌ శాతం పెరగటమే కాకుండా స్థానిక రిజర్వేషన్‌ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, సీటీవో, ఆర్టీవో, డీ…ఎస్పీ, జిల్లా రిజిస్ట్రార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ తదితర గ్రూప్‌ 1 ఉద్యోగాలకు లోకల్‌ రిజర్వేషన్‌ వర్తించేది కాదు. ఇప్పుడు వీటన్నింటిని కూడా లోకల్‌ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకొచ్చాం.


ప్రభుత్వ న్యాయపోరాట ఫలితం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు ఒప్పంద ఉద్యోగులు వారసత్వంగా లభించారు. ప్రభుత్వరంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులుండటం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్‌ 2 నాటికి ఒప్పంద ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని రాజకీయ పార్టీలు సంకుచితత్వంతో కోర్టులో కేసులు వేశాయి. హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్‌ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుంది.


కేడర్‌ వారీగా పోస్టుల వివరాలు...

జిల్లా (లోకల్‌) : జూనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4, కానిస్టేబుల్‌,  టైపిస్ట్‌, జూనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ స్టెనో, డ్రైవర్‌, రికార్డు అసిస్టెంటు, ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌

జోనల్‌ :  ఎంవీఐ, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌రిజిస్ట్రార్లు గ్రేడ్‌-2, సీనియర్‌ అసిస్టెంటు, నాయబ్‌ తహసీల్దార్‌ (డిప్యూటీ తహసీల్దార్‌), సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌

బహుళ జోన్‌ : ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్‌, ఆర్టీవో, సీటీవో, డీపీవో, అసిస్టెంట్‌ సెక్రటరీ, పురపాలక కమిషనర్‌ (గ్రేడ్‌1), డివిజనల్‌ అగ్నిమాపక అధికారి, సూపరింటెండెంట్‌, తహసీల్దార్‌,  జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌ -1, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ), ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని