Yadadri: కనులపండువగా కలశారాధన

యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువుల దర్శనాలకు శుభముహూర్తం సమీపిస్తున్న తరుణంలో మహాయాగం, ఇతర సంప్రదాయ క్రతువులు వైభవంగా కొనసాగుతున్నాయి.

Updated : 26 Mar 2022 05:15 IST

యాదాద్రిలో కొనసాగుతున్న మహాపర్వాలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువుల దర్శనాలకు శుభముహూర్తం సమీపిస్తున్న తరుణంలో మహాయాగం, ఇతర సంప్రదాయ క్రతువులు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం, సాయంత్రం ప్రధానాలయంలో శిల, లోహమూర్తులకు 49 కలశాలతో ప్రత్యేక అభిషేకం, పంచామృతాధివాసం నిర్వహించారు. మూర్తి, మూల మంత్ర పఠనంతో హోమం చేపట్టారు. బాలాలయంలో వేద మంత్రాలు, సామూహిక విష్ణు సహస్రనామ పఠనం మధ్య పంచకుండాత్మక మహాయాగం కొనసాగింది. పాంచరాత్ర ఆగమ విధానంలో ఈ మహాపర్వాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. మరోవైపు యాదాద్రీశుల ఆలయ ఉద్ఘాటనలో అత్యంత కీలకమైన మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు వసతులపై ఎమ్మెల్యే సునీత అధికారులతో సమీక్షించారు.

29 నుంచి ప్రధానాలయంలో నిత్యపూజలు, దర్శన వివరాలివీ..
యాదాద్రి ప్రధానాలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, దైవదర్శనాలు సమయాలను దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి ఇవి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం వెల్లడించింది.
* తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
* 3.30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన
* 4.00 గంటలకు బాలభోగం
* 4.30 గంటలకు నిజాభిషేకం
* 5.30 గంటలకు స్వామివారికి అలంకరణ
* 5.45 గంటలకు సహస్రనామార్చన, కుంకుమార్చన
* 6.30 గంటలకు సర్వదర్శనం మొదలు
* 8.00 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం
* 9.00 గంటలకు సర్వదర్శనం
* మధ్యాహ్నం 12 గంటలకు రాజభోగం (ఆరగింపు)
* 12.45 గంటలకు సర్వదర్శనం
* సా. 4 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం
* 5 గంటలకు సర్వదర్శనం
* రాత్రి 7 గంటలకు తిరు ఆరాధన
* 7.30 గంటలకు సహస్రనామార్చన, కుంకుమార్చన
* 8.15 గంటలకు సర్వ దర్శనం
* 9.15 గంటలకు రాత్రి నివేదన (ఆరగింపు)
* 9.45 గంటలకు శయనోత్సవం, ద్వారబంధనం
* రోజూ ఉదయం 6.30 నుంచి రాత్రి   9.15 మధ్య దర్శన వేళల్లో సువర్ణ పుష్పార్చన/వేదాశీర్వచనం
* ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు సుదర్శన హోమం
* ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం   12 గంటల వరకు శ్రీస్వామివారి నిత్యకల్యాణం/బ్రహ్మోత్సవం
* సాయంత్రం 5 గంటలకు వెండి మొక్కు జోడు సేవలు
* సాయంత్రం 6.45 గంటలకు దర్బార్‌ సేవ
* ప్రతి మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ
* ప్రతి శుక్రవారం సా. 5 గంటలకు అమ్మవారికి ఉత్సవ సేవ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని