Andhra News: అమరావతిని కదిలించే వ్యక్తి పుట్టలేదు: భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి కదిలించే శక్తి, వ్యక్తి ఈ దేశంలో ఎవరూ పుట్టలేదని, పుట్టబోరని భాజపా జాతీయ కార్యదర్శి, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ సహ ఇన్‌ఛార్జి, అండమాన్‌

Published : 28 Mar 2022 08:29 IST

పరిపాలన తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి కదిలించే శక్తి, వ్యక్తి ఈ దేశంలో ఎవరూ పుట్టలేదని, పుట్టబోరని భాజపా జాతీయ కార్యదర్శి, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ సహ ఇన్‌ఛార్జి, అండమాన్‌ నికోబార్‌లో పార్టీ ఇన్‌ఛార్జి సత్యకుమార్‌ పేర్కొన్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిపాలన అంటే ఏమిటో అర్థం, నిర్వచనం తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. జగన్‌ దృష్టిలో పరిపాలన అంటే మద్యం అమ్ముకోవడం, రంగులు వేసుకోవడం, ఐఏఎస్‌లతో టికెట్లు అమ్మించడం, ఉపాధ్యాయులతో మద్యం అమ్మించడం, సచివాలయ ఉద్యోగులతో మరుగుదొడ్లు కడిగించటమేనని వ్యాఖ్యానించారు. మోదీ 21 ఏళ్లుగా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి హోదాల్లో పని చేసినా ఎక్కడా చిన్న అవినీతి ఆరోపణైనా రాలేదని... అదే జగన్‌ లాంటి వ్యక్తి ఒక్కసారి ముఖ్యమంత్రి అయి ఏకంగా 20-30 తరాలకు సరిపడా సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉచితాల పేరుతో ప్రజల్ని జగన్‌ మోసం చేస్తున్నారని, ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో మరింత లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ఏపీ కంటే వెనుకబడిన ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఉచితాలేవీ ఇవ్వట్లేదని చెప్పారు. లైవ్‌ భారత్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వల్లూరి జయప్రకాశ్‌ నారాయణ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి భాజపా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్‌ మాట్లాడారు. ‘రాజధానిగా అమరావతిని ఖరారు చేసినప్పుడు అసెంబ్లీలో మద్దతు తెలిపిన జగన్‌.. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత వ్యక్తిగత కక్షలతో రాజధానిని మార్చేస్తానని, అదే పరిపాలన వికేంద్రీకరణని అంటున్నారు. వికేంద్రీకరణ అంటే ఇది కాదు జగన్‌మోహన్‌రెడ్డీ..! 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వడం, 29 అంశాల్ని వారికి బదలాయించడం అసలైన వికేంద్రీకరణ. అది చేయలేదు సరికదా.. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం  గత నాలుగేళ్లలో మంజూరు చేసిన రూ.7,800 కోట్లు వారికి అందకుండా మింగేశారు. అసలు మీకు పరిపాలన వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలుసా?’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉండాలి. అది రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. అందుకే అమరావతి నుంచి రాజధానిని కదిలించేందుకు ఎవరు ప్రయత్నించినా భాజపా అడ్డుకుంటుంది’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని