Telangana News: దిల్లీలో ధాన్యం మంటలు

ధాన్యం సేకరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గురువారం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, అజయ్‌, ప్రశాంత్‌రెడ్డిలు సమావేశమైనప్పటికీ విషయం కొలిక్కిరాలేదు. పైగా రాజకీయంగా మంటలు రాజేసింది. తెలంగాణలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని గోయల్‌ ఆరోపించగా..

Updated : 25 Mar 2022 12:49 IST

కొలిక్కిరాని ధాన్యం సేకరణ వ్యవహారం

పరస్పరం ఆరోపణలకు దిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ధాన్యం సేకరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. గురువారం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, అజయ్‌, ప్రశాంత్‌రెడ్డిలు సమావేశమైనప్పటికీ విషయం కొలిక్కిరాలేదు. పైగా రాజకీయంగా మంటలు రాజేసింది. తెలంగాణలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని గోయల్‌ ఆరోపించగా...తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటుచేయండంటూ కేంద్రమంత్రి అవమానించారని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. కేంద్రానికి వ్యవసాయ ఆత్మ లేదని, అది పక్కా వ్యాపారాత్మక ప్రభుత్వమని విమర్శించారు. వ్యవసాయాధారిత దేశాన్ని పాలించే ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు దానికి లేకపోవడం దౌర్భాగ్యమని నిప్పులు చెరిగారు.


ఒప్పందం మేరకు బియ్యం తీసుకుంటాం

రాష్ట్రాలు తాము సేకరించిన  బియ్యాన్ని స్థానిక అవసరాలకు తగినంత వాడుకొని మిగిలింది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేలా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం జరిగింది. అందుకు సంబంధించిన ఒప్పందపత్రం నా చేతుల్లో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ముడి బియ్యాన్ని మాత్రమే అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. సొంత అవసరాలకుపోను మిగిలిన బియ్యాన్నంతా ముడిరూపంలో కొనుగోలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నాం. అయితే కొంతమంది అక్కడి నేతలు నిరాధారమైన ఆరోపణలుచేస్తూ రైతులను తప్పుదోవపట్టిస్తున్నారు. దానిని తక్షణం ఆపాలి.

- కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌


తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలట

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మాతో చులకనగా, హేళనగా మాట్లాడారు. తెలివి తన సొంతమన్నట్లు.. గతంలో చెప్పానుగా అంటూ తేలికగా మాట్లాడారు. బియ్యం మాత్రమే తీసుకుంటాం అన్నారు.. యాసంగి పంటలో మా దగ్గర నూక వస్తుందని చెబితే మీ ప్రజలకు నూకలు అలవాటు చేయండంటూ తెలంగాణవారిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. బియ్యం కొనం... మీ ఖర్మ అన్నట్లు వ్యవహరించారు. ఈ పరాభవాన్ని ఎవరూ మర్చిపోరు. మరింత కసిగా పని చేస్తాం.. ప్రధానమంత్రిని ఇంటికి పంపే రోజు వస్తుంది. రాష్ట్ర రైతులను ఎలా ఆదుకోవాలో.. ఏం చేయాలో సీఎం కేసీఆర్‌కు తెలుసు. ఇక్కడి విషయాలను సీఎంకు తెలిపి ఆయన సూచనల మేరకు ముందుకు వెళతాం.

-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


ఆద్యంతం.. చిటపటలే...!
ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి,  రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్వాదం..

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో పండిన ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం మధ్య జరిగిన సమావేశంలో చర్చ ఆద్యంతం చిటపటలు.. మాటల యుద్ధంలానే సాగినట్లు సమాచారం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధాన్యం సేకరణపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖలు.. మంత్రి కేటీఆర్‌తో కలిసి తాము వచ్చినప్పుడు అంశాలను వివరిస్తుండగానే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఎదురుదాడి ప్రారంభించారు. పారాబాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను చూపుతూ ఎందుకు మాటతప్పుతున్నారంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి అంతే దీటుగా ఆయనకు బదులిచ్చారు. సమస్యను మీరు అర్థం చేసుకోవాలని.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తీరును, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని తెలుసుకోవాలన్నారు. మిగతా రాష్ట్రాల్లో లేని సమస్య.. మీ రాష్ట్రంలో ఎందుకు వస్తోంది? మీరు రాజకీయ ప్రయోజనాలకు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి అనడంతో.. ఆ అవసరం తమకు లేదని.. రైతు ప్రయోజనాల కోసమే తాము ప్రయత్నిస్తున్నామంటూ రాష్ట్ర మంత్రులు బదులిచ్చారు. పంజాబ్‌లో మాదిరే పంట అంతా కొనాలని రాష్ట్ర మంత్రులు కోరగా.. అక్కడ ఒక్కటే పంట అని పీయూష్‌ అన్నారు. మా దగ్గర యాసంగి ధాన్యం మర ఆడిస్తే నూక అవుతుందని రాష్ట్ర మంత్రులు తెలపగా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ సమయంలో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి అనగా.. మీరు కేంద్రంలో చెప్పే మాటలకు.. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో చెప్పే మాటలకు పొంతన లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

మీరు ధాన్యం కొనలేమంటారని.. మీవాళ్లు అక్కడ కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీలు ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, ప్రశాంత్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ధాన్యం సేకరణలో ఇప్పుడున్న విధానాన్ని ప్రజలకోసం మార్చాలని ప్రశాంత్‌రెడ్డి కోరగా మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మార్చండని పీయూష్‌ అన్నారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా అధికారం చేపడతామని, మీరు కూడా ఇద్దరితో మొదలై ప్రభుత్వం ఏర్పాటుచేసే వరకు వచ్చారుకదా? అని ప్రశాంత్‌రెడ్డి బదులిచ్చారు. మొత్తమ్మీద 40 నిమిషాలకుపైగా సాగిన సమావేశంలో చర్చ ఆద్యంతం మాటలయుద్ధంగానే సాగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని