CM KCR: జీవో 111ను రద్దు చేస్తాం

ఆహార్యంతో ప్రభుత్వాలకు ఏం సంబంధం..? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఏంటి..? హిజాబ్‌ పేరుతో గొడవపెట్టే సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాటితో దేశంలో విపరీత పరిణామాలు

Updated : 16 Mar 2022 05:13 IST

నిపుణుల కమిటీ నివేదిక రాగానే దానిని ఎత్తేస్తాం

ఉక్రెయిన్‌ విద్యార్థులను ఇక్కడ చదివిస్తాం.. ఖర్చు భరిస్తాం

సెర్ప్‌, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయి వేతనాలు

ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మళ్లీ ఉద్యోగాలు

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.3 వేలకు పెంపు

వీఆర్‌ఏలను లష్కర్లుగా నియమిస్తాం

వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం

ఉర్దూలోనూ పోటీపరీక్షలు

శాసనసభలో సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తోందని ధ్వజం

ఆహార్యంతో ప్రభుత్వాలకు ఏం సంబంధం..? ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఏంటి..? హిజాబ్‌ పేరుతో గొడవపెట్టే సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వాటితో దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాబోతోంది.

రాష్ట్రాల సమాఖ్య అనేది రాజ్యాంగంలో కీలకం. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తోంది. కేంద్రం విధానం విచిత్రంగా ఉంది. బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రం అనే విధానాన్ని అవలంబిస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య. ఈ పెడధోరణి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీస్తుంది.  కేంద్రం తీరుపై అన్ని శాసనసభలు చర్చించాలి.

-శాసనసభలో సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: నిపుణుల కమిటీ నివేదిక రాగానే జీవో 111ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బడ్జెట్‌ పద్దులపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన నాలుగురోజుల విశ్రాంతి అనంతరం శాసనసభకు హాజరై సుదీర్ఘంగా మాట్లాడారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధవర్గాలకు పలు వరాలు ప్రకటించారు. కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘‘గతంలో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి హైదరాబాద్‌ నగరానికి మంచినీళ్లు వచ్చేవి. అవి కలుషితం కాకుండా ఉండటానికి 7 మండలాల్లోని 83 గ్రామాల్లో భూముల వినియోగంపై అంక్షలు పెడుతూ జీవో 111  తెచ్చారు. కానీ వాటి నుంచి ఇప్పుడు మంచినీరు నగరానికి అవసరం లేదు. మల్లన్నసాగర్‌ నుంచి గ్రావిటీ ద్వారా నీరు నగరానికి వస్తుంది. వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. ఈ నేపథ్యంలో జీవో 111  అర్థ రహితం. ఒకేసారి దానిని రద్దుచేస్తే ఇబ్బందులు రాకుండా అక్కడ గ్రీన్‌జోన్లు ఏర్పాటుచేసేలా మున్సిపల్‌ శాఖ చూడాలి. ఈ జీవో రద్దుపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశాం. నివేదిక రాగానే జీవోను ఎత్తేస్తాం.

ఉక్రెయిన్‌లో 20 వేల పైచిలుకు విద్యార్థులు చిక్కుకున్నారు. తెలంగాణ నుంచే వారిలో 740 మంది ఉంటే వీరిలో 710 మంది ఎంబీబీఎస్‌ చదవడానికే వెళ్లారు. ఇక్కడ ఎంబీబీఎస్‌ చదవాలంటే రూ.కోటికిపైగా ఖర్చవుతున్నందున అంత భరించలేక పలువురు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకే ఉక్రెయిన్‌లో చదవడానికి వెళుతున్నారు. యుద్ధం వల్ల విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్‌కు పోయే పరిస్థితి లేదు. వారి చదువు ఇక్కడ కొనసాగించే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి రాస్తాం. వారి చదువుకు ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. యుద్ధం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతుంటే కొందరు కేంద్రమంత్రులు వారిని విమర్శిస్తూ ‘తిన్నది అరగక అక్కడికి ఎందుకు పోయారు’ అని మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల గురించి మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా ? దీనిపై మేం ఏమైనా మాట్లాడితే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు.

* సెర్ప్‌, మెప్మాల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం.

* ఉపాధి హామీ పథకం విభాగంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారు గతంలో సమ్మె చేశారు. భ్రమలకు పోయి సమ్మె చేయవద్దని అప్పుడే చెప్పాం. అయినా వినకుండా సమ్మె చేశారు. వాళ్ల మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? వాళ్లందరినీ మళ్లీ ఉద్యోగాల్లో చేర్చుకుంటాం.
* ఉద్యోగాలకు పోటీ పరీక్షలన్నింటినీ ఉర్దూ భాషలో కూడా నిర్వహిస్తాం.
* పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌లో మైనార్టీ వర్గానికి చెందినవారిని సభ్యుడిగా నియమిస్తాం.
* తెలంగాణ ఏర్పడినప్పుడు 3 వైద్య కళాశాలలుంటే ఇప్పుడు 33కి పెంచుతున్నాం. ప్రతీ కాలేజీలో నర్సింగ్‌ కాలేజీ కూడా ఏర్పాటుచేస్తాం
* వరంగల్‌, మంథని, ఖమ్మం, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆ రైతుల వివరాలను వ్యవసాయశాఖ సేకరించి పంపితే పరిహారం ఇస్తాం.
* పాతబస్తీలో రోడ్లు వెడల్పు చేయడానికి మరో రూ.200 కోట్లు ఇస్తాం.
* మధ్యాహ్న భోజన పథకం విభాగంలో పనిచేస్తున్నవారికి ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. దానిని రూ.3 వేలకు పెంచుతాం.
* గ్రామ రెవెన్యూ సహాయకులను నీటిపారుదలశాఖలో లష్కర్లుగా నియమిస్తాం.
* సాదాబైనామాల వారి భూముల వివరాలను ధరణిలో నమోదుకు చర్యలు తీసుకుంటాం.
* నీటిపారుదల, వైద్యశాఖల్లో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులిస్తాం.
* ఐఏఎస్‌ అధికారుల కమిటీ నివేదిక అందగానే మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాల్‌లోని ఆలయభూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
* ఎమ్మెల్యేలు, అధికారులు, విలేకరులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. అది తేలగానే వారికి స్థలాలిస్తాం.
* ఏపీ, తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి నదీ జలాలను ఇతర నదులతో అనుసంధానం చేసి జలాలను తరలించే అవకాశం లేదు. సీతారామసాగర్‌ పూర్తయితే ఖమ్మం జిల్లాల్లో పుష్కలంగా నీరు అందుతుంది.


డబుల్‌ ఇంజిన్‌ కాదు.. ట్రబుల్‌ ఇంజిన్‌

ప్రస్తుత మోదీ పాలనలో 5 లక్షల సంస్థలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు యూపీఏ హయాంలో 4.7 శాతముంటే ఇప్పుడు 7.11కి పెరిగింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ర్యాంకుల్లో భారత్‌ 93కి చేరింది. ఆత్మనిర్భర్‌ అన్నారు. దేశం ఆత్మనిబ్బరం కోల్పోయింది. మతపిచ్చి కార్చిచ్చులా దహించివేస్తుంది. ఇలాంటి కేంద్ర పాలన వల్ల దశాబ్దాల తరబడి ప్రగతికి కొనసాగిన కృషి కుప్పకూలుతుంది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ‘డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌’ అని కొందరు కొత్త నినాదంతో ప్రచారం చేస్తున్నారు.ప్రజలు అమాయకులు కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితి ఉంది. కానీ అది ట్రబుల్‌ ఇంజిన్‌ అని సభ్యులు అంటున్నారు. కేంద్రంలో, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా అనేక అంశాల్లో తెలంగాణకన్నా వెనుకబడి ఉంది.తలసరి ఆదాయంలో సిక్కిం తరవాత దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.


భట్టిని పార్లమెంట్‌కు పంపిద్దాం

ఎప్పుడూ మాపై విమర్శలు చేస్తారని భట్టి విక్రమార్కకు పేరుంది. కేంద్రప్రభుత్వం తీరుపై బాగా విమర్శలు చేస్తుంటే మా సభ్యులంతా ఆయన పార్లమెంట్‌లో మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు కేంద్రంపై కోపాన్ని శాసనసభలో చూపితే ఎలా అంటున్నారు. పార్లమెంట్‌కు వెళ్లి నిలదీయాలని కోరుతున్నారు. దిల్లీకి వెళ్లడం అంటే ప్రమోషనే. డిమోషన్‌ కాదు. తెలంగాణ అప్పుల్లో ఉందనే బెంగ భట్టి విక్రమార్కకు అవసరం లేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.


కేంద్రం పనితీరు దిగజారింది

కేంద్రం పనితీరు దిగజారిందని ఆ ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. నేటికి కేంద్రం రూ.152 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్‌లో 25శాతం మాత్రమే అప్పులు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. కేంద్రం అదే నీతిని పాటించాలి కదా? కానీ 58.5 శాతం అప్పు చేసింది. తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి వంటి అంశాల్లో కేంద్రం పనితీరు తెలంగాణ స్థాయిలో లేదు. అప్పుల్లో తెలంగాణాది దేశంలో 24వ స్థానం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అప్పుల వాయిదాలు ఎప్పటికప్పుడు పక్కాగా చెల్లిస్తున్నాం. ఆర్‌బీఐ నివేదికలే తెలంగాణ పథకాల్ని మెచ్చుకుంటున్నాయి. అవినీతిని అణచివేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. బడ్జెట్‌ బాగాలేకపోతే ప్రజలే తీర్పు ఇస్తారు. సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తారు. ఒక రాష్ట్రానికి కేటాయించిన తర్వాత అక్కడే పదవీవిరమణ పొందుతారు. వారు ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కొందరైతే ఆ రాష్ట్రంతో భావోద్వేగ బంధం ఏర్పర్చుకుంటారు. అలాంటి అధికారుల్ని ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటామని కేంద్రం కుట్ర చేస్తోంది. అఖిలభారత సర్వీస్‌ అధికారుల్ని అభద్రతకు లోనుచేస్తోంది. ఈ విషయంలో మీ గొంతు కోస్తామని రాష్ట్రాలనే అభిప్రాయం అడుగుతోంది.


బడ్జెట్‌ అనేది ప్రజాధనం. ఓట్లు, సీట్లకే పరిమితమైతే అరాచకం అవుతుంది. ఇటీవల కొందరు పిగ్మీలు దూరిపోయి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా చేస్తున్నారు. 2014లో యూపీఏ ప్రభుత్వంపై నిందలు మోపి భాజపా వచ్చింది. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు భాజపా పాలనలో దేశం పతనం అయింది. ఆనాడు 8 శాతంగా ఉన్న వృద్ధిరేటు నేడు ఆరుకి పడిపోయింది

-సీఎం కేసీఆర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు