Published : 30 Mar 2022 05:39 IST

Telangana News: కాంగ్రెస్‌ X తెరాస

 ధాన్యం కొనుగోలు అంశాన్ని భాజపా, తెరాస రాజకీయం చేస్తున్నాయని రాహుల్‌ ట్వీట్‌

కాంగ్రెస్‌ అగ్రనేత వ్యాఖ్యలను తప్పుపట్టిన కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావు

వారి విమర్శలపై స్పందించిన రేవంత్‌, ఠాగూర్‌

గాంధీభవన్‌-న్యూస్‌టుడే, ఈనాడు- దిల్లీ, హైదరాబాద్‌: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌ మంగళవారం రాజకీయ దుమారం రేపింది. దానిపై తెరాస, కాంగ్రెస్‌ నేతల మధ్య ట్వీట్ల వార్‌ కొనసాగింది. రాహుల్‌ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్‌రావులు తప్పుపట్టగా.. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌లు రీట్వీట్‌ చేశారు. మరికొందరు తెరాస, కాంగ్రెస్‌ నాయకులూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు.


చివరి గింజ కొనేవరకూ కొట్లాడతాం: రాహుల్‌

తొలుత రాహుల్‌ గాంధీ తెలుగులో ట్వీట్‌ చేస్తూ.. ‘‘తెలంగాణలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో భాజపా, తెరాస ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభపెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజనూ కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజను కొనేవరకూ రైతుల తరఫున కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్‌

దశాబ్దాలుగా రైతులను విస్మరించిన కాంగ్రెస్‌ దేశంలోని రైతులకు క్షమాపణలు చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో డిమాండు చేశారు. ఎన్నో విజ్ఞప్తులు చేసినా తెలంగాణలోని ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత జాతీయపార్టీగా కాంగ్రెస్‌కు ఉందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎంపీ రాహుల్‌గాంధీకి తప్పుడు సమాచారమిచ్చి, ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘రాహుల్‌ జీ, మీపార్టీకి 50 ఏళ్లకు పైగా ఈ దేశాన్ని పాలించే అవకాశం లభించింది. కానీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు, ఆత్మహత్యలకు కారణమైన కరెంటు సమస్యను పరిష్కరించలేకపోయింది. కనీసం ఆరు గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయింది. తెరాస ప్రభుత్వ పాలనతో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలన సిగ్గుచేటుగా ఉంది. తెలంగాణ గత ఏడేళ్లుగా అన్నదాతలతో పాటు ప్రజలకు నిరంతర విద్యుత్‌నిస్తోంది. సాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్‌ 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించింది’’ అని తెలిపారు.


పార్లమెంటులో పోరాడండి: కవిత, హరీశ్‌

రాహుల్‌ ట్వీట్‌పై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తోంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని తెరాస ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్‌లో వెల్‌లోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారు. మీకు నిజాయతీ ఉంటే ట్విటర్‌లో కాదు పార్లమెంట్‌లో పోరాటం చేయండి. ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిలబడాలి. ఒకే దేశం- ఒకే ధాన్యం సేకరణ విధానం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయండి. ఎంపీ మాణికం ఠాగూర్‌ లాంటి వారి దురహంకారం వల్లే లోక్‌సభలో ఆ పార్టీ రెడంకెలకు దిగజారింది. నేను గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలతో ఉంటా. రాహుల్‌ గాంధీలా నియోజకవర్గాన్ని వదిలి నియోజకవర్గాన్ని పారిపోలేదు’’ అని ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు. హరీశ్‌రావు తన ట్వీట్‌లో ‘తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో మా ఎంపీలతో కలిసి ఆందోళన చేయండి. రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టండి’’ అని సూచించారు. రాహుల్‌కు తెలంగాణ రైతులు ఇప్పుడు గుర్తుకురావడం శోచనీయమని.. కాంగ్రెస్‌, భాజపాలు ధాన్యం సేకరణపై తోడుదొంగల్లా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ పీయూసీ ఛైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి విమర్శించారు.


తెరాస ఎంపీలు కాలక్షేపం చేస్తున్నారు: రేవంత్‌

కవిత ట్వీట్‌పై పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రతిస్పందించారు. ‘‘తెరాస ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం అనేది అబద్ధం. వారు సెంట్రల్‌ హాల్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేసీఆర్‌ గత ఆగస్టులోనే ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’’ అన్నారు. హరీశ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... ‘‘మామ చల్లనిచూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోంది’’ అంటూ భవిష్యత్‌లో పారాబాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని ఒప్పందం పత్రంపై కేసీఆర్‌ సంతకం పెట్టిన లేఖ ప్రతిని పోస్ట్‌ చేశారు. తమ పార్టీ సెంట్రల్‌ హాల్‌లో ఫొటో షూట్‌ చేయదని, రైతుల కోసం నిఖార్సైన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకొని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచారంటూ రాహుల్‌కు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కవిత ట్వీట్‌పై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ సైతం స్పందించారు. ‘‘మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందుకే నిజామాబాద్‌ పసుపు రైతులు ఓడించారు. తెలంగాణ రైతుల జీవితాలతో ఆడుకోవద్దు’ అని సూచించారు.


రాజీనామాకు సిద్ధమా: కోమటిరెడ్డి

ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్రానికి చెందిన తాము ముగ్గురం (కాంగ్రెస్‌ ఎంపీలు) రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని.. తెరాస ఎంపీలు సిద్ధమా అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. తాము జంతర్‌మంతర్‌లో దీక్షకు దిగుతామని.. తెరాస ఎంపీలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ వచ్చి తమతో కలిసి పోరాడాలని ఆయన సూచించారు. రాహుల్‌పై కవిత వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఇతర నేతలు ఖండించారు.


 

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని