CM KCR: సమరశంఖం పూరిద్దాం

తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణపై కేంద్రం మొద్దునిద్ర నటిస్తోందని, మరింత ఒత్తిడి పెంచి దాని వైఖరిని మార్చేందుకు పోరాటమే శరణ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Updated : 26 Mar 2022 04:45 IST

కేంద్రం మెడలు వంచేలా కార్యాచరణ
పెద్దఎత్తున ఆందోళనలతో తెలంగాణ తడాఖా చూపుదాం
ధాన్యం సేకరణ కోసం ఊరూరా తీర్మానాలు
2వ తేదీ తరువాత దిల్లీలో ధర్నాలు
పార్లమెంటులోనూ నిరసనలు
మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణపై కేంద్రం మొద్దునిద్ర నటిస్తోందని, మరింత ఒత్తిడి పెంచి దాని వైఖరిని మార్చేందుకు పోరాటమే శరణ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విన్నపాలను వినే పరిస్థితిలో కేంద్రం లేదని, దాంతో చర్చలు, వినతులు అవసరం లేదని తెలిపారు.

తెలంగాణ తడాఖా చూపుదామని,  ప్రకటించిన విధంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు చేద్దామని సూచించారు. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌లతో సీఎం శుక్రవారం సమావేశమయ్యారు.దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. దిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్‌కు వివరించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్ల కార్యాచరణపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘‘కేంద్రం తెలంగాణపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. తీవ్ర వివక్షను కొనసాగిస్తోంది. రాజకీయ కారణాలతో తమ ధర్మాన్ని విస్మరిస్తోంది. అత్యంత కీలకమైన అంశంపై కనీస పట్టింపు లేదు. రైతాంగంపై కరడుగట్టిన వ్యతిరేకతతో వ్యవహరిస్తోంది. ఎన్డీయే హయాంలో రైతులకు ఒరిగిందేమీ లేదని మరోసారి నిరూపించింది. ఇప్పటికే నల్లచట్టాలను తెచ్చి రైతులను బాధించిన కేంద్రం రాష్ట్ర రైతాంగాన్నీ ఇబ్బందులు పెడుతోంది. పంజాబ్‌ తరహా విధానం తెలంగాణలో అమలు చేయడానికి ఆటంకాలేమీ లేవు. పెద్దగా ఆర్థికభారం ఉండదు. కేంద్రం సేకరణకు ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా సహకరించేందుకు సంసిద్ధతను తెలియజేసినా... నిమ్మకు నీరెత్తినట్లు మొండితనం చూపుతోంది. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ పక్కా వ్యాపారిగా నిరూపించుకుంటున్నారు. రైతులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వచ్చి చూస్తే పరిస్థితి తెలుస్తుంది.

పోరు ఉద్ధృతం చేద్దాం  
కేంద్రంపై పోరు ఉద్ధృతం చేద్దాం. బహుముఖ ఒత్తిడి పెంచుదాం. పంజాబ్‌ తరహాలో ధాన్యం సేకరణ చేపట్టాలని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లాపరిషత్‌లు, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీలు, ఆత్మ కమిటీలు, పురపాలక సంఘాల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపుదాం.  పార్లమెంటులోనూ ఎంపీలు నిరసన తెలియజేస్తారు. రాష్ట్రంలో దశల వారీగా ఆందోళనలు కొనసాగిద్దాం. వచ్చే నెల రెండో తేదీ తర్వాత దిల్లీకి వెళ్లి ధర్నా చేద్దాం. ఈ పోరాటంలో ఇతర పార్టీల మద్దతు తీసుకుందాం. పోరాటం తీవ్రస్థాయికి చేరాలి. ఇందులో అన్నదాతలను భాగస్వాములను చేద్దాం. ఆందోళనలతో దిల్లీలో ప్రకంపనలు పుట్టిద్దాం. గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. విభజన హామీల అమలుపైనా నిలదీద్దాం. ఉగాది తరువాత కేంద్రం మెడలు వంచేలా కార్యాచరణ ఉంటుంది’’ అని సీఎం తెలిపారు.

నిర్దయగా కేంద్రం
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ‘‘కేంద్రం రైతాంగంపై పూర్తి నిర్దయతో ఉంది. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు. పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. రాష్ట్ర భాజపా నేతలు ఏమి చెబితే అదే చెబుతున్నారు తప్ప కనీస విషయపరిజ్ఞానం లేదు. కేంద్రం వైఫల్యాలను రాష్ట్రంపై రుద్దాలని చూస్తున్నారు’’ అని సీఎంకు వివరించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు శనివారం తెలంగాణ భవన్‌లో దిల్లీలోని పరిస్థితులు, రాష్ట్రంలో ఆందోళనలపై విలేకరుల సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని