CM KCR: ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులను ఆదుకుందాం

ఉక్రెయిన్‌పై దాడి కారణంగా ఆ దేశం వదిలి వచ్చిన 20 వేలమంది భారతీయ విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఇక్కడే వైద్యవిద్యను పూర్తి చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 30 Mar 2022 05:44 IST

  ఇక్కడ వైద్యవిద్య కొనసాగించే అవకాశం కల్పిద్దాం  

  ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

700 మంది తెలంగాణవారి ఖర్చు భరిస్తామని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌పై దాడి కారణంగా ఆ దేశం వదిలి వచ్చిన 20 వేలమంది భారతీయ విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఇక్కడే వైద్యవిద్యను పూర్తి చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో నిబంధనలను సవరించి, వారు ఇక్కడి వైద్య కళాశాల్లో చేరేందుకు అనుమతించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఏర్పడిన భయానక పరిస్థితుల వల్ల విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో స్వస్థలాలకు తిరిగి వచ్చేశారు. ఎంతో ఖర్చు పెట్టుకుని వెళ్లిన వారికి చదువు మధ్యలో నిలిచిపోవడం బాధాకరం. మధ్యతరగతి కుటుంబాలవారు తమ పిల్లలకు విదేశాల్లో విద్య కోసం సంపాదనంతా వెచ్చించారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ విద్యార్థులను ఆదుకునేందుకు చొరవ చూపాలి. అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ సమస్యను ప్రత్యేకాంశంగా పరిగణించి, వారు చదువు కొనసాగించేందుకు సాయం చేయాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించి వైద్యకళాశాలల్లో సమాన సెమిస్టర్‌ విధానంలో చేరడానికి వెసులుబాటు కల్పించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సీట్లను పెంచాలి. తెలంగాణకు చెందిన 700 మంది విద్యార్థుల రుసుములను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై వెంటనే స్పందించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలి’’ అని ప్రధానిని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని