Yadadri: మహాయాగానికి శ్రీకారం

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వంలో కీలకమైన పంచకుండాత్మక మహాయాగ క్రతువు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. సప్తాహ్నిక దీక్షతో చేపట్టే ఈ

Updated : 23 Mar 2022 05:02 IST

యాదాద్రి బాలాలయంలో మొదలైన పంచకుండాత్మక యాగం

శాస్త్రోక్తంగా కొనసాగుతున్న జపహోమాదులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వంలో కీలకమైన పంచకుండాత్మక మహాయాగ క్రతువు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. సప్తాహ్నిక దీక్షతో చేపట్టే ఈ యాగానికి ప్రధానార్చకుల సమక్షంలో అగ్నిమథనం చేసి రుత్వికులు శ్రీకారం చుట్టారు. వేడుకల రెండో రోజైన మంగళవారం బాలాలయంలో ఈ సంప్రదాయ పర్వానికి ముందస్తుగా చతుస్థానార్చన నిర్వహించారు. అంతకుముందు ప్రధానాలయ ముఖ మండపంలో రుత్వికులు జప హోమాదులు చేపట్టారు. ప్రధానాలయంలో ప్రతిష్ఠించనున్న విగ్రహమూర్తులు, శ్రీసుదర్శన ఆళ్వారులకు నవకలశ స్నపనం, శాంతిహోమాన్ని పూజారులు చేపట్టారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు. ఉగ్రనారసింహుడిని శాంతింపజేసేందుకు మూల, మూర్తి మంత్ర జపాలను ఉదయం, రాత్రి వేళల్లో రెండు దఫాలుగా కొనసాగించారు. గర్భాలయంలో మూలవరులకు ప్రత్యేక ఆరాధనలు జరిపి నివేదన పర్వాలు చేపట్టారు. ఈ కైంకర్యాలతో సకల జనుల సంక్షేమంతో పాటు క్షేత్ర ప్రాశస్త్యం పెంపొందుతుందని.. ఇది సహస్ర కుండాత్మక యాగంతో సమానమని ప్రధాన పూజారి నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్య ‘ఈనాడు’కు వెల్లడించారు. బాలాలయంలో జరిగిన ఈ క్రతువులో కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు.

వసతుల కల్పనకు చర్యలు వేగిరం

ఈ నెల 28న స్వయంభువుల దర్శనాల ప్రారంభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ముఖ్యులందరూ హాజరుకానుండటంతో అన్ని శాఖల అధికారులు క్షేత్రంలోనే మకాం వేశారు. వీవీఐపీలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు సమకూరుస్తున్నారు. మరోవైపు పోలీసులు బందోబస్తు పెంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను కొండపైకి చేరవేయడంతోపాటు గమ్యస్థానాలకు చేర్చే రవాణా సదుపాయాలపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. భక్తులకు ప్రసాదం అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రాల పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

తూర్పు దిశలో శిలాఫలకం!

పునర్నిర్మితమైన ప్రధానాలయ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ఆలయ మాడవీధుల్లోని తూర్పు దిశలో రాజగోపురం, క్యూకాంప్లెక్స్‌ మధ్యలో నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్తపతులు, శిల్పులు, వాస్తు నిపుణులు, ఇంజినీర్ల పేర్లతో కూడిన మరో భారీ శిలాఫలకాన్ని పడమర దిశలో లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ఆలయాన్ని పూర్తిగా లైటింగ్‌ సెట్టింగ్స్‌తో అలకరించారు. బెంగళూరుకు చెందిన సంస్థ ప్రత్యేకంగా ఏడు రంగుల్లో ఆలయం చుట్టూ డిజిటల్‌ ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. దీంతో సుదూర ప్రాంతం నుంచి యాదాద్రి వివిధ రంగుల్లో కనువిందు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని