Mallu Swarajyam: ఆమె మాటే తుపాకి తూటా!

తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వరాజ్యం అసెంబ్లీలో తనకు ఎదురైన ఘటనను తన జీవిత చరిత్రలో ఇలా వెల్లడించారు. ‘అప్పటి మా పార్టీకి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌తో కలిసి తొలిసారి అసెంబ్లీకి వెళ్లాను.

Updated : 20 Mar 2022 05:33 IST

సాయుధపోరాట కాలం నాటి ఝాన్సీ రాణి మల్లు స్వరాజ్యం
ఈనాడు- హైదరాబాద్‌, నల్గొండ

ముక్కుపచ్చలారని బాల్యంలోనూ.. తొంభయ్యో పడిలోనూ ఆమెది ఒకటే మాట. పీడితుల పక్షాన పోరాటం చేయడంలోనూ ఆమెది అదే బాట. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల్లో గెలిచి నిలిచిన మహిళా యోధురాలు. దొడ్డి కొమురయ్య, ఐలమ్మల సాక్షిగా సాయుధ పోరాటంలో గెరిల్లా అవతారమెత్తిన స్త్రీ మూర్తి ఆమె. ఆమె మాటే తుపాకి తూటా.. పాటలతో నిప్పు రగిలించిన కోయిల గొంతుక. స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అనేక దశల్లో తనదైన పాత్ర పోషించిన నిలువెత్తు ఉద్యమకారిణి. ఆమే మల్లు స్వరాజ్యం.  పదమూడేళ్లకే బందూకు పట్టి, పీడితుల పట్ల సానుభూతితో పిడికిలి బిగించి పోరాడి స్వాతంత్య్రోద్యమ కాలం నాటి యువతను ఉర్రూతలూగించిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఆ కాలంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీరాణి అని పిలుచుకునేవారు. చక్కని వాక్చాతుర్యం, హాస్య సంభాషణలతో ఆకట్టుకునే స్వరాజ్యం అంటే సహచరులకే కాదు, నాయకులకూ అభిమానం, భయం ఉండేవి. తన 92 ఏళ్ల జీవితంలో దాదాపు 80 ఏళ్లు ప్రజా జీవితంలోనే గడిపిన స్వరాజ్యం రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

బాలసంఘాలతో చైతన్యం

చిన్న నాటనే తండ్రిని కోల్పోయినా తల్లి చొక్కమ్మ ఆమెను తీర్చిదిద్దారు. స్వరాజ్యం కోసం ముంబయిలో సత్యాగ్రహ ఉద్యమం జరుగుతుండగా వరుసకు మేనమామయ్యే ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి వచ్చి ఆ వివరాలు చొక్కమ్మకు చెప్పాడు. దీంతో తన బిడ్డకు ఆమె స్వరాజ్యమని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్లే స్వాతంత్య్రోద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన నినాదమయ్యారు ఆమె. బాలలందరినీ చేరదీసి బాలసంఘం పెట్టారు. సోదరుడు భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి ఉద్యమానికి ఆకర్షితులవ్వగా ఆయన బాటనే నడిచారు ఆమె. ఏకంగా తుపాకీ పట్టి గెరిల్లా యుద్ధానికి దిగారు. సురవరం ప్రతాపరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వర్‌రావుల సమక్షంలో స్వరాజ్యం గెరిల్లా తంత్రాలను ఒంటబట్టించుకుని అడవుల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేశారు. దళకమాండర్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించి దళాలను పోలీసుల కళ్లబడకుండా తిప్పిన యోధురాలిగా పేరు తెచ్చుకున్నారు. స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేల నగదు ఇస్తామని 1940 ప్రాంతంలోనే నిజాం సర్కారు రివార్డు ప్రకటించింది. సాయుధ పోరాటంలో తనదైన శైలితో ఒకవైపు ప్రసంగాలు, మరోవైపు భూస్వాములపై దాడులు చేసి పీడితవర్గాల విముక్తికి పరిశ్రమించారు. సాయుధ పోరాటం విరమణ అనంతరం కూడా కమ్యునిస్టు సభల్లో తనదైన ముద్రను చాటారు.


అసెంబ్లీలోకి రానివ్వని బంట్రోతు

తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వరాజ్యం అసెంబ్లీలో తనకు ఎదురైన ఘటనను తన జీవిత చరిత్రలో ఇలా వెల్లడించారు. ‘అప్పటి మా పార్టీకి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌తో కలిసి తొలిసారి అసెంబ్లీకి వెళ్లాను. ఓంకార్‌ కొంచెం ముందుగా అసెంబ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నన్ను గేటు దగ్గర బంట్రోతు నిలిపివేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పినా నమ్మలేదు. ఓ ఉద్యమంలో పాల్గొని నేరుగా అసెంబ్లీకి వచ్చిన నా అవతారం చూసి నన్ను ఎమ్మెల్యే అనుకోవడం లేదతను. ఇంతలో ఓంకార్‌ వచ్చి నన్ను లోపలికి తీసుకుపోయాడు’ అని వివరించారామె. ‘నేను రూ.12 కంట్రోల్‌ చీర కట్టుకుని వచ్చిన. ఎమ్మెల్యే అంటే ఖద్దరు వేసుకుంటరు కదా అనే ఆలోచనలో బంట్రోతు ఉన్నడు’ అని ఆమె ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె 1985 నుంచి 2005 వరకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొన్నారు.   1993లో సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని