Telangana News: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ షురూ

రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం

Published : 30 Mar 2022 05:42 IST

  వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆర్థికశాఖ ఉత్తర్వులు

11,103 మందికి లబ్ధి కలిగే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. 11,103 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శాఖలవారీగా ప్రతిపాదనలను పంపాలని ఆదేశించింది. ఇప్పటికే మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నవారి క్రమబద్ధీకరణపైనా స్పష్టతను ఇచ్చింది. ఈ ప్రక్రియలో రోస్టర్‌, రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపింది. క్రమబద్ధీకరణకు సంబంధించి 2016 ఫిబ్రవరి 29న ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 16 అమలవుతుందని తెలిపారు.

ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలివి..

సంబంధిత శాఖలోని పోస్టుల మేరకు క్రమబద్ధీకరిస్తారు.
*  నెలవారీ వేతనంతో నియమితులైన పూర్తికాలం (ఫుల్‌టైం) కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది.
* 2014 జూన్‌ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నవారితో పాటు తెలంగాణ ఆవిర్భావం తర్వాత వెంటనే కాంట్రాక్టు విధానంలో నియమితులై.. క్రమబద్ధీకరణకు ప్రతిపాదించిన తేదీ వరకు విధుల్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది.
* ఉద్యోగ నిర్వహణలో ప్రత్యేక సెలవులు ఉండే విద్యా శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అనధికారికంగా గైర్హాజరైన వారికి, క్రమశిక్షణ కేసులు ఎదుర్కొంటున్నవారికి ఈ ప్రత్యేక సెలవులు పరిగణనలోకి తీసుకోరు.
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో బ్యాక్‌లాగ్‌ రిజర్వేషన్‌ ఏర్పడితే దీన్ని సంబంధిత కేటగిరీకి చెందిన బ్యాక్‌లాగ్‌ ఖాళీగానే పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని